అమరావతిలో పేదలు ఉండకూడదా..?

పేదల ఇళ్ల పట్టాల పంపిణీని ఎందుకు అడ్డుకున్నారు..?

అమరావతిలో పేదలుండటం చంద్రబాబుకు ఇష్టం లేదా..?

ఐదేళ్లు అధికారంలో ఉండి రైతులకు ఎందుకు న్యాయం చేయలేదు..?

చంద్రబాబుకు వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ నందిగం సురేష్‌ సూటిప్రశ్నలు

తాడేపల్లి: దసరా వేషగాడిలా 18 నెలల తర్వాత అమరావతికి వచ్చిన చంద్రబాబు.. ఇవ్వాల్సినవి తీసుకొని మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లిపోతాడని, అమరావతి టూరిస్టులా చంద్రబాబు మారిపోయాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్‌ విమర్శించారు. అమరావతిలో బ్రహ్మాండమైన రాజధాని కడతానని ప్రగల్భాలు పలికి.. పేదలు, అన్ని సామాజిక వర్గాల నుంచి 53 వేల ఎకరాల భూములు కాజేసి తన బినామీలకు, తాబేదారులకు కట్టబెట్టాడని మండిపడ్డారు. ఒక సామాజికవర్గానికి సంబంధించి 29 గ్రామాల్లో తన బినామీలు కొనుగోలు చేసిన భూముల కోసం అమరావతి ఆరాటం తప్ప బాబు దగ్గర పోరాటం లేదు. అమరావతిలో రాజధాని ఎవరి కోసం పెట్టారని ప్రశ్నించారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ నందిగం సురేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దానని చంద్రబాబు చెప్పుకుంటున్నాడని, ఐదేళ్లలో  వేల కోట్ల స్కాములు చేసి అమరావతిని భ్రమరావతిగా మిగిల్చాడని ధ్వజమెత్తారు. అమరావతిలో నిజమైన రైతులు నష్టపోవడానికి చంద్రబాబే కారణమన్నారు. అమరావతిని తన సామాజిక వర్గానికి, తన బినామీలకు అనుకూలంగా ఉండాలి, భూముల రేట్లు పెరగాలనే ఉద్యమం చేయిస్తున్నాడని, ఫండింగ్‌ రూపంలో విదేశీల నుంచి సేకరించిన డబ్బులను కొంత నొక్కేసి.. కొంత ఖర్చుపెట్టి దీక్షలు చేయిస్తున్నాడని మండిపడ్డారు. 

అమరావతిలో పేదవాడికి స్థానం ఉందా..? అని చంద్రబాబును ఎంపీ నందిగం సురేష్‌ ప్రశ్నించారు. ఒకవేళ ఉంటే.. రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రభుత్వం 54 వేల ఇళ్ల పట్టాలు పేదలకు ఇస్తానంటే కోర్టుకు వెళ్లి ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదా అని ధ్వజమెత్తారు. ఐదేళ్లు అధికారంలో ఉండి అమరావతి రైతులకు ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు. నిజమైన రైతులను చంద్రబాబు నిలువునా ముంచేశాడని మండిపడ్డారు.
 

Back to Top