పవన్‌వి ఊసరవెళ్లి రాజకీయాలు 

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

కులాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు

రాజకీయ లబ్ధి కోసం పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు

మీలా పూటకో మాట మాట్లాడలేం

ఎవరు టీఆర్‌ఎస్‌ గెలవాలని కోరుకున్నారు

నాగబాబు టీఆర్‌ఎస్‌కు ఓటు వేశానని స్వయంగా ప్రకటించారు

ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి

హత్య జరిగితే ప్రశ్నించాల్సింది ప్రతిపక్ష పార్టీనా? అధికార పార్టీనా?

హత్యా రాజకీయాల్లో చంద్రబాబు ఆరితేరారు

ఆస్తుల కోసం అన్నదమ్ములను చంపుకున్న చరిత్ర కళా వెంకట్రావుది

వైయస్‌ వివేకా హత్య జరిగి పది రోజులైనా నిందితులను కనిపెట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా?

 

హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ ఫైర్‌ అయ్యారు. పవన్‌ మాదిరిగా మేం ఊసరవెళ్లి రాజకీయాలు చేయడం లేదని, ఆయన లాలూచీ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. పవన్‌ సాంప్రదాయబద్ధంగా మాట్లాడటం నేర్చుకోవాలని సూచించారు. టీఆర్‌ఎస్‌తో పవన్‌ కళ్యాణ్‌ కుమ్మక్కు అయ్యింది వాస్తవం కాదా అన్నారు. ఆస్తుల కోసం అన్నదమ్ములను చంపుకున్న చరిత్ర టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌ది అని విమర్శించారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారని, ప్రతి సభలోనూదివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో..అంతకంటే మిన్నగా చేస్తానని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాట ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఈ ఐదేళ్లు చంద్రబాబు పాలనలో జరిగిన అరాచకాలు, అవినీతి గురించి చెబుతున్నారని తెలిపారు. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారని, అందరూ దీవిస్తున్నారని చెప్పారు. మా నాయకుడిని పొగడ్తలతో ముంచేందుకు చెబుతున్న మాటలు కాదని, కొద్దిసేపటి క్రితం పాడేరులో నిర్వహించిన సభకు వచ్చిన జనమే సాక్షమన్నారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగల్లో తొక్కుతున్నారని విమర్శించారు.

రాష్ట్రాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేలా ప్రసంగాలు చేస్తున్నారని తప్పు పట్టారు. నిన్న పవన్‌ కళ్యాణ్‌ భీమవరంలో అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసే సమయంలో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఏపీ ప్రజలారా ఆలోచించండి..చంద్రబాబు గజేట్‌ పేపర్లలోనే రాశారని చూపించారు. పవన్‌ కళ్యాణ్‌..మాకు పౌరుషం ఉందని, మాలో కూడా రక్తమే ప్రవహిస్తుందన్నారు. మీలాగా ఊసరవెళ్లి మాదిరిగా రోజుకో మాట..పూటకో మాట మాట్లాడటం లేదని సూచించారు. సంప్రదాయపద్ధతిలో మాట్లాడాలని హితవు పలికారు. గతంలో పవన్‌ కళ్యాణ్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసింది వాస్తవం కాదా? ఆయన్ను అభినందించిన ఫోటోలు వాస్తవం కాదా అని నిలదీశారు. మీ అన్న నాగబాబు నరసాపురం పార్లమెంట్‌ అభ్యర్థిగా ఉన్నారని, ఆయన ఇటీవల తెలంగాణ ఎన్నికల అనంతరం ట్విట్టర్‌లో ఎలాంటి మెసేజ్‌ పెట్టారో ఆధారాలతో సహా బొత్స సత్యనారాయణ చూపించారు. కంగ్రాట్స్‌ కేసీఆర్‌జీ, కేటీఆర్‌జీ అంటూ అభినందనలు తెలుపుతూ..నా ఓటు మీకే వేశానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ భాష ఏంటని, ఎందుకు ద్వంద వైఖరి అని ప్రశ్నించారు. ఎవరు టీఆర్‌ఎస్‌ పార్టీతో కుమ్మక్కు అయ్యారని ప్రశ్నించారు.

వైయస్‌ జగన్‌ చిన్నాన్న చనిపోతే పవన్‌ కళ్యాణ్‌ ఏం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దురదృష్టమైన ప్రభుత్వం ఉందని మేం చెబుతున్నామని, మాజీ మంత్రి వైయస్‌ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేస్తే ఈ ప్రభుత్వం నిందితులను కనుక్కొకుండా దుర్మార్గం చేస్తుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీనా మీరు ప్రశ్నించేది అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నాయా అని నిలదీశారు. మీరే కదా చంద్రబాబు ప్రభుత్వానికి గతంలో మద్దతిచ్చి గెలిపించిందని ప్రశ్నించారు. ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలు వేరు..రాజకీయాలు వేరని సూచించారు. నిక్కచ్చిగా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయమైన పాలనపై మాట్లాడే ధైర్యం ఉండాలని, అదే నాయకత్వమన్నారు. ఇలాంటి లక్షణాలు పవన్‌కు లేవన్నారు. మా నాయకుడు చనిపోతే రాజకీయాలు చేస్తున్నారని, వైయస్‌ జగన్‌ ఏం చేస్తున్నారని పవన్‌ మాట్లాడటం దారుణమన్నారు.

ప్రభుత్వాన్ని ఈ విషయంలో అడగాల్సిన బాధ్యత నీకు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హత్య రాజకీయాల్లో ఆరితేరారని, సొంత మామనే పొట్టన పెట్టుకున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని దుయ్యబట్టారు. ఏ కోణంలో చూసినా కూడా అవినీతిలో కూరుకుపోయిందని, పంచభూతాలను పంచుకుతింటున్నారని పేర్కొన్నారు. హత్య జరిగిన తరువాత కుటుంబ సభ్యులకు ఆపాదిస్తుంటే నీవు ఇలా మాట్లాడుతావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాకులు, చవాకులు మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. నిన్న కళా వెంకట్రావ్‌ ఓ లెటర్‌ రాశారని తప్పుపట్టారు. వివేకానందరెడ్డిని ఆస్తి కోసం చంపేశారని పేర్కొనడం బాధాకరమన్నారు. ఆస్తుల కోసం అన్నదమ్ములను చంపుకునే చరిత్ర కళా వెంకట్రావ్‌ కుటుంబానిదే అని దుయ్యబట్టారు. ఏదో మాట్లాడాలో ఆలోచించాలన్నారు. ఐదేళ్లుగా పోలీసులను చెప్పుచేతుల్లో పెట్టుకొని చంద్రబాబు అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఐదేళ్ల పాలన చూసి ఓటేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అని బొత్స సత్యనారాయణ సవాలు విసిరారు.  
 

Back to Top