ఇంకెంతకాలం బాబుకు ఊడిగం చేస్తారు?

వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఫైర్

 ఉత్తరాంధ్రను రాజధానిగానే వద్దనే మీరు సేవ్ చేస్తారా..?
 
ఉత్తరాంధ్రను కబ్జా చేసింది బాబు.. సేవ్ చేస్తుంది సీఎం జగన్ 

 రిషికొండపై ప్రభుత్వ కార్యాలయాలు కడితే తప్పేంటి..?

 అయ్యన్నపాత్రుడి గంజాయి మాఫియాను బయటపెట్టింది మీరే కదా..?

 ఉత్తరాంధ్ర నీళ్ళు తాగి.. ఈ ప్రాంతంపై విషం చిమ్మొద్దు

 విశాఖ‌:  ఉత్త‌రాంధ్ర‌కు ద్రోహం చేసి ఇంకెంత కాలం చంద్ర‌బాబుకు ఊడిగం చేస్తార‌ని ఆ ప్రాంత టీడీపీ నేత‌ల‌ను వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వ‌రుదు క‌ల్యాణి ప్ర‌శ్నించారు.  గత రెండు రోజులుగా సేవ్ విశాఖ అంటూ టీడీపీ పదిమందిని పోగేసి, ఒక హైడ్రామాను నడిపిస్తుంది. విశాఖను పరిపాలనా రాజధానిగా వద్దనే ఉత్తరాంధ్ర ద్రోహులు, విశాఖ ద్రోహులైన మీరు.. విశాఖను సేవ్ చేస్తారా.. అది ప్రజలు నమ్మాలా..? అని నిల‌దీశారు. టీడీపీ మాటలు, చేష్టలు చూస్తే... అదొక తెలుగు డ్రామాల పార్టీగా తయారైంది. విశాఖ పరిపాలన రాజధాని కావడం ఇష్టం లేక, విశాఖ నగరానికి ఏదోఅయిపోతుందని, కబ్జాలు జరుగుతున్నాయని, గంజాయి మాఫియా తయారవుతుందని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవానికి విశాఖలో భూకబ్జాలు జరిగిందీ, గంజాయి మాఫియా తయారైందీ..  చంద్రబాబు హయాంలోనే, వారి ప్రభుత్వం అండదండలతోనే. మరోవైపు, వచ్చే నెల 11, 12 తేదీల్లో  ముఖ్యమంత్రి జగన్ గారితో కలిసి విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీగారు వస్తున్న నేపథ్యంలో.. విశాఖ బ్రాండ్ ఇమేజ్ తగ్గించేందుకు టీడీపీ ఇటువంటి డ్రామాలకు పాల్పడుతుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. శ‌నివారం వ‌రుదు క‌ల్యాణి మీడియాతో మాట్లాడారు.

బాబుకు ఇంకెంతకాలం ఊడిగం చేస్తారు?
            ఉత్తరాంధ్రపై లేని ప్రేమను ఒలకబోస్తున్న టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ  ప్రాంత ప్రజల ఓట్లతో ఎన్నో పదవులు అనుభవించిన మీరు.. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల నోటికాడ తిండిని తన్నేస్తారా..? తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దే నైజం టీడీపీది.  మీకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ లేదు, మమకారం లేదు. చంద్రబాబు కుట్రల్లో భాగమై, ఉత్తరాంధ్రకు ద్రోహం చేయడమే మీ ఎజెండా.  మీకు ఉత్తరాంధ్ర సెంటి మెంటు లేకపోగా... చంద్రబాబు అవినీతిమీద సెంటిమెంటు పెంచుకున్నారు.  ఎంతకాలం చంద్రబాబుకు ఊడిగం చేస్తూ బతుకుతారు.. ఆయన కాలి కింద చెప్పులా ఇంకా ఎంతకాలం పడి ఉంటారు.. మీకు ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం లేదా..?. మీకు ఏంతో చేసిన ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేయొద్దు. ఇంకా మీరు విషం చిమ్మితే.. ఉత్తరాంధ్ర ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారు. భావితరాలవారు మిమ్మల్ని క్షమించరు, ఛీ కొడతారు. 

రిషికొండపై ప్రభుత్వ కార్యాలయాలు కడితే తప్పేంటి..?
            విశాఖను వీళ్ళు సేవ్ చేయడం కాదు.. టీడీపీ కబ్జా కోరల నుంచి ఉత్తరాంధ్రను సేవ్ చేయమని ఈ  ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. విశాఖలో లక్షల కోట్ల రూపాయల భూ కబ్జాలు చేసిన మీరే.. కబ్జాలంటూ అరిస్తే.. ప్రజలు మిమ్మల్నే అసహ్యించుకుంటున్నారు. రిషికొండను ముట్టడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, రిషికొండ... ఆరోజూ టూరిజం  ప్రాజెక్టుగానే అభివృద్ధి చెందుతుందీ, ఈరోజూ టూరిజం ప్రాజెక్టు కిందే అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వ స్థలమైన రుషికొండను ప్రభుత్వ కార్యాలయాల కోసం అభివృద్ధి చేస్తే తప్పేంటి..?. హైదరాబాద్ లో జూబ్లీహిల్స్, బంజారా  హిల్స్ ఎక్కడ ఉన్నాయి, కొండల మీద కాదా..?. హైదరాబాద్ లో చంద్రబాబు ఇల్లు ఎక్కడ ఉంది కొండల మీద కాదా..?. పర్యావరణానికి ఏమైనా ఇబ్బంది కలిగితే న్యాయస్థానాలు చూసుకుంటాయి. ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ కట్టడాలు కట్టుకుంటుంటే.. మీకేంటి సమస్య..?

టీడీపీ హయాంలోనే భూకబ్జాలు.. జగన్ గారు భూములు కాపాడుతున్నారు
                ఆహా టీవీలో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు - బాలకృష్ణ కూర్చుని, ఆయన ఆశయ సాధన కోసమే వెన్నుపోటు పొడిచేశామని గొప్పగా మాట్లాడినట్టే.. ఈరోజు విశాఖలో కబ్జాలు చేసినవారే.. కబ్జాలని మాట్లాడుతున్నారు. నాకంటే పెద్ద నటుడు చంద్రబాబు అని ఆనాడే ఎన్టీఆర్ చెప్పారు. టీడీపీ డ్రామాలను ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మరు. టీడీపీ అంటే తెలుగు దోపిడీ పార్టీగా తయారైంది. ఎక్కడ భూములు కొట్టేద్దామా.. అన్న ఆలోచనే తప్ప అభివృద్ధి అన్నది వాళ్ళ విధానమే కాదు. అమరావతి పేరుతో భూములు కొట్టేసేందుకే చంద్రబాబు భారీ కుట్రకు తెరలేపారు. ఆ కుట్రను అడ్డుకుంటే.. యాత్రల పేరుతో రాద్ధాంతం చేస్తున్నారు.  వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక భూములను కాపాడుతున్నారు.  విశాఖపట్నంలో 430 ఎకరాలను భూకబ్జాల నుంచి సేవ్ చేసింది మీరా.. మేమా..?. మొత్తంగా విశాఖలో రూ. 2600 కోట్ల ప్రభుత్వ భూములను రక్షించింది మీరా.. మేమా..?. 
అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనితలు కబ్జాల గురించి మాట్లాడుతున్నాడు. ఇరిగేషన్ స్థలాన్ని కబ్జా చేసి, ఇల్లు కట్టి, నోటీసులు ఇవ్వటానికి వస్తే, సమాధానం చెప్పలేక పారిపోయిన అయ్యన్నపాత్రుడు, ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే అమ్మిన అనితలు కబ్జాల గురించి నీతులు చెబుతున్నారు. 

అయ్యన్నపాత్రుడి గంజాయి మాఫియాను బయటపెట్టింది మీరే కదా..?
ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించాక, రాజధాని కట్టే అవకాశం టీడీపీకి వస్తే.. చంద్రబాబు అమరావతి పేరుతో దోపిడీ చేశారు. ఒక సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడం అంటే, దోపిడీ చేయడమే చంద్రబాబు విధానం. అక్రమాలు జరగకుండా ఎస్ఈబీని ఏర్పాటు చేసి, గంజాయి, అక్రమ మైనింగ్ లపై ఉక్కుపాదం మోపి, అణచివేసింది జగన్ గారు. ఆపరేషన్ పరివర్తన ద్వారా.. ఏజెన్సీ ప్రాంతంలో దాదాపు 7 వేల ఎకరాల గంజాయి తోటలను అక్కడి ప్రజలతో తగలబెట్టించారు. ఆ భూముల్లో ఇప్పుడు రాజ్మా, చిక్కుళ్ళు తదితర కూరగాయల పంటలు పండిస్తున్నది వాస్తవం కాదా..?. గంజాయి తోటలకు పేరుగాంచింన నర్సీపట్నం నియోజకవర్గానికి ఎక్కువ కాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిందీ, గంజాయి మాఫియాను  పెంచి పోషించిందీ అయ్యన్నపాత్రుడు కాదా.. ?. విశాఖపట్నాన్ని, గంజాయి కేంద్రంగా తయారు చేసి, నర్సీపట్నం నుంచే  గంజాయిని దేశవ్యాప్తంగా అక్రమ రవాణా చేస్తున్నారని టీడీపీ హయాంలో అయ్యన్నపాత్రుడు సహచర మంత్రే మీడియా సాక్షిగా చెప్పాడు. అక్రమ మైనింగ్ లు చేస్తూ,  చనిపోయింది టీడీపీ ఎమ్మెల్యే కాదా..?.  ఇసుక ఉచితంగా ఇస్తామని దోచుకుంది మీరు కాదా..?.  లేటరైట్ మైనింగ్ దోచుకుంది మీరు కాదా..?. ఈరోజు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రి అయ్యాక, ఇసుక, మైనింగ్ పై ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేసి, నిఘా పెంచి,  ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగేలా చేస్తున్నారు. 

ఉత్తరాంధ్రకు బాబు ఏం చేశాడు..?
        ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి టీడీపీ నేతలు మాట్లాడుతుంటే.. జనం నవ్వుకుంటున్నారు. 14 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి, ఉత్తరాంధ్రకు ఒక్క ప్రాజెక్టు తెచ్చారా.. ఒక మెడికల్ కాలేజీ.. ఒక ఇంజినీరింగ్ కాలేజీ.. ఒక సాగు నీటి ప్రాజెక్టు పూర్తి చేశారా.. ?. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక- జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక, విశాఖపట్నానికి ఇన్ఫోసిస్, ఏటీసీ టైర్ల కంపెనీ, అదానీ డేటా సెంటర్, నర్సీపట్నం, పాడేరు, పార్వతీపురంలో మెడికల్ కాలేజీలు, బీచ్ క్యారిడార్, ఉద్దానంకు రూ. 700 కోట్లతో మంచి నీటి సౌకర్యం, కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి.. ఇవన్నీ వచ్చాయి. రానున్న కాలంలో విశాఖను పరిపాలన రాజధానిగా జగన్ గారు చేసి తీరతారు. 

ఉన్మాదం, శాడిజం టీడీపీదే..
        ఉన్మాదం, శాడిజం అంటూ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతున్నాడు.  పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడవటం ఉన్మాదం, శాడిజం అంటే. ఐ-టీడీపీ పేరుతో, లోకేష్ ఆధ్వర్యంలో మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టించడం ఉన్మాదం అంటే. మహిళా పార్లమెంటేరియన్ సమావేశానికి వచ్చిన మా పార్టీ ఎమ్మెల్యే రోజాను నిర్బంధించి,  రెండు రాష్ట్రాల్లో తిప్పి వేధించడం శాడిజం అంటే. మహిళా అధికారులను వేధింపులకు గురిచేసి,  కాల్ మనీ రాకెట్ ను ప్రోత్సహించటం ఉన్మాదం అంటే. 

- అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ళలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన 98.4 శాతం హామీలను నెరవేర్చడం శాడిజమా..?. లేక 600కు పైగా హామీలు ఇచ్చి, ఏ ఒక్కటీ నెరవేర్చకుండా మేనిఫెస్టోను మాయం చేయడం శాడిజమా..?. రైతులకు రుణ మాఫీ ఎగ్గొట్టిన మీది శాడిజమా.. రైతులకు రూ. 1.30 లక్షల కోట్లు ఖర్చు చేసిన మాదా?.  డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తానని ఎగ్గొట్టిన మీది శాడిజమా.. లేక వైఎస్ఆర్ ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలకు రూ. 25 వేల కోట్లు రుణ మాఫీ చేస్తున్న మాదా..?. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని ఎగ్గొట్టిన మీది శాడిజమా.. లేక, మూడేళ్ళలోనే 6 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన మాదా..?. 
- ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసే ధైర్యమే లేని మీరు,  అధికారంలోకి వస్తారా.. ?. ఉత్తరాంధ్ర నీళ్ళు తాగి.. ఈ ప్రాంతంపై విషం చిమ్ముతున్న మీరు ఇప్పటికైనా బుద్ధి మార్చుకోండి. లేకుంటే, ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని వెంటపడి మరీ కొడతారు అని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి హెచ్చరించారు.

తాజా వీడియోలు

Back to Top