వైయస్ఆర్ జిల్లా: రాయలసీమ అభివృద్ధిపై టీడీపీ, చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి రాయలసీమకు చేసింది ఏమీ లేదని, ఆయన సొంతంగా ప్రారంభించి పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటీ కూడా లేదన్నారు. రాయలసీమనే కాదు రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా చంద్రబాబు పట్టించుకోలేదని, కమీషన్ల కోసం ప్రాజెక్టుల వద్ద భూమి పూజ, శంకుస్థాపనలు చేసి దోచుకున్నారని విమర్శించారు. ఇవాళ చంద్రబాబు లైవ్ షో ద్వారా ప్రభుత్వంపై చేసిన విమర్శలను గడికోట శ్రీకాంత్‌రెడ్డి తిప్పికొట్టారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఏమన్నారంటే..: ఏ మాత్రమైనా సిగ్గుందా?: కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించిన నాయకుడు లేడు. సత్యదూరమైన, నిజాయితీ లేనటువంటి మాటలను అప్పటికప్పుడు అల్లి చెప్పడం చంద్రబాబు నైజం. రాయలసీమ అభివృద్ధికి సీఎం శ్రీ వైయస్ జగన్ కంటే, తానే ఎక్కువ చేశానని చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏ మాత్రమైనా సిగ్గుందా? 14 ఏళ్లు సీఎంగా పని చేసిన విషయాని, మూడు సార్లు అధికారం నుంచి దిగిపోయానన్న సంగతినీ ఆయన మర్చిపోయారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతానికి ఏమీ చేయకపోయినా.. తాను ఎన్నో చేద్దామనుకున్నానని, అంతలోనే అధికారం నుంచి దిగిపోయానని సిగ్గు లేకుండా చెబుతున్నాడు. ఆ కోవలోనే నిన్న వ్యవసాయంపైనా, ఈరోజు ఇరిగేషన్‌పైనా చంద్రబాబు మాట్లాడాడు. రైతులను నట్టేట ముంచి..: వ్యవసాయం దండగ అనడమే కాకుండా, ఆ విషయాని పుస్తకంలో కూడా రాసిన వ్యక్తి.. ఈరోజు వ్యవసాయం గురించి మాట్లాడడం జోక్. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రైతులతో ప్రకాశం బ్యారేజీపై ధర్నా చేయించిన చంద్రబాబు, ఈరోజు ఇరిగేషన్‌పై మాట్లాడడం హాస్యాస్పదం. వ్యవసాయం, రైతులు పట్ల పూర్తి నిర్లక్ష్యం చూపిన దరిద్రుడు చంద్రబాబు. రైతులకు రుణమాఫీ చేస్తానని మోసం చేసిన దగ్గర్నుంచి ఏ ఒక్కటీ చేయకపోగా.. వాళ్లను బాబు ఎంతగా ముంచాడో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుసు. అన్నీ ఒట్టి మాటలు: ఇరిగేషన్ రంగంలో ఎంతో చేశానంటున్న చంద్రబాబు, రాయలసీమ వాసులకు ఏమీ తెలియదని అనుకుంటున్నాడు. అందుకే వారిని మాయ మాటలతో మభ్య పెట్టాలని చూస్తున్నాడు. నాడు ఎన్టీఆర్ గాలేరు, హంద్రీనీవా ప్రాజెక్టులకు కేవలం పేర్లు మాత్రమే పెట్టాడు. కానీ పనులేవీ చేయలేదు. అయినా ఆయన సంకల్పాన్ని, ఆలోచనను మేము మెచ్చుతాం. అదే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, పార్టీని, పదవిని లాక్కున్న చంద్రబాబు.. అధికారం చేపట్టిన తర్వాత ఆ ప్రాజెక్టులపై చేసిందేమీ లేదు. కానీ సీమ ప్రజలను మోసగించే ఎత్తుగడలో భాగంగా ఉరవకొండ దగ్గర 40 టీఎంసీల నీటికి సంబంధించి హంద్రీనీవాకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1999లో అక్కడ 40 టీఎంసీల సామర్థ్యం కుదరదంటూ.. కేవలం 5 టీఎంసీల ప్రాజెక్టు చేపడతామంటూ జీఓ జారీ చేసి.. మరోసారి శంకుస్థాపన చేశారు. కానీ 2004 వరకు కనీసం పనులు కూడా మొదలు పెట్టలేదు. చివరకు శిలాఫలకం వేసిన వారికి కూడా డబ్బులివ్వలేదు. అదీ హంద్రీనీవాకు సంబంధించి చంద్రబాబు ఘనత. ఇక గాలేరు–నగరిపై కూడా ఏ మాత్రం శ్రద్ధ చూపకపోగా, గండికోట రిజర్వాయర్ ఉండగా.. అక్కడ కేవలం 1 టీఎంసీ సామర్ధ్యం ప్రాజెక్టు సరిపోతుందని జీవో ఇచ్చాడు. అలాంటి పెద్దమనిషి ఇవాళ రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాడు. ఇరిగేషన్‌పై ఉత్త కబుర్లు చెబుతున్నాడు. అవి పూర్తి చేసింది వైయస్సార్: 2004లో నాడు ఉమ్మడి రాష్ట్రంలో సీఎం అయిన వైయస్సార్‌గారు హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేశారు. అక్కడ 5 టీఎంసీల ప్రాజెక్టుపై చంద్రబాబు జారీ చేసిన జీఓను రద్దు చేసిన ఆయన, అక్కడే పనులు చేపట్టి పూర్తి చేశారు. అదే విధంగా గాలేరు–నగరి ప్రాజెక్టులో మొదటి విడత పనులు వైయస్సార్‌గారి హయాంలో యుద్ధప్రాతిపదికన జరిగాయి. ఒకటిన్నర ఏళ్లలో పోతిరెడ్డిపాడు: రాయలసీమ ప్రజలు గర్వంగా చెప్పుకునే పోతిరెడ్డిపాడు రిజర్వాయర్‌ను గతంలో విజయభాస్కర్‌రెడ్డిగారు సీఎంగా ఉన్నప్పుడు 11వేల క్యూసెక్కుల స్థాయిలో శంకుస్థాపన చేస్తే.. దాన్ని 56 వేల క్యూసెక్కులకు పెంచడమే కాకుండా.. కేవలం ఒకటిన్నర ఏళ్లలోనే ఆ పనులు పూర్తి చేసిన వైయస్సార్‌గారు రికార్డు సృష్టించారు. సీమ ప్రాజెక్టులు–వైయస్సార్: పులివెందులలో నిర్మించిన ప్రాజెక్టులు కానీ, రాయలసీమలో పలు ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, హంద్రీనీవాపై నిర్మించిన జీడిపల్లి, గొల్లపల్లి్ల, శ్రీనివాసపురం, అడివిపల్లి రిజర్వాయర్లు కానీ.. అవన్నీ వైయస్సార్‌గారి ఘనత. అవన్నీ ఆయన హయాంలోనే పూర్తయ్యాయి. 2011లోనే జీడిపల్లికి నీళ్లొచ్చాయి. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి కావడం వల్లనే అక్కడ కియా ఫ్యాక్టరీ ఏర్పాటైంది. సీమలో పలు ప్రాజెక్టులు పూర్తి కావడం వల్ల, వేల టన్నుల కూరగాయలు పండించి వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆంధ్ర ప్రాజెక్టులు: ఉత్తరాంధ్రకు సంబంధించి జంఝావతి, మహేంద్రతనయ ప్రాజెక్టు మొదలు.. తూర్పు గోదావరి జిల్లాల్లో తాడిపూడి, పుష్కర్ లిఫ్ట్ ఇరిగేషన్ వరకు.. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య పులిచింతల, ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ ప్రాజెక్టు కూడా మహానేత పూర్తి చేశారు. అలా రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత వైయస్సార్‌గారి కుటుంబానికి దక్కుతుంది. ఆ చరిత్ర జగన్‌గారిది: రాయలసీమకే గుండెకాయ వంటిది గండికోట రిజర్వాయర్. అలాంటి రిజర్వాయర్‌పై చంద్రబాబు ఏమాత్రం శ్రద్ధ చూపకపోతే, ఈరోజు దాన్ని 27 టీఎంసీలతో నింపుకునే సామర్థ్యాన్ని సీఎం శ్రీ వైయస్ జగన్ కల్పించారు. అక్కడి రైతుల్ని ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీతో నచ్చచెప్పి రిజర్వాయర్ సామర్ధ్యం పెంచుకున్న గొప్ప ఆలోచన జగన్‌గారిది. ఆనాడు మహానేత వైయస్సార్ రూపకల్పన చేసి ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల సామర్ధ్యం పెంచేందుకు ముందుకుపోయే ప్రణాళికలో జగన్‌గారు చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. హంద్రీనీవా కెపాసిటీ పెంచడంతో పాటు, డిజైన్లు కూడా ఇప్పటికే అప్రూవ్ చేశారు. చిత్తూరు పశ్చిమ ప్రాంతాలకు, రాయచోటి, చక్రాయపేట వంటి ప్రాంతాలకు నీళ్లు ఇచ్చేందుకు గండికోట లిఫ్ట్ ఇరిగేషన్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి సోమశిల ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత జగన్‌గారికి దక్కుతుంది. బాబుకు మాట్లాడే హక్కు లేదు: రాయలసీమ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. 1995లో అధికారపగ్గాలు చేపట్టిన దగ్గర్నుంచి హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టు పనులు చేపట్టకపోగా, పోతిరెడ్డిపాడు పనులు చేస్తుంటే బాబు వ్యతిరేక భావాలతో కొందరిని రెచ్చగొట్టి నిరసన కార్యక్రమాలు చేయించాడు. అంత నీచమైన స్వభావమున్న బాబు ఈరోజు రాయలసీమ అభివృద్ధి, ప్రాజెక్టులపై మాట్లాడటం ఆయన సిగ్గుమాలినతనానికి నిదర్శనం. బాబుకు తెలిసింది అదే..: బాబుకు తెలిసిందల్లా ఒక్కటే.. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా అక్కడకెళ్లి రాయలసీమ రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులు అనడమే బాబుకు తెలుసు తప్ప, ఏరోజు కూడా రాయలసీమ ప్రజలకు మంచి చేయడం చేత కాలేదు. ఎయిమ్స్‌లాంటి ఆస్పత్రి అనంతపురానికి వస్తే, దాన్ని వేరే చోటికి మార్చిన వ్యక్తి చంద్రబాబు. ఈ విషయం రాయలసీమ ప్రజలకు గుర్తుండదా? 1995 నుంచి 1999 వరకు అధికారంలో ఉన్న నువ్వు గాలేరు నగరి, హంద్రీనీవా పూర్తి చేసి ఉంటే.. 2004లో ఏర్పడిన బ్రిజేష్ ట్రిబ్యునల్‌తో రాయలసీమ నీటి వాటా వచ్చేది కదా? మరి, బాబు అప్పట్లో ఎందుకు ఆలా ఆలోచించలేకపోయాడని ప్రశ్నిస్తున్నాను. కేవలం, బాబు చేతగాని తనంతోనే రాయలసీమ నీటివాటాను చేజార్జుకున్నాం. పద్నాలుగేళ్ల బాబు హయాంలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా తాను స్వయంగా రూపకల్పన చేసి పూర్తిచేసిన దాఖలాల్లేవు. నీ హయాంలో కరువు తాండవిస్తే పశువులకు గడ్డిని క్యాంపుల ద్వారా అందించానని చెప్పుకుంటున్నావు. అంటే, నీ పాలన అంత దరిద్రంగా ఉండేదన్న మాట. కుప్పంకు కూడా నీళ్లు ఇవ్వలేని వ్యక్తివి నువ్వు.. రాయలసీమకు ఏదో చేశానని గొప్పలు చెప్పుకుంటున్నావే! నువ్వు పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు పేరునైనా చెప్పగలవా..? అని బాబుకు సవాల్ విసురుతున్నాను. పోలవరంను ఏటీఎం చేసుకున్న నీచుడు బాబు: పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకువస్తుంటే..దానికి అడుగడుగునా ఆటంకాలు సృష్టించిన నీచుడు ఈ చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వమే పూర్తిచేయాల్సిన పోలవరం ప్రాజెక్టును వారి భుజాల మీద నుంచి తాను తీసుకుని కమిషన్లు దండుకుంటూ.. కేంద్రం ఇచ్చిన నిధుల్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు. పోలవరంను ఏటీఎంగా మార్చుకున్నారని బాబు ప్రభుత్వంపై ఆనాడు కేంద్రమే బహిరంగంగా చెప్పిన విషయం అందరికీ తెలుసుకదా..? ఈరోజు రాయలసీమ గురించే మాట్లాడుతూ.. రూ.4200 కోట్లతో నీరు – చెట్టు ప్రగతి పనులు చేశామని బాబు చెబుతున్నాడు. రాష్ట్రంలో ఎక్కడ ఏ పని చేశాడో.. రూ.4200 కోట్లు దేనికి ఖర్చు చేశాడో అకౌంట్ వివరాలు చెప్పగలడా..? అని బాబును సూటిగా ప్రశ్నిస్తున్నాను. నీరు–చెట్టు పేరుతో దోపిడీచేసింది నువ్వుకాదా..? అని బాబును అడుగుతున్నాను. రాయలసీమపై ఉన్న ధ్వేషంతో బాబు ఇక్కడ ఏ పనీ చేపట్టకపోగా.. ఈరోజు అబద్ధాలతో ప్రజల్ని మోసం చేయాలనుకోవడం సిగ్గుమాలిన చర్యగా చెబుతున్నాను.