పసిపాపపై పిచ్చిపోస్టులు పైశాచికత్వానికి పరాకాష్ట 

అధికారంతో బరి తెగిస్తున్న టీడీపీ, జనసేన సైకోలు

పోతిన వెంకట మహేష్‌ ఆక్షేపణ

పవన్‌ కూతురికి ఒక న్యాయం. దేవికకు ఒక న్యాయమా?

చిన్నారిని ఆ స్థాయిలో ట్రోల్‌ చేయడం సమంజసమేనా? 

నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలి

ప్రెస్‌మీట్‌లో పోతిన వెంకట మహేష్‌ డిమాండ్‌

తాడేపల్లి: తమకిష్టం లేని పార్టీని, తమకు నచ్చని వ్యక్తులను ఎవరైనా అభిమానిస్తే ఊరుకునేది లేదు అన్నట్టుగా అధికార తెలుగుదేశం, జనసేన పార్టీలు సోషల్‌ మీడియాను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపులకు దిగుతున్నాయని వైయస్ఆర్‌సీపీ నేత పోతిన మహేష్‌ ఆక్షేపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియతో మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాను మంచి కోసం వాడుకుందామని భారీగా ఖర్చుతో ప్రచారం చేస్తూనే ఇంకోపక్క తమకు నచ్చని వారిని అసభ్యమైన పోస్టులతో దాడి చేసి వేధిస్తున్నాయని చెప్పారు. తన కూతురిపై పోస్టు పెట్టారని నొచ్చుకున్న పవన్‌కళ్యాణ్, వారిపై కేసులు పెట్టించి జైలుకు పంపే దాకా నిద్రపోలేదు. తాజాగా కుంభమేళాలో ఆ పార్టీ విడుదల చేసిన ఫొటోలపై కూడా మార్ఫింగ్‌ అంటూ అరెస్టు చేస్తున్నారు. అలాంటిది దేవిక లాంటి చిన్నారని డిప్యూటీ స్పీకర్‌ నుంచి కింది స్థాయి జనసేన, టీడీపీ కార్యకర్తలు వేధిస్తుంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తక్షణమే డీజీపీ స్పందించి నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోతిన మహేష్‌ డిమాండ్‌ చేశారు. 

తమకు నచ్చకపోతే ఎవరూ అభిమానించకూడదా?:
    కూటమి ప్రభుత్వం ఏర్పడగానే చంద్రబాబు ప్రతీకార రాజకీయాలు ప్రతిపక్ష పార్టీ నాయకులకు, అధికారులకు మాత్రమే పరిమితం చేయలేదు. నిన్నటిదాకా సామాజికవర్గాలను టార్గెట్‌ చేసిన టీడీపీ, జనసేన ఇప్పుడు మరింత బరి తెగించి కుటుంబాలను, చిన్న పిల్లలను సైతం వదలకుండా కక్ష తీర్చుకుంటున్నారు. తమకిష్టం లేని పార్టీలు, వ్యక్తులపై ఎవరైనా అభిమానం చూపిస్తే తట్టుకోలేక వారిని దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఆత్మహత్యలకు పాల్పడినా వదలకుండా వేధిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోతున్న పచ్చ ముఠా.. అసభ్యకరమైన పోస్టులతో  సోషల్‌ మీడియా వేదికలపై పేట్రేగిపోతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.     అక్రమ కేసులో అరెస్టై విజయవాడ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించడానికి, జగన్‌గారు అక్కడికి వెళ్లిన సందర్భంగా ఒక చిన్నారి కలిసి ఫొటోలు దిగితే దాన్ని కూడా టీడీపీ ఓర్చుకోలేకపోతుంది. మాజీ సీఎం జగన్‌పై అభం శుభం తెలియని ఒక చిన్నారి చూపించిన ప్రేమను కూడా వక్రీకరించి పోస్టులు పెడుతున్నారు. 

జర్నలిజం విలువలకు తిలోదాకలిచ్చి.:
    చివరకు పచ్చ మీడియా ఛానల్‌లో, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న నాయకుడిని తీసుకొచ్చి, డిస్కషన్‌లో కూర్చోబెట్టి, వెకిలి మాటలతో వికృతానందం పొందారంటే.. ఏ స్థాయికైనా దిగజారడానికి వారు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది. ఇవేనా జర్నలిజం విలువలు?. అలాంటి పదవిలో ఉన్న ప్రజాప్రతినిధి తన మనవరాలి వయసున్న పాప గురించి దారుణంగా మాట్లాడటం సంస్కారమేనా?  ఆయనతో పాటు తెలుగు 360 అనే ఎక్స్‌ హ్యాండిల్‌ నుంచి కొల్లి గోపాల్‌ అనే వ్యక్తి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలతో, తప్పుడు వివరాలతో ట్రోల్‌ చేశారు. 
    చివరకు అనూష ఉండవల్లి, స్వాతి చౌదరి అనే హ్యాండిల్స్‌ నుంచి తెలుగుదేశం మహిళలు కూడా చిన్న పాపని ట్రోలింగ్‌ చేస్తున్నారంటే ఇంకేమనాలి. ఆఖరుకి తల్లిదండ్రులను కూడా మార్చేసి తప్పుడు వివరాలతో పోస్టులు వైరల్‌ చేస్తున్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ఈ పాపంలో జనసేన సోషల్‌ మీడియా కూడా భాగం పంచుకుంది. ఆ పాప ప్రైవేట్‌ స్కూల్‌లో ఇంగ్లిష్‌ మీడియం చదవకూడదా?  ప్రభుత్వం నుంచి అమ్మ ఒడి అడగకూడదా?  పేద మధ్యతరగతి పిల్లలు ఎప్పటికీ అట్టడుగున ఉండిపోవాలా? 

ఎంత వరకు సబబు. ఆలోచించాలి:
    రాజకీయ కక్షలకు చిన్నపిల్లలను, సామాన్యులను బలి చేయడం ఎంత వరకు సబబు అని ఆలోచించుకోవాలి. దేవికారెడ్డి అనే చిన్నారిపై తప్పుడు పోస్టులు పెట్టిన జనసేన, టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై తక్షణమే పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయాలని డీజీపీని కోరుతున్నా. వారిని చట్టపరంగా చర్యలు తీసుకునేలా హోంమంత్రి అనిత ముందుకు రావాలని పోతిన వెంకట మహేష్‌ కోరారు.

Back to Top