నిమ్మగడ్డ తీరు ఒంటెద్దు పోకడలా ఉంది

  ఎస్‌ఈసీ వ్యవహారశైలిని ముక్త‌కంఠంతో ఖండించిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ నిమ్మగడ​రమేశ్‌ కుమార్‌ వ్యవహరిస్తున్న తీరుపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. నిమ్మగడ్డ, ఎన్నికల కమీషనర్‌లా కాకుండా చంద్రబాబు ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ తన పరిధి దాటి, మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారంటూ మండి పడ్డారు. ఎన్నికల నిర్వహణలో ఎస్‌ఈసీ ఏకపక్ష నిర్ణయాలపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ.. నిమ్మగడ్డ తీరు ఒంటెద్దు పోకడలా ఉందంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసినా స్పందించని నిమ్మగడ్డ.. ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవడంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. ఉన్నత పదవిలో ఉంటూ ఆయన ఇలా వ్యవహరించడం సరికాదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఈ ఎన్నికల ఫలితాలు ఆయను గుణపాఠం నేర్పుతాయని మంత్రి హెచ్చరించారు. 

నిమ్మగడ్డ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.. 
ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంటే, ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న నిమ్మగడ్డ తన స్థాయిని తానే దిగజార్చుకుంటున్నాడని మంత్రి తానేటి వనిత కామెంట్ చేశారు. ప్రభుత్వం పట్ల నిమ్మగడ్డ కక్షపూరిత ధోరణి సరికాదని ఆమె మండి పడ్డారు. ఎన్నికల కమిషనర్‌కు ఎన్నికలు సజావుగా నిర్వహించే హక్కు ఉంటుందని, ఆ హక్కును ఉపయోగించి ఎన్నికలు సజావుగా జరిగేటట్టు చూడాలే కానీ ప్రభుత్వాన్ని,  ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని హితవు పలికారు. 

ఎస్‌ఈసీ స్థాయికి మించి జోక్యం చేసుకుంటున్నారు..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక అధికారిలా కాకుండా చంద్రబాబు ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నాడని, ఉన్నతాధికారుల విషయంలో తన స్థాయికి మించి ఆయన జ్యోక్యం చేసుకొంటున్నాడని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేశ్‌ గౌడ్‌ ధ్వజమెత్తారు. దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇలాంటి ఎన్నికల కమీషనర్ లేడని, గతంలో పని చేసిన ఎస్‌ఈసీలను చూసైనా ఆయన హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలి ఆయన సూచించారు. 

చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలా.. 
చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ కీలు బొమ్మ అని, నిమ్మగడ్డను చంద్రబాబు అడిస్తున్నాడని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఫైరయ్యారు. మంత్రులపై ఫిర్యాదు చేస్తూ గవర్నర్‌కు రాసిన లేఖ నిమ్మగడ్డ రాసింది కాదని, చంద్రబాబు రాసిన లేఖనే ఆయన యధాతధంగా గవర్నర్‌కు పంపాడని ఆరోపించారు. మంత్రులు, వైసీపీ నేతలపై బురద చల్లేందుకే నిమ్మగడ్డ ఇలా వ్యవహరిస్తున్నాడని, ఆయన మానసిక స్థితి సరిగా లేదని ఎమ్మెల్యే విమర్శించారు. 

రాజ్యాంగ బద్దంగా పనిచేయడం లేదు..
ఉన్నత రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ రాజ్యాంగ బద్దంగా పనిచేయడం లేదని, ఆయన వ్యవహరిస్తున్న తీరు టీడీపీకి గులాంగిరి చేసినట్లుందని వైయ‌ర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానంద రెడ్డి ఆరోపించారు. గ్రామాల్లో వైషమ్యాలను సృష్టించేందుకు చంద్రబాబు ప్లాన్‌కు అనుగుణంగా పనిచేస్తున్న నిమ్మగడ్డ.. అధికారులను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.  ఏకగ్రీవాలనేవి ఎప్పటినుంచో ఉన్నాయని, అది కూడా తెలుసుకోకుండా మాట్లాడటం నిమ్మగడ్డ స్థాయికి సరికాదన్నారు.

తాజా వీడియోలు

Back to Top