చంద్రబాబు జేబు వ్యవస్థలా వ్యవహరిస్తే కుదరదు

ఓ పార్టీకి తొత్తుగా మారిన నిమ్మగడ్డ.. చట్టబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తామంటే నమ్మాలా?

స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థను రాజకీయ పార్టీకి తాకట్టుపెట్టారు

రాజకీయ పక్షాలతో మాట్లాడే ముందు ప్రభుత్వంతో ఎందుకు చర్చించలేదు

నేటి మీటింగ్‌ ప్రక్రియను ఎన్నికలను వాయిదా వేసేటప్పుడు ఎందుకు పాటించలేదు?

ఏకగ్రీవాలు రద్దు చేయాలని టీడీపీ మాట్లాడటం హాస్యాస్పదం

ఎన్నికలు ఎప్పుడు పెట్టినా విజయం వైయస్‌ఆర్‌ సీపీదే

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు 

తాడేపల్లి: చంద్రబాబు చెప్పినట్లుగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహరిస్తున్నారని, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్‌ను ఒక రాజకీయ పార్టీకి తాకట్టుపెట్టే పరిస్థితికి నిమ్మగడ్డ తీసుకువచ్చారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ఎన్నికల కమిషన్‌ చంద్రబాబు జేబు వ్యవస్థలా వ్యవహరిస్తే కుదరదని, రాజకీయ కుట్రలో కమిషనర్‌ భాగస్వామ్యం అయితే ప్రజాస్వామ్యం నిలబడదన్నారు. రాష్ట్రంలో 3 కరోనా కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. రోజూ 3 వేల కేసులు రిపోర్టు అవుతున్నప్పుడు ఎన్నికలు నిర్వహిస్తామంటే ఎలా..? అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే ముందు ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీం కోర్టు చెప్పినా.. రాజకీయ పార్టీలతో మీటింగ్‌కు ముందు ప్రభుత్వంతో ఎందుకు చర్చించలేదని నిలదీశారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. 

మార్చిలో అర్ధాంతరంగా కోవిడ్‌ వలన నిరంతరంగా వాయిదా వేసిన ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలా..? వద్దా..? అనేదానిపై అభిప్రాయాలు తీసుకోవడం కోసం పొలిటికల్‌ పార్టీలను పలిచారు. నిన్ననే మా పార్టీ తరఫున చాలా స్పష్టంగా చెప్పాం. ఈ సమావేశానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ వెళ్లడం లేదని, దాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పాం. అందుకు కారణాలను సైతం నిన్న వివరించాం.

ఆ తరువాత ఎన్నికల కమిషన్‌ కూడా ఒక నోట్‌ విడుదల చేసింది. దాంట్లో వైయస్‌ఆర్‌ సీపీ హాజరుకాకపోవడం, చేసిన వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లుగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తెలియపరిచారు. 

స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్‌ను ఒక రాజకీయ పార్టీకి తాకట్టుపెట్టే పరిస్థితికి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తీసుకువచ్చారు. ఇది దేశంలోనే అందరినీ ఆశ్చర్యపరిచే అంశం. ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలా..? వద్దా..? అని, కోవిడ్‌ ఉన్న సందర్భంలో ఏం చేయాలనే దానిపై అన్ని రాజకీయ పార్టీలను పలిచారు. చివరకు ఓటు కూడా లేని రాజకీయ పక్షాలను పలిచారు. 

మార్చిలో ఎన్నికలను వాయిదా వేసేటప్పుడు ఎందుకు ఈ విధానాన్ని ఆచరించలేకపోయారు. ఆ రోజున కూడా అన్ని రాజకీయ పార్టీలను పిలిచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలా..? వద్దా..? అనే అభిప్రాయాలను ఎందుకు తీసుకోలేదు. దీని వెనుక కుట్ర దాగి ఉంది. ఎవరినీ సంప్రదించకుండా ఉదయాన్నే కెమెరాల ముందుకువచ్చి కోవిడ్‌–19 వల్ల ఎన్నికలను వాయిదా వేస్తున్నామని చెప్పారు. ఆ రోజున రాష్ట్రంలో కేవలం 3 కోవిడ్‌ కేసులు ఉన్నాయేమో..? ఇవాళ రోజుకు 3 వేల కేసులు రిపోర్టు అవుతున్నాయి. 

ఎన్నికలు జరగాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా కోరుకుంటుంది. 2018లోనే జరగాల్సిన ఎన్నికలు గత ప్రభుత్వం జరపలేకపోయింది. ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థలను బలోపేతం చేసే ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతోనే ఆరోజు మా ప్రభుత్వం మీకు సహకరించింది. కానీ, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అర్ధంతరంగా వాయిదా వేశారు. 

ఎన్నికలను అర్ధంతరంగా వాయిదా వేసిన అంశంపై హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు వెళ్లాం. సుప్రీం కోర్టులో ప్రభుత్వం తరఫు వాదనలు విన్నతరువాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే ముందు తిరిగి ప్రభుత్వాన్ని సంప్రదించండి అని సుప్రీం కోర్టు ఆర్డర్‌ ఇచ్చింది. 

ఇవాళ చీఫ్‌ సెక్రటరీతో, నిన్న హెల్త్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీతో మాట్లాడుతున్నామని నిమ్మగడ్డ తన లేఖలో పేర్కొన్నారు. కానీ, రాజకీయ పార్టీల సమావేశం పెట్టాలని నిర్ణయానికి ముందుకు చీఫ్‌ సెక్రటరీ, హెల్త్‌ సెక్రటరీని ఎందుకు సంప్రదించలేదు. 

ఎలక్షన్‌ కమిషన్‌ కాదు.. చంద్రబాబు – నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కమిషన్‌గా వ్యవహరిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా తయారైన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ నిస్పక్షపాతంగా ఎన్నికలు జరుపుతామంటే ఎవరు నమ్ముతారు..?

15వ తేదీన ఎన్నికలు వాయిదా వేసి.. 18వ తేదీన కేంద్ర హోంశాఖ సెక్రటరీకి లేఖ రాశారు. మా పార్టీని దూషిస్తూ లేఖ రాశారు. దౌర్జన్యాలు, అక్రమాలు చేసే పార్టీ అని, ముఖ్యమంత్రిని ఫ్యాక్షనిస్టుగా వర్ణించారు. ఆ లేఖ చంద్రబాబు రాస్తే.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సంతకం చేశారు. 

ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేస్తూ ఆధారాలతో సహా దొరికిన వారిపై చర్యలు తీసుకుంటామని వైయస్‌ జగన్‌ ప్రభుత్వం చట్టం తీసుకువస్తే.. దానికి ఎన్నికల సంఘానికి ఏం సంబంధం..? ప్రాణరక్షణ లేదంటూ నిమ్మగడ్డ మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుతున్న మీరు.. చక్కని పాలన చేసే ప్రభుత్వంలో ఎన్నికలు సక్రమంగా నిర్వహిస్తారని మేము ఎలా అనుకోవాలి..? 

18 రాజకీయ పార్టీలను సమావేశానికి పిలిచిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. 18 మంది రాజకీయ పార్టీ ప్రతినిధులను ఒక హాల్‌లో కూర్చోబెట్టారా..? లేదు. కోవిడ్‌ నేపథ్యంలో వన్‌ టు వన్‌ సమావేశాలు నిర్వహించేవారు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు..? ఎన్నికల కమిషన్‌ కూడా రాజకీయాలు చేసే దౌర్భాగ్యస్థితికి తీసుకువచ్చారు..? 

హైదరాబాద్‌లో ఓ స్టార్‌ హోటల్‌లో తెలుగుదేశం పార్టీ వారితో కలిసి కుమ్మకై చేసిన అనేక విషయాలను ప్రజలంతా చూశారు. చట్టబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తామంటే మేము నమ్మాలా..? నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌లో చంద్రబాబు పరకాయప్రవేశం చేశారు. చంద్రబాబు చెప్పినట్లుగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. 

ఏకగ్రీవాలు రద్దు చేయాలని అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌లుగా, మండలాధ్యక్షులుగా చంద్రబాబు ఎవరిని నియమించాలనుకుంటున్నారో వారిని మాత్రమే నామినేట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తే బాగుండేది. ఏకగ్రీవాలను కూడా రద్దు చేయాలనే దౌర్భాగ్యస్థితికి టీడీపీ వచ్చింది. 

ఎన్నికల కమిషన్‌ చంద్రబాబు జేబు వ్యవస్థలా వ్యవహరిస్తే కుదరదు. రాజకీయ కుట్రలో కమిషనర్‌ భాగస్వామ్యం అయితే ప్రజాస్వామ్యం నిలబడదు. కరోనా తగ్గిన తరువాత ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా గెలిచేది వైయస్‌ఆర్‌ సీపీనే అని గుర్తుపెట్టుకోండి. ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ ఇప్పుడు ఎన్నికలు వద్దూ అని చెబుతున్నాం. 
 

Back to Top