అమరావతి: మూడు రాజధానులకు మద్దతుగా ఉద్దండరాయునిపాలెంలో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 915 రోజులుగా దీక్ష చేస్తున్న వారిపై దాడికి ప్రేరేపించిన చంద్రబాబును, దాడికి పాల్పడిన బీజేపీ నేతలు ఆదినారాయణరెడ్డి, సత్యకుమార్‌ను వెంటనే అరెస్టు చేయాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ డిమాండ్ చేశారు. ప్రశాంతంగా దీక్ష చేస్తున్న దళిత మహిళలు, యువత, వృద్ధులపై దాడికి పాల్పడిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా దీక్ష చేస్తున్న వారిపై దాడిని ఎంపీ నందిగం సురేష్ తీవ్రంగా ఖండించారు. మహిళలు అని కూడా చూడకుండా అసభ్యకరంగా మాట్లాడి దాడులు చేశారన్నారు. ఆదినారాయణరెడ్డి పిచ్చోడిలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. సత్యకుమార్ అనుచరులు దళితులపై దాడి చేశారన్నారు. `ఆదినారాయణరెడ్డి నీకు దమ్మూ, ధైర్యం ఉంటే.. కుక్కలా మొరిగివెళ్లడం కాదు.. 4 గంటలు కాదు.. 10, 11 గంటలైనా ఇదే సెంటర్‌లో ఉంటాం.. నువ్వో, నేనో తేల్చుకుందాం` అని ఎంపీ నందిగం సురేష్ సవాల్ విసిరారు. బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి అనే వ్యక్తిని కార్లలో ఎక్కించుకొని దాచి మరీ తరలించారన్నారు. దీక్ష చేస్తున్న టెంటు దగ్గర జరిగిన గొడవలో ఆదినారాయణరెడ్డి కూడా భాగస్వామి అన్నారు. అందరూ మౌనంగా ఉన్న సమయంలో టెంట్ దగ్గరకు వచ్చి తొడగొట్టి ఇష్టానుసారంగా దాడిచేశాడని మండిపడ్డారు. మహిళలపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. మొదటి ముద్దాయిగా చంద్రబాబును, రెండో ముద్దాయిగా ఆదినారాయణరెడ్డిని, మూడో ముద్దాయిగా సత్యకుమార్‌ను చేర్చాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా వారిలో ఇంకా దుర్మార్గమైన ఆలోచనలు పోలేదని, దాడికి పాల్పడిన వారిని కచ్చితంగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.