బాబు పాల‌నంతా అబ‌ద్దాల‌తోనే  సాగింది

వైయ‌స్ఆర్ సీపీ సీనియ‌ర్ నేత కొయ్య ప్ర‌సాద‌రెడ్డి

విశాఖపట్నం:  గ‌త ఐదేళ్ల చంద్ర‌బాబు పాలనంతా అబ‌ద్దాల‌తోనే సాగింద‌ని, 14 ఏళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు ఉత్త‌రాంధ్ర‌కు ఒక్క అభివృద్ధి ప‌ని చేయ‌కుండా దుర్మార్గ‌పు పాల‌న న‌డిపార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు కొయ్య ప్ర‌సాద‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. విశాఖ‌ప‌ట్నంలోని వైయ‌స్ఆర్ సీపీ జిల్లా కార్యాల‌యంలో ఆయ‌న విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కొయ్య ప్ర‌సాద‌రెడ్డి మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి చంద్రబాబు, దేవినేని ఉమా, ధూళిపాళ్ల నరేంద్రలాంటి వారు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిప‌డ్డారు. విశాఖలోని ఎయిర్‌పోర్టు, ఫార్మాసిటీ, నౌకాశ్రయం, అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లు దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హయాంలోనే వృద్థి చెందాయని, ఆయన మరణానంతరం విశాఖ అభివృద్ధి కుంటుపడిందన్నారు. విశాఖ‌ప‌ట్నం ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్ అయితే ఏదో జరిగిపోయినట్టు హడావిడి చేస్తున్నారని, ఉత్తరాంధ్రపై చంద్ర‌బాబు అండ్ కో దుష్ప్రచారం ఆపాలన్నారు. లేకపోతే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. అతి తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం అవుతుందని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ విశాఖను ఎంచుకున్నారని, కక్షతో మాకొచ్చే అవకాశాన్ని దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు పాలన అంతా అబద్దాలతోనే సాగిందని, ఆ అబద్దాల వల్లే హుద్‌హుద్‌ లాంటివి వచ్చాయని ఎద్దేవా చేశారు. రైతుల పట్ల సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న కమిట్‌మెంట్‌ దేశంలో మరే నాయకుడికి లేదన్నారు. రైతుల కోసం అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టార‌ని గుర్తుచేశారు. 

Back to Top