అసెంబ్లీ: ప్రశాంత వాతావరణాన్ని చంద్రబాబు సహించలేడని, అందుకే ప్రజా సమస్యలపై చర్చ జరిగే చట్ట సభలో టీడీపీ సభ్యులతో రోజుకో రచ్చ చేయిస్తున్నాడని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి ధ్వజమెత్తారు. చట్టసభలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు చేసిన సంఘటన బాధ కలిగిస్తోందన్నారు. స్పీకర్ పట్ల టీడీపీ సభ్యులు దారుణంగా ప్రవర్తించారన్నారు. సభ్యులంతా పవిత్రంగా భావించే స్పీకర్ చైర్ మీద, స్పీకర్ మీద దాడి చేయడం హేయమన్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న నాటకం అని చాలా స్పష్టంగా అర్థం అవుతుందన్నారు.
చదువుకునే రోజుల నుంచి చంద్రబాబుది ఇదే కుటిల ప్రవర్తన అని, ప్రశాంతంగా ఉండే ఎస్వీ యూనివర్సిటీని కులాల గొడవలోకి దించి రెడ్డి, కమ్మ అని చిచ్చురాజేసిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తుచేశారు. ఆ రచ్చ ఇప్పటికీ జరుగుతూనే ఉందన్నారు. ప్రశాంత వాతావరణాన్ని చంద్రబాబు సహించలేడన్నారు. అసెంబ్లీ మొదలైనప్పటి నుంచి ఈరోజు వరకు వారి సభ్యుల చేత గొడవ సృష్టిస్తుంది చంద్రబాబేనన్నారు. ఒక ఎస్సీ ఎమ్మెల్యేని పురిగొల్పి స్పీకర్ చైర్ వద్దకు పంపించి గొడవ సృష్టిస్తున్నాడన్నారు. కుటిల మనస్తత్వం ఉన్న టీడీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి స్పీకర్‌ను కోరారు.