వైయస్ఆర్ జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో చదువుల విప్లవం తెస్తామని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. నిబద్ధత, నిజాయితీ, విలువలతో కూడిన రాజకీయాలు వైయస్ జగన్ సొంతమన్నారు. అలాంటి నేత ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుందని పేర్కొన్నారు. విఆర్ సిబిఎస్ పాఠశాల విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. రాయచోటి నియోజక వర్గ అభివృద్దే తన ధ్యేయమని అన్నారు. ప్రస్తుత రాజకీయాలు డబ్బు, రౌడీయిజాలతో ముడిపడి ఉన్నాయని వాటిని నిలువరించే ప్రయత్నాలు చేయలేరా, మన దేశంలో ఉన్న రాజకీయాలకు ,ఇతర దేశాలలో ఉన్న రాజకీయాలకు ఎందుకు పొంతన లేదని, మన ప్రాంతాలలో ఉన్నటువంటి ముడి సరుకులను వినియోగించుకుని పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించలేమా, మన దేశ విద్యార్థులు అన్ని రంగాలలో రాణిస్తున్నప్పటికీ ఆర్థిక,సాంకేతిక రంగాలలో ఇతర దేశాలతో ఎందుకు వెనకబడి పోతున్నామని , వ్యవసాయ రంగంలో నష్ట పోతున్న రైతులను ఆదు కోవాలంటూ విద్యార్థులు ఎమ్మెల్యేను కోరారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలన్నింటికీ శ్రీకాంత్‌రెడ్డి విపులంగా సమాధానం చెప్పారు. ఆయన మాట్లాడుతూ కృష్ణా జలాలను మన రాయచోటి నియోజక వర్గానికి తెప్పించి అన్ని చెరువులను నింపడం, పట్టణాన్ని సుందరీకరణ చేయడం, మన ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, పి జి సెంటర్, సంక్షేమ పాఠశాలలు మంజూరు చేయించి ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చి దిద్దడం, కడప బెంగళూరు రైల్వే లైనును త్వరితగతిన పూర్తి చేయించి పరిశ్రమలు ఏర్పాటు చేయించడం తన లక్ష్యాలని వివరించారు.