చంద్రబాబు గిరిజన ద్రోహి

ఐదేళ్ల పాలనలో ఒక్క మంచిపనైనా చేశారా..?

ఎస్టీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి

గిరిజనులను అవమానించిన చంద్రబాబుకు గుణపాఠం తప్పదు

చాపరాయిలో 16 మంది చనిపోతే పరామర్శించిన పాపాన పోలేదు

వైయస్‌ జగన్‌ కాలినడకన వచ్చి ఆదివాసీలను పలకరించి ధైర్యం చెప్పారు

గిరిజనులంతా వైయస్‌ఆర్‌ సీపీ వెంటే ఉన్నారు

వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత తెల్లం బాలరాజు

విజయవాడ: గిరిజన ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత తెల్లం బాలరాజు అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గిరిజనులకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. గిరిజనులను చులకనగా చూస్తున్న తెలుగుదేశం పార్టీకి త్వరలో జరగబోయే ఎన్నికల్లో బుద్ధి చెబుతామన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గిరిజన నాయకులు, మేధావులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గిరిజనుల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. అన్నివర్గాలతో సమానంగా గిరిజనులను పైకి తీసుకురావాలనే అంశంపై చర్చించారు. చర్చ అనంతరం తెల్లం బాలరాజు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆదివాసీలను చులకనగా చూస్తూ, తెలివి తక్కువ వారిగా చిత్రీకరిస్తూ కించపరుస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు మాదిరిగానే మంత్రులు, టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. 

ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు గిరిజనులకు చేసిందేమీ లేదన్నారు. ఎస్టీల కోసం ప్రత్యేక కమిషన్, 50 సంవత్సరాలు దాటితే పెన్షన్, గిరిజన సలహా మండలి ఏర్పాటు చేస్తానని ఎన్నో హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. తిండి, బట్ట, గూడు, వైద్యం లేక గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాపరాయి గ్రామంలో విష జ్వరాలతో 16 మంది చనిపోతే ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదని ధ్వజమెత్తారు. విషయం తెలుసుకున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు హుటాహుటిన బయల్దేరి వచ్చి రెండు కిలోమీటర్లు మన్యంలో నడిచి ప్రజలను పలకరించి ధైర్యం చెప్పారని గుర్తు చేశారు. దీన్ని బట్టి గిరిజనుల పట్ల వైయస్‌ జగన్‌కు ఎంత ప్రేమ ఉందో అప్పుడే ప్రజలందరికీ అర్థమైందన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే గిరిజనులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారన్నారు. 

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి గిరిజనులకు చేసిన మేలు చిరకాలం గుర్తుంటుందని తెల్లం బాలరాజు అన్నారు. మహానేత మాదిరిగానే వైయస్‌ జగన్‌ అభివృద్ధి చేస్తారనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోయిందన్నారు. గత ఎన్నికల్లో ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో 6 స్థానాలను గెలిపించుకున్నామని చెప్పారు. రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో 7 నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపిస్తామన్నారు. గిరిజన సంక్షేమంపై చర్చించిన విషయాలను పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ దృష్టికి, మేనిఫెస్టో కమిటీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. 

చంద్రబాబుది నికృష్ట పాలన అని అరకు నియోజకవర్గ సమన్వయకర్త కుంభా రవిబాబు అన్నారు. గిరిజనులను అంటరానివాళ్లుగా చిత్రీకరించిన చంద్రబాబుకు గుణపాఠం తప్పదన్నారు. బాబు పాలనలో అనునిత్యం గిరిజనులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఇలాంటి వ్యక్తిని గద్దె దించేందుకు గిరిజనులంతా సిద్ధంగా ఉన్నారన్నారు. 

Back to Top