వైయస్‌ఆర్ జిల్లా: అక్రమంగా సంపాదించిన డబ్బుతో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని ప్రభుత్వంపై బురదజల్లేందుకు చంద్రబాబు యత్నిస్తున్నాడని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సీ.రామచంద్రయ్య మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై టీడీపీ నేతల ఆరోపణలు అవివేకమన్నారు. వైయస్‌ఆర్ కడప జిల్లాలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రామచంద్రయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రివైయస్ జగన్‌పై ఉందని, సమస్యలు పరిష్కరించగలరనే విశ్వాసం ప్రజలకు పూర్తిగా ఉందన్నారు. చంద్రబాబును ప్రజలు తిరస్కరించినా.. ఖాళీగా లేని కుర్చీ కోసం పాకులాడుతున్నాడన్నారు. గతంలో ఐదేళ్లు అధికారాన్ని అనుభవించి అక్రమంగా సంపాదించిన డబ్బుతో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని సీఎం వైయస్ జగన్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు అనేక సార్లు మానవహక్కులను ఉల్లంఘించారని రామచంద్రయ్య చెప్పారు. చంద్రబాబు హయాంలో ఇసుక దోపిడీ విచ్చలవిడిగా జరిగింది. టీడీపీ నేతలు ఒక మాఫియాగా తయారై ఇసుకను ఇష్టానుసారంగా అమ్ముకొని ప్రజాధనాన్ని కొల్లగొట్టారన్నారు. ఇసుక అక్రమంగా తవ్వారని గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ చంద్రబాబుకు రూ. 100 కోట్లు పెనాల్టీ వేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వం తప్పు లేనప్పుడు తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోకూడదా..? అని రామచంద్రయ్య ప్రశ్నించారు. తప్పుడు వార్తలు రాయడానికి ఏ రాజ్యాంగంలో హక్కు ఉందో చెప్పాలన్నారు. చంద్రబాబు కార్యక్రమాలన్నీ పవన్ కల్యాణ్ నెత్తిన వేసుకుంటున్నాడని, బాబు చెప్పిన విధంగా పవన్ ఆడుతున్నాడన్నారు. ఓ పార్టీ అధ్యక్షుడు ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడం దేశ చరిత్రలో మొదటిసారిని ఎద్దేవా చేశారు. Read Also: మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు