తాడేపల్లి: వైజాగ్ రాజధానిని అడ్డుకుంటే టీడీపీ నేతలు ద్రోహులుగా మిగిలిపోతారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హెచ్చరించారు. అమరావతి ఉద్యమం పచ్చి భూటకమని, 250 రోజుల ఉద్యమం అని చెప్పుకుంటూ పది మందితో ఉద్యమం నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు చేయిస్తున్న జూమ్ ఉద్యమానికి లెఫ్ట్ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని, కారల్ మార్క్స్ సిద్ధాంతాలకు విరుద్ధంగా సీపీఐ, సీపీఐంలు వ్యవహరిస్తున్నాయన్నారు. కమ్యూనిస్టు పార్టీలు.. చంద్రబాబు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అని మార్చుకోవాలని హితవుపలికారు. అసలు లేని అమరావతి ఉద్యమాన్ని అంతర్జాతీయ ఉద్యమంగా ప్రచారం చేస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తావా? అని చంద్రబాబును నిలదీశారు. విశాఖపట్నంపై విషం ఎందుకు కక్కుతున్నావని చంద్రబాబుపై ఫైరయ్యారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను అడ్డుకుంటే తెలుగుదేశం పార్టీ నేతలు ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. దళితులపై ప్రేమ ఉంటే రాజధానిలో దళితులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఎందుకు అడ్డుకున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో చర్యలు తీసుకోమని డిమాండ్ చేసిన బాబు రమేష్ ఆస్పత్రి వ్యవహారంలో ఎందుకు నోరు మీదపడం లేదని ప్రశ్నించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.