పేదలకు ఇళ్లు ఇస్తుంటే చంద్రబాబుకు ఎందుకు కడుపుమంట

రాజధాని ప్రాంతంలో పేద ప్రజలు నివసించకూడదా..?

పేద ప్రజలకు వ్యతిరేకమైన ఆలోచనలు మానుకో బాబూ..

పవిత్రమైన ప్రదేశంలోనూ పేదవాడికి స్థానం ఉండాలనేది సీఎం వైయస్‌ జగన్‌ ఉద్దేశం

పేదల ఇళ్ల విషయంలో హైకోర్టు జడ్జిమెంట్‌ను వామపక్షాలు, ప్రజాసంఘాలు స్వాగతించాలి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌

తాడేపల్లి: అతి పవిత్రమైన ప్రదేశంలోనూ పేదవాడికి స్థానం ఉండాలనేది ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్దేశమని, అమరావతి అయినా, విశాఖ అయినా.. పేదవాడికి సొంత ఇళ్లు ఉండాలని సీఎం భావిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ అన్నారు. పేదల పక్షాన నిలిచేవారంతా ఇళ్ల స్థలాల విషయంలో జీవో–45ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించాలన్నారు. పేద ప్రజలకు వ్యతిరేకమైన ఆలోచనలు చంద్రబాబు మానుకోవాలన్నారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణంపై హైకోర్టు తీర్పును పేదల పక్షాన పోరాడే వామపక్షాలు, ప్రజా సంఘాలు స్వాగతించాలన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అమరావతి అయినా, విశాఖపట్నం అయినా ఏ ప్రాంతమైనా సరే రాజధానిలో అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. సుప్రీం కోర్టు జడ్జిమెంట్‌ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక బాధ్యత ఉంది. అశ్వినీకుమార్‌ అనే కేసులో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పును సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం శిరసావహిస్తోంది. పేద ప్రజలు రాజధానిలో ఉండటాన్ని చంద్రబాబు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండా విట్, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలకు చంద్రబాబు భూములు ఎలా కేటాయించారు. పేద ప్రజలు రాజధానిలో ఉండకూడదనేది చంద్రబాబు ఉద్దేశం. కానీ, సీఎం వైయస్‌ జగన్‌ ప్రతి పేదవాడికి ఇళ్లు ఉండాలని భావిస్తున్నారు.. అది అమరావతి అయినా, విశాఖ అయినా ప్రతి పవిత్రమైన ప్రదేశంలోనూ పేదవాడికి స్థానం ఉండాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశం. 

పేద ప్రజలకు వ్యతిరేకంగా చేసే ఆలోచనను ఉపసంహరించుకోవాలని తెలుగుదేశం పార్టీని కోరుతున్నాను. నిన్న కార్ల్‌ మార్క్స్‌ జయంతి, గౌతమ బుద్ధుడి జయంతి వేడుకలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జీవో–45ని సమర్థిస్తూ రాజధానిలో పేదలు ఉండొచ్చు, వారికి ఇళ్ల నిర్మాణం చేయండి అని జడ్జిమెంట్‌ ఇచ్చింది. కనీసం మార్క్స్, బుద్ధుడి జయంతి రోజు అయినా ఇళ్ల స్థలాల జడ్జిమెంట్‌ను స్వాగతిస్తూ పేదల పక్షాన వామపక్షాలు మాట్లాడాలి కదా.. ఊరికే దండలు వేసి కొలిస్తే సరిపోదు.. వారి మహనీయుల ఆశయాలను కూడా గౌరవించాలి. పేదల పక్షాన ఉండేవారంతా హైకోర్టు జడ్జిమెంట్‌ను స్వాగతించాలి. పేదలకు సొంతిళ్లు ఉండాలనే బాధ్యతను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ భుజానికెత్తుకున్నారు. 30 లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలు అందజేశారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లు ఇవ్వొద్దంటూ సుప్రీం కోర్టుకు వెళ్లడం సమర్థనీయమేనా చంద్రబాబు..? పేద ప్రజల నివాసాలను వ్యతిరేకించే ఆలోచనలను మానుకోవాలి’’ అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ సూచించారు.

Back to Top