ముసుగు పూర్తిగా తీసేసిన సీఎం చంద్రబాబు

మార్గదర్శి చిట్‌ఫండ్‌ కేసులో అనైతిక వ్యవహారం

మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ధ్వజం

మార్గదర్శి కోసం ఇంత దిగజారుతారా బాబూ?

దొంగలను కాపాడేందుకు అధికార దుర్వినియోగం

సీఐడీతో పోరపాటు చేశామని చెప్పించడం ఎంత ఘోరం

సీఐడీ విశ్వసనీయతను సీఎం దారుణంగా దెబ్బ తీశారు

టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఆక్షేపణ

చంద్రబాబు, ఈనాడు పొలిటికల్‌ క్విడ్‌ ప్రొ కో

ఒకరి ప్రయోజనాల కోసం ఒకరు పని చేస్తున్నారు

వైయ‌స్ జగన్‌ను దించడం, చంద్రబాబుని ఎక్కించడమే ఈనాడు కర్తవ్యం

బాబు కోసం వందల సార్లు జగన్‌పై వ్యక్తిత్వ హననం

ఈనాడులో రోజూ నిండా వక్రీకరణలు, తప్పుడు వార్తలే    

ప్రెస్‌మీట్‌లో మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు వెల్లడి

తాడేపల్లి: ప్రజలకు మేలు చేస్తానని అధికారంలోకి చంద్రబాబు నిస్సిగ్గుగా అక్రమార్కులకు అండగా నిలబడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్గదర్శి చిట్‌ఫండ్‌ కేసులో రామోజీ కుటుంబాన్ని కాపాడటం కోసం సీఐడీ ప్రతిష్టను దిగజార్చిన చంద్రబాబు, వారి కోసం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఫిర్యాదు చేసిన డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడాల్సింది పోయి, అక్రమార్కులకు అండగా నిలవడం సిగ్గుచేటని సుధాకర్‌బాబు అన్నారు.

ప్రభుత్వం మారితే నేరాలు మాఫీ:
    ప్రజలకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అక్రమార్కులకు కొమ్ముకాస్తుంది. మార్గదర్శి చిట్‌ఫండ్‌లో మోసాలు జరిగాయని, చందాదారులకు అన్యాయం జరిగిందని, వారు కట్టిన చందాలు అక్రమ మార్గంలో రామోజీ సంస్థలకు పెట్టుబడుల రూపంలో మళ్లించారని 2023లో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక అదే సీఐడీ అవేవీ జరగలేదని, తమ వైపు పొరపాటు జరిగిందని, మార్గదర్శికి క్లీన్‌చిట్‌ ఇస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది.  ప్రభుత్వాలు మారిన వెంటనే నేరాలు మాఫీ అయిపోతున్నాయని ఈ సంఘటన రుజువు చేస్తోంది.  

నిస్సిగ్గుగా అధికార దుర్వినియోగం:
    సీఎం చంద్రబాబు తన ముసుగు పూర్తిగా తొలగించారు. దొంగలను కాపాడేందుకు నిస్సిగ్గుగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు. అధికారంలో మనవాడుంటే ఏ నేరాలు చేసినా తప్పించుకోవచ్చని మార్గదర్శి చిట్‌ఫండ్‌ వ్యవహారం రుజువు చేస్తుంది. ఈనాడు పత్రిక చంద్రబాబు జేబు సంస్థ అని నాడు వైయస్ఆర్ నుంచి నేడు ఆయన తనయుడు వైయస్‌ జగన్‌ వరకు చెబుతూనే వస్తున్నారు. ఈనాడు సంస్థ పత్రిక ముసుగులో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తూ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతోందని చెబుతూ వస్తున్నాం. చంద్రబాబు, ఈనాడు ఒకరి ప్రయోజనాల కోసం ఒకరు, ఒకరి అక్రమాలు కప్పిపుచ్చడానికి ఇంకొకరు పనిచేస్తున్నారని మేం చెబుతున్నదే నేడు బహిర్గతమైంది. చంద్రబాబు జేబు సంస్థగా ఈనాడు పని చేస్తోంది స్పష్టమైంది. 

అదే వారి లక్ష్యం:
    ఇది పూర్తిగా పొలిటికల్‌ క్రిడ్‌ ప్రోకో. మార్గదర్శి చిట్‌ఫండ్‌పై కేసులు చంద్రబాబు ప్రభుత్వం మాఫీ చేస్తే, ఈనాడు కూడా వక్రీకరణ, అబద్ధాలతో వార్తలు ప్రచురిస్తూ చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను కాపాడుతూ వస్తోంది. చంద్రబాబు మీద ఈగ వాలనీయకుండా  చేయడంతో పాటు, వైయ‌స్ జగన్‌ను రాజకీయంగా లేకుండా చేయాలనే కుట్రతో కొన్ని వందలసార్లు వైయస్‌ జగన్‌పై ఈనాడు వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడింది. జగన్‌ను దించి చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రజలను ఎన్నిరకాలుగా మోసగించారో లెక్కేలేదు.
    మార్గదర్శి కేసుల వ్యవహారం అనేది, వైయస్ఆర్‌సీపీ, టీడీపీ వ్యవహారమో.. లేక ఈనాడుకు, వైయస్‌ జగన్‌కు మధ్య రాజకీయ వైరమో ఎంత మాత్రం కాదు. మార్గదర్శిని నమ్మి డిపాజిట్లు చెల్లించి మోసపోతున్న డిపాజిటర్లకు న్యాయం చేయడం గురించి, చట్టాలను ఉల్లంఘించి ఆ సంస్థ చేస్తున్న అక్రమాల గురించి మాత్రమే.

రామోజీ కుటుంబానికి మేలు జరిగితే చాలు:!
    మార్గదర్శి చిట్‌ఫండ్‌ కేసులో ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించారని, అక్రమాలను నిరూపించేందుకు అన్ని ఆధారాలున్నా­యని గతంలో తేల్చి చెప్పిన సీఐడీ హఠాత్తుగా తాము సేకరించిన మౌఖిక, రాత­పూ­ర్వక ఆధారాలేవీ మార్గదర్శి చిట్‌ఫండ్‌ అక్ర­మాలను రుజువు చేసేవి కావంటూ చేతులెత్తేయడం వెనుక ఖచ్చితంగా చంద్రబాబు ఒత్తిడి ఉందని చెప్పడంలో మాకు ఎలాంటి అనుమానాలు లేవు. 
    మార్గదర్శి చందాదారులకు నష్టం జరుగుతుంటే న్యాయం  చేయాల్సిన ప్రభుత్వం.. అక్రమార్కుల పక్షాన నిలవడం సిగ్గుచేటు. చంద్రబాబు చేస్తున్న అక్రమాలకు జనసేనతో పాటు, బీజేపీకూడా మద్దతు పలకడాన్ని వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. వ్యవస్థలను దుర్వినియోగం చేయడాన్ని నిరసిస్తున్నాం. గతంలో మార్గదర్శికి చెందిన రూ.1050 కోట్ల ఆస్తులు అటాచ్‌ చేస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విడిపించారు.
    ప్రజలు ఏమైపోయినా ఫరవాలేదు. రామోజీ కుటుంబానికి న్యాయం చేయడమే ప్రథమ కర్తవ్యం అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌పై అసలు కేసు నమోదు చేయడమే ‘పొరపాటు..’ అంటూ సీఐడీతో రాతపూర్వకంగా చెప్పించారంటే ఆ సంస్థ విశ్వసనీయతను ఏ స్థాయిలో దిగజార్చారో అర్థమవుతుంది. 

డిపాజిటర్ల ఫిర్యాదుతో ఆధారాల సేకరణ:
    మార్గదర్శిపై వైయస్ఆర్‌సీపీకి ఎలాంటి వైరం లేదు. డిపాజిటర్ల ఫిర్యాదుతోనే కేసులు నమోదు చేయడం జరిగింది. వారిచ్చిన వాంగ్మూలాలను రికార్డ్‌ చేసి, మార్గదర్శి చిట్స్‌ కార్యాలయాల్లో సీఐడీ సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. గడువు ముగిసి ష్యూరిటీలు సమర్పించిన తరువాత కూడా బ్రాంచ్‌ మేనేజర్లు సకాలంలో చెల్లింపులు చేయడం లేదని చందాదారులే సీఐడీకి చెప్పారు.  
    సాకులు చెబుతూ ష్యూరిటీలను తిరస్కరించడం, అదనపు ష్యూరిటీలు సమర్పించాలని కోరడంతో పాటు, చిట్‌ ముగిసినా చెల్లించకుండా మార్గదర్శి ఇబ్బంది పెడుతోందని చందాదారులు స్పష్టంగా చెప్పారు. సకాలంలో చెల్లింపులు చేయకపోవడం, చెల్లించాల్సిన మొత్తాన్ని డిపాజిట్‌గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం, తక్కువ వడ్డీ చెల్లించడం, చెల్లింపులు ఎగవేయడం లాంటి ఉల్లంఘనలకు మార్గదర్శి చిట్స్‌ పాల్పడినట్లు సీఐడీ దర్యాప్తులో తేలిందని సుధాకర్‌బాబు వివరించారు.
 

Back to Top