ఈసీ సైంధవుడి పాత్ర పోషిస్తోంది

ఎన్నికల కమిషన్‌ అనేది ఒక వ్యక్తా..? లేక వ్యవస్థా..?

ప్రభుత్వం నుంచి ఏ ఇన్‌పుట్స్‌ తీసుకొని ఎన్నికలు వాయిదా వేశారు..?

ప్రోటోకాల్‌ ప్రకారం వ్యవహరించాల్సిన బాధ్యత లేదా..?

ఎన్నికలు వాయిదా వేసి ఏం సాధిస్తారు

ఎన్నికల కమిషనర్‌ చేసిన తప్పును సరిదిద్దుకోవాలి

కరోనా నివారణలో సర్పంచ్, ఎంపీటీసీల పాత్ర కీలకం

ఇప్పటికైనా విచక్షణతో ఆలోచన చేసి ఎన్నికలు నిర్వహించాలి

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: ఎన్నికల సంఘం వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ అని, ఎన్నికలు వాయిదా వేసే ముందు ప్రోటోకాల్‌ ప్రకారం ముందుకెళ్లాలి కానీ, సొంత ఆలోచనలు చేయొచ్చా అని ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలు వాయిదా వేయాలంటే ఒక పద్ధతి ఉంటుందని, ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ నిర్ణయం వెనక దురుద్దేశం, దురాలోచన చేసే వ్యక్తి ఉన్నట్లుగా అనిపిస్తుందన్నారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా.. వాయిదా వెనుక ఉన్న వాస్తవాలను ప్రజలు గ్రహించాలని కోరారు. ఎన్నికలు జరిగితే కేంద్రం నుంచి రూ.5 వేల కోట్లు వస్తాయని, వాటిని అడ్డుకునేందుకు ఈసీ సైంధవుడి పాత్ర పోషిస్తుందన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల విలేకరుల సమావేశం నిర్వహించారు.
సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..

  • నిన్న ఎన్నికల కమిషన్‌ మిగిలిన సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌లాగే ఎన్నికలు నిర్వహించే పాత్ర ఉంది. అది వ్యక్తా.. లేక వ్యవస్థా..? ఎన్నికలు వాయిదా వేసేముందు ఏదైనా ప్రొసీజర్‌ ఉంటుందా.. లేక అధికారిగా ఉన్న వ్యక్తి సొంతంగా ఆలోచనలు చేయొచ్చా..? ఎన్నికలు వాయిదా వేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వ పరిధిలోనే ఈసీ భాగమై వ్యవహరించాలి కానీ, పరిధిని మించి నిర్ణయాన్ని తీసుకున్నారు.
  • ఈసీ నిర్ణయం తప్పు. ప్రాసెస్‌ కూడా ఫాలో కాలేదు. సంబంధం లేని కారణాలు చూపించడం తప్పు. దోరాలోచన, దురుద్దేశంతో ఎన్నికల వాయిదా వెనక ఎవరో ఉన్నారని స్పష్టంగా కనిపిస్తుంది.
  •  కరోనా ఉధృతంగా ఉన్నందున ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అని ఈసీ చెబుతున్నారు. 6వ తేదీ జరిగిన అఖిలపక్షం సమావేశంలో ఎమ్మెల్యేలు జోగి రమేష్, అనిల్‌ పాల్గొన్నారు. కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం తీసుకున్నాం. కరోనా రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తుంది. అన్నీ చూసిన తరువాత ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ చెప్పారు. వాయిదా వేయాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పారు. మరి నిన్నటి రోజున ఏ ఇన్‌పుట్స్‌ తీసుకొని వాయిదా వేశారు. ప్రోటోకాల్‌ ప్రకారం చీఫ్‌ సెక్రటరీ, హెల్త్‌ సెక్రటరీని సంప్రదించాలి.
  •  ఎన్నికల కమిషన్‌ అనేది వ్యక్తి కాదు.. అదొక వ్యవస్థ. కచ్చితంగా ప్రోటోకాల్స్‌ పాటించి తీరాలి. కోర్టులో కేసు వాదనలు వినకుండా జడ్జి ఇంట్లో కూర్చొని తీర్పు చెప్పినట్లుగా ఈసీ తీరు ఉంది.
  •  చీఫ్‌ సెక్రటరీ, హెల్త్‌ సెక్రటరీలతో సమీక్ష నిర్వహించి సలహాలు తీసుకోవాలి. రాజకీయ పార్టీలను సంప్రదించి సూచనలు తీసుకోవాలి. ఇందులో ఏమీ చేయలేదు.  పెద్ద పార్టీగా ఉన్న వైయస్‌ఆర్‌ సీపీని అడగాలి.
  •  టీడీపీ అధ్యక్షుడి ఇంట్లో వాళ్లకు కావాల్సిన వారు ప్రిపేర్‌ చేసిన నోట్‌ ఎన్నికల కమిషనర్‌ చదివారని మేము ఎందుకు అనుకోకూడదు. అలా సందేహాలకు ఆస్కారం ఇచ్చేలా వ్యవహరించడంలో ఆంతర్యం ఏంటీ..?
  •  అహ్మదాబాద్‌ స్టేట్‌మెంట్‌ చదివి వినిపించారు. అది కూడా తప్పే.. ఎన్నికలు పూర్తిగా వాయిదా వేయాలంటే.. కచ్చితంగా ప్రభుత్వాన్ని సంప్రదించాలి. దాన్ని పూర్తిగా గాలికి వదిలేసి అడ్డగోలు నిర్ణయాన్ని ప్రకటించారు.
  •  ఇళ్ల పట్టాల పంపిణీ ప్రలోభపెట్టే అంశం ఎలా అవుతుంది. ఇళ్ల పట్టాలు ఇప్పుడు ప్రకటించిన కార్యక్రమం కాదు. అలా అయితే రేషన్‌ కూడా ప్రలోభ పెట్టడమే అవుతుంది కదా.
  •  కరోనా వైరస్‌ అంటే ఏంటో ఎవరికీ తెలియదు. అగ్రరాజ్యం లాంటి అమెరికా కూడా దీన్ని ఎలా డీల్‌ చేయాలని ఆలోచన చేస్తుంది. వైరస్‌ను నియంత్రించడానికి కీలకమైన వ్యవస్థ లోకల్‌ బాడీ.
  •  ఆరు వారాల్లో కరోనా తగ్గుతుందని ఎలా చెబుతారు. ఈ 15 రోజుల్లో ఎన్నికలు జరిగితే వైరస్‌ను నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. కేంద్రం నుంచి రావాల్సిన రూ.5 వేల కోట్లు నోటి దగ్గర డబ్బులు లాగేశారు. రాష్ట్రాన్ని దెబ్బతీస్తున్నారు.
  •  గోవాలో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడికే విదేశాల నుంచి ఎక్కవగా వస్తుంటారు. అది ఆలోచన చేశారా..?
  •  ఎన్నికలు మొదలైనప్పటి నుంచి చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు చేస్తున్న యాగి ఎలా ఉందంటే.. రిజర్వేషన్‌ అడ్డుకోవడం, కోర్టుకు వెళ్లడం, ఇప్పుడు అల్లర్లు సృష్టించి కోర్టుకు వెళ్లడం. స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్‌ గొడవలు ఎక్కువగా ఉంటాయి. వాటిని తగ్గించి శాంతింపజేయాలి. అలా ప్రభుత్వం చేస్తుంది.
  •  పోటీ చేయడానికి టీడీపీకి మనుషులు దొరకడం లేదు. బాబు నాయకత్వంపై  విశ్వాసం పూర్తిగా పోయింది. మునిగిపోయే పడవ నుంచి తప్పించుకునే వాళ్లు ఎక్కువయ్యారు. వలసలు పెరిగాయి. మేము గేట్లు తెరిస్తే విపరీతంగా వలసలు పెరుగుతాయి.
  •  టీడీపీ అభ్యర్థులు లేరని తెలిసే ముందునుంచే ఒక బూచీని క్రియేట్‌ చేసి ఎన్నికలు జరగకుండా చేస్తున్నాడు. ఎన్నికలు వాయిదా వేసిన తరువాత అధికారులను ఎలా సస్పెండ్, బదిలీలు చేస్తారు.
  •  వ్యవస్థల్లో ఎప్పటి నుంచో వేర్లు ఊడలైపోయి ఎప్పుడైనా బయటపడితే తప్ప.. తెలియడం లేదు. దీంతో ఏం సాధిస్తారు. లక్షల కోట్లు అప్పు చేసిన వ్యక్తి.. కేంద్రం నుంచి వచ్చే రూ.5 వేల కోట్లు నిలిపివేయాలని కుట్ర చేస్తున్నాడు. రాష్ట్రం, ప్రజలు ఏమైనా పర్వాలేదని ఈ స్కెచ్‌ వేశారని భావిస్తున్నాం.
  •  ఈసీ రమేష్‌కుమార్‌ అన్నట్లుగా నిన్నటి విచక్షణ తప్పు.. ఇప్పటికైనా విచక్షణ ఉంటే ఎన్నికలు జరపాలి. ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించాం. ఎన్నికలు జరగాలని కోరుతున్నాం.
Back to Top