ఎంత ఎగిరిపడినా.. ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు

చంద్రబాబు పాడు ప్రతిపక్షనేత, పవన్‌ రాజకీయ అజ్ఞాని

బాబుకిచ్చిన 23 సీట్లు కూడా ఖాళీ అయిపోతున్నాయి

కృతిమ ఇసుక కొరత అంటూ ప్రభుత్వంపై విషప్రచారం

సీఎం వైయస్‌ జగన్‌ పాలనకు వరుణదేవుడు కరుణించాడు

త్వరలోనే ఇసుక ఇబ్బందులు తీరుతాయి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌

తాడేపల్లి: ప్రభుత్వం కృత్రిమ ఇసుక కొరత సృష్టిస్తుందని చంద్రబాబు, పవన్‌ ఇద్దరూ కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, ఎంత ఎగిరిపడినా వీరి విష ప్రచారాన్ని ప్రజలెవరూ విశ్వసించరని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత వరుణదేవుడు కరుణించి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు నిండు కుండలాగా.. వాగులు, వంకలు పొంగిపొర్లుతూ.. నదులు సముద్రాలను తలపిస్తున్నాయన్నారు. సాగునీరు, తాగునీరు వచ్చాయని ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. నదులు, కాల్వలు నిండుకుండలను తలపిస్తుంటే ప్రభుత్వం కృతిమ ఇసుక కొరతను సృష్టిస్తుందని చంద్రబాబు, పవన్‌ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అపారమైన అనుభవం ఉందని మాట్లాడే చంద్రబాబు.. కృత్రిమ ఇసుక కొరత సృష్టించే అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది..? ఇసుక తీయలేని స్థితిలో ఉంటే దాన్ని కృత్రిమ ఇసుకను సృష్టిస్తే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందా..? కనీస జ్ఞానం కూడా లేకుండా పాడు ప్రతిపక్ష నేత చంద్రబాబు, రాజకీయ అజ్ఞాని పవన్‌లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే జోగి రమేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ‘ఇసుకతో ఇబ్బందులు ఉన్నాయని అంగీకరిస్తున్నాం. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత వరుణ దేవుడు కరుణించాడు. పదేళ్లుగా లేని వర్షాలు ఇప్పుడు పడుతున్నాయి. ఇసుక కొరత తాత్కాలికమే. వరదలు తగ్గిన వెంటనే సమస్య పరిష్కారం అవుతుంది. కార్మికుల పక్షాన నిలబడతామని చంద్రబాబు, పవన్‌ ఇప్పుడు సవతి తల్లి ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంది. ఏ వర్గానికి ఏ ఆపద వచ్చినా సీఎం వైయస్‌ జగన్‌ ఆదుకోవడానికి ముందుంటారు. 

గత ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు విచ్చలవిడిగా ఇసుకను దోపిడీ చేశారు. చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట వద్ద రోజూ వందల లారీలు ఇసుక తరలిస్తుంటే రోజైనా కట్టడి చేశాడా..? వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంటే ఏ రోజు అయినా మాట్లాడాడా..? నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ బాబు ఇసుక దోపిడీకి రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఈ పాపం చంద్రబాబుది కాదా..? దీనిపై సమాధానం చెప్పాలి. 

ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి రెండు చోట్ల పోటీ చేసి ఒక్కచోట కూడా గెలవలేని పవన్‌ కల్యాణ్‌ కూడా మాట్లాడడం హాస్యాస్పదం. పవన్‌ కల్యాణ్‌ ఒక రాజకీయ అజ్ఞాని. ఊర్లు పట్టుకొని తిరగాల్సిందే.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఎగిరిపడుతూ పచ్చమీడియా సహకారంతో ప్రభుత్వంపై విషప్రచారం చేసినా, చేయించినా ప్రజలు ఎవరూ వారిని విశ్వసించరు. చంద్రబాబు, పవన్‌ నైజం ప్రజలు గ్రహించారు. ప్రజలు టీడీపీకి 23 సీట్లు ఇచ్చారు. ఆ 23 కూడా ఖాళీ అయిపోతున్నాయి. టీడీపీ ఉంటుందా.. ఊడిపోతుందా.. అనేది ప్రశ్నార్థకం. కొంతమంది బీజేపీ, ఇంకొంతమంది వేరోక పార్టీకి వెళ్తున్నారు.

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నీతివంతమైన పాలన అందిస్తున్నారు.  వైయస్‌ జగన్‌ నీతివంతమైన పాలన అందిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినా వారంతా గ్రామాలకు చేరుకుంటున్నారు. రైతులు ఆనందంగా ఉన్నారు. రైతు కూలీలకు పనులు దొరుకుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇసుక కొరత లేకుండా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. సచివాలయాల ద్వారా ప్రజలుకు ఇసుక అందిస్తున్నాం’ అని ఎమ్మెల్యే జోగి రమేష్‌ చెప్పారు. 

 

Read Also: నిధుల వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి

Back to Top