తాడేపల్లి: దొరికిపోయానన్నదే చంద్రబాబు బాధ.. అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మహ్మద్ అబ్దుల్ హఫీజ్‌ఖాన్ విమర్శించారు. సీమెన్ సంస్థకు కూడా బాబు చేసిన అక్రమాలు తెలియదు. రూ.250 కోట్లకు పైగా షెల్ కంపెనీ ద్వారా పక్కదారి పట్టినట్టు కనిపిస్తుంది. ఆధారాలు ఉన్నాక కేసు పెడితే తప్పేంటి?. అక్రమ కేసులు పెట్టమని ప్రభుత్వం చెప్పదు. చంద్రబాబు తక్కువ మనిషేం కాదు. వ్యవస్థలను మేనేజ్ చేయటంలో దిట్ట. బాబు దగ్గర ఉన్న వాదన చెప్పాలి గానీ, రాజకీయ కుట్ర అని ఎలా అంటారని హఫీజ్ ఖాన్ ప్రశ్నించారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యే మహ్మద్ అబ్దుల్ హఫీజ్‌ఖాన్ మీడియాతో మాట్లాడారు. బోగస్ కంపెనీ.. బోగస్ స్కీమ్ః - స్కిల్‌డెవలప్‌మెంట్ స్కాం కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు అరెస్టు ఈరోజు జరిగింది. – దీనిపై టీడీపీ నేతలు, ఎల్లోమీడియా కలిసి అవాస్తవాలతో రాజకీయం చేస్తున్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యగా చంద్రబాబు అరెస్టు జరిగిందనడాన్ని మేం ఖండిస్తున్నాం. – యువతకు ఉద్యోగాలిస్తామని .. బాబు వస్తే జాబు వస్తుందని ఊదర గొట్టిన చంద్రబాబు.. యువతకు ఉద్యోగాలివ్వకపోగా, నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ పేరుతో.. రూ.371 కోట్లకుపైగా ప్రభుత్వ సొమ్మును షెల్‌కంపెనీలతో కాజేశాడు. – కేబినెట్‌లో ఒక ‘ఎ’ కంపెనీతో ఒప్పందం చేసుకుంటున్నట్లు తీర్మానం చేసుకుని.. ప్రభుత్వ జీవోలో మాత్రం ‘బి’ కంపెనీకి డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసి హవాలా మార్గాల్లో చంద్రబాబు ప్రభుత్వఖజానా నుంచి రూ.371 కోట్లకు పైగా మొత్తాన్ని దోచుకున్నాడు. ఇది వాస్తవమా కాదా..? అనే విషయంపై టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి. – సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థల పేరుతో చంద్రబాబు డీల్ వాస్తవమేనని సీఐడీతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ కూడా చెప్పింది. – సీమెన్స్ సంస్థ సీఈవో సుమన్‌బోస్, డిజైట్‌టెక్ ఎండీ వికాస్ వినాయక్, ముకుల్‌చంద్ర అగర్వాల్, స్కిల్లర్ ఎంటర్‌ప్రైజేస్‌కు చెందిన మరొక ఛార్టెట్‌అకౌంటెంట్ సురేశ్ గోయల్ అరెస్టైన సంగతి వాస్తవమా..కాదా..? దొరికిపోయానన్నదే బాబు బాధ.. – అరెస్టయిన వారిని సీఐడీ, ఈడీ విచారించినప్పుడు.. ప్రభుత్వం చెల్లించిన రూ.371 కోట్ల డబ్బు ఎక్కడికి వెళ్లిందని అడిగినప్పుడు.. ఆ డబ్బంతా చివరికి చంద్రబాబు దగ్గరకే చేరిందని వారు చెప్పిన మాట నిజం కాదా..? అని అడుగుతున్నాను. – ఇప్పుడు చంద్రబాబులో.. తానొక దొంగగా దొరికిపోయాననే బాధ మాత్రమే ఉంది గానీ.. సీమెన్స్ కుంభకోణానికి నేను సూత్రధారి కాదని చెప్పే ధైర్యం మాత్రం ఆయనలో కనిపించడంలేదు. – డబ్బులు సంపాదించుకునే ఏ సంస్థైనా తాను కాంట్రాక్టు చేస్తే డబ్బులు వస్తాయని ఆలోచిస్తుంది. అయితే, సీమెన్స్ కంపెనీ మాత్రం ఏపీలో యువతకు ఉద్యోగాలిచ్చేందుకు తానే ఎదురొచ్చి రూ.3000కోట్లు ఇచ్చి ట్రైనింగ్ ఇస్తామంటూ వచ్చిందని చంద్రబాబు అండ్ కో కథను అల్లారు. – ప్రపంచంలో పేరున్న సీమెన్స్ సంస్థను అడ్డంపెట్టుకుని సుమన్‌బోస్ అనే ఒక బోగస్ సీఈవోను చూపెట్టి నకిలీ పత్రాల్ని సృష్టించి, దానికి అనుబంధంగా షెల్ కంపెనీలతో ప్రభుత్వసొమ్మును రూ.371 కోట్లు కొల్లగొట్టాడు చంద్రబాబు. హర్షించాల్సింది పోయి.. ఖండనలా..? – ఇలాంటి గజదొంగ చంద్రబాబుకు సపోర్టుగా రాజకీయ నేతలు, మీడియా పనిచేయరాదంటూ నేను మనవి చేస్తున్నాను. – చంద్రబాబులాంటి రాజకీయ నేతను అరెస్టు చేస్తే.. ఆయన దాన్ని ఎమోషనల్ పొలిటికల్ గేమ్‌గా వాడుకుంటాడనే విషయం మాకూ తెలుసు. ఎన్నికల దగ్గరలో ఉన్నప్పుడు చంద్రబాబుకు సానుభూతి పెరుగుతుందేమోననే ఆలోచన ఎవరికైనా వస్తుంది. - అయితే, నేరస్తుల పట్ల చట్టం సమయం కోసం ఎదురుచూడదు కదా..? నిజంగా, మా జగన్‌గారు కక్షసాధింపు చర్యగా చంద్రబాబును అరెస్టు చేయాలంటే నాలుగున్నరేళ్లు ఆగాల్సిన అవసరమేమీలేదు. తలుచుకుంటే ఎప్పుడో చంద్రబాబు అరెస్టు జరిగి ఉండేది. - చంద్రబాబులాంటి రాజకీయ కుట్రలు జగన్‌గారి జీవితంలో లేవు. కనుక, ఆయన అరెస్టును రాజకీయ కక్షసాధింపు చర్యగా చూడాల్సిన పనిలేదని వివరిస్తున్నాను. – అరెస్టుపై పురందేశ్వరి, పవన్‌కళ్యాణ్‌తో పాటు సీపీఐ నేతలు బాబుకు మద్ధతిస్తూ మాట్లాడటం బాధాకరం. – ప్రజాధనం వృథా చేశారని.. ఖజానా నుంచి రూ.371 కోట్లు కొట్టేశారని.. దర్యాప్తు సంస్థలు చంద్రబాబును నేరస్తుడుగా ధృవీకరించి అరెస్టు చేస్తే.. హర్షించాల్సింది పోయి.. ఖండించి బాబుకు మద్ధతివ్వడం బాధాకరమని చెబుతున్నాను.