డేటా చోరీలో చంద్రబాబు, లోకేష్‌ దోషులు

కాదంటే ధైర్యంగా విచారణ ఎదుర్కోవాలి

తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్న ఓటుకు కోట్ల కేసు మరో వీడియో

దీనిపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలి

ఓట్లను తొలగిస్తున్న బాబే ప్రతిపక్షంపై నిందలేయడం సిగ్గుచేటు

ఐటీ గ్రిడ్స్‌ సంస్థ అధినేతను చంద్రబాబే దాచిపెట్టారు 

చంద్రబాబు తక్షణమే నేరాన్ని అంగీకరించి పదవి నుంచి తప్పుకోవాలి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

విజయవాడ: తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు తప్పు మీద తప్పు చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. డేటా చోరీ కేసులో చంద్రబాబు, లోకేష్‌ దోషులని నమ్ముతున్నామని, నిరూపించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఓటుకు కోట్ల కేసుకు సంబంధించిన మరో వీడియో బయటపడిందని, డక్కన్‌ క్రానికల్‌ అనే పత్రిక 11 నిమిషాల వీడియోను విడుదల చేసిందన్నారు. దీంట్లో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాల్కంటైలర్‌ నివాసంలో సెబాస్టియన్‌ మధ్యవర్తిత్వం వహిస్తూ రూ. 3.3 కోట్లు కాదు రూ. 5 కోట్లు ఇప్పిస్తానని బాబుగారిని ఒప్పించాని, నాకు కూడా కమీషన్‌ ఫైనలైజ్‌ చేయాలన్న సంభాషణ ఉందన్నారు. దాంట్లో ప్రధానంగా రెండు, మూడు సార్లు బాబు గారు అని మాట్లాడుకున్నారని, రేవంత్‌రెడ్డిని గురించి కూడా మాట్లాడారని విడుదలైన వీడియోను చూపించారు. ‘మీరు రేవంత్‌రెడ్డిని నమ్మారు ఆయన రూ.3.3 కోట్లు ఇప్పిస్తానన్నారు. నేను రూ.5 కోట్లకు బాబుగారిని ఒప్పించాను, నాకు కమీషన్‌ ఇవ్వాలి’ అని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నాలుగేళ్లుగా  దీనిపై స్పందించలేదు, ప్రభుత్వానికి అందని వీడియోలు ప్రెస్‌కు దొరికాయని, దీనిపై విచారణ జరిపించి దోషులను శిక్షించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుఫున పెద్దిరెడ్డి డిమాండ్‌ చేశారు. 

సర్వేల పేరుతో వైయస్‌ఆర్‌ సీపీ సానుభూతి పరుల ఓట్ల తొలగిస్తూ ఆ స్థానాల్లో దొంగ ఓట్లను సృష్టిస్తున్న చంద్రబాబు సిగ్గులేకుండా వైయస్‌ఆర్‌సీపీపై ఆరోపణలు చేస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఫారమ్‌–7తో 15 రోజుల నుంచి చాలా అవస్థలు పెడుతున్నారన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో 14 వేల ఓట్లు, పుంగనూరులో 9 వేల ఓట్లు తొలగించారని ధ్వజమెత్తారు. బూత్‌ లెవల్‌ ఆఫీసర్ల సంతకాలు ఫోర్జరీ చేసి ఓట్లను తొలగించారని, అధికారులు దీనిపై స్పందించి విచారణ చేసి ఓట్లను పరిరక్షించాలని కోరడం జరిగిందన్నారు. మొగుడిని కొట్టి మగసాలెకు ఎక్కినట్లుగా చంద్రబాబు తీరు ఉందని, ఓట్లను తానే తొలగిస్తూ వైయస్‌ఆర్‌ సీపీపై నిందలు వేస్తూ కొత్త నాటకానికి తెరతీశారన్నారు. 

సేవామిత్ర యాప్‌ దొంగతనం కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు కొత్తనాటకానికి తెరతీశారన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆధార్, ఎన్నికల సంఘం పరిధిలోని ఓటర్‌ కార్డు, ఆర్‌బీఐ పరిధిలోని బ్యాంకు అకౌంట్‌ డేటా, సంక్షేమ పథకాలతో లబ్ధిపొందే కుటుంబాల డేటా సేవా మిత్ర యాప్‌లోకి ఎందుకు వచ్చాయని చంద్రబాబును ప్రశ్నించారు. పబ్లిక్‌ డొమైన్‌ ఇంగ్లిష్‌ పదం వాడి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడని, పబ్లిక్‌ డొమైన్‌ అయితే ఐటీ గ్రిడ్స్‌ సంస్థ అధినేత ఎందుకు పరారీలో ఉన్నాడని ప్రశ్నించారు. విచారణ జరిగితే నిజాలు బయటపడతాయని ఐటీ గ్రిడ్స్‌ సంస్థ అధినేతకు చంద్రబాబు పోలీసులతో రక్షణ కల్పించి మన రాష్ట్రంలో ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. డేటా చోరీలో సంబంధం లేదంటున్న చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. సైబర్‌ క్రైమ్‌ను తప్పుదోవ పట్టించడానికి ఫారమ్‌ – 7 అంటూ కొత్త నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తక్షణమే నేరాన్ని అంగీకరించి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. 

 

Back to Top