టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయ‌రు

మాజీ మంత్రి అంబటి రాంబాబు సూటి ప్ర‌శ్న‌

స్పీకరైనా, మంత్రైనా చట్టం దృష్టిలో అంద‌రూ ఒక్క‌టే 

రెడ్‌బుక్‌ లోకేష్‌కు శాపంగా మారుతోంది

అరచేతిని అడ్డుపెట్టుకుని సినిమా విజయాన్ని ఆపలేరు

గుంటూరు: సోషల్‌మీడియాలో పోస్టులపై వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నపుడు టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయరని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. గుంటూరులో సోమవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్టు చేస్తున్నారు. ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. అసభ్యకరమైన పోస్టింగ్స్ పెడితే టీడీపీ వాళ్లను కూడా అరెస్ట్ చేస్తామని చంద్రబాబు నీతి వ్యాక్యాలు చెప్పారు.అయితే వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం లేవు.

ఇప్పటికే ఈ నెల 17,18,19 తేదీల్లో వైయ‌స్‌ జగన్‌, ఆయన కుటుంబ సభ్యులతో పాటు మా కుటుంబ సభ్యులపైన టీడీపీ నాయకులు పెట్టిన పోస్టులపై వివిధ పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేశాం. నిన్న అన్ని పీఎస్‌లకు వెళ్ళి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించాం. స్పష్టమైన సమాధానం మాకు రాలేదు. ఇప్పుడు స్పీకర్‌గా ఉన్న వ్యక్తి వైయ‌స్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

లోకేష్ కూడా వైయ‌స్ జగన్‌పై అసభ్యకరమైన పోస్టు పెట్టారు. రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. పోలీసులు స్పందించకుంటే న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తాం. స్పీకరైనా, మంత్రైనా చట్టం దృష్టిలో ఒకటే. ఇది అంతం కాదు ఆరంభమే. జమిలి ఎన్నికలొస్తాయన్న ప్రచారం జరుగుతోంది.

డైరెక్టర్ రాంగోపాల్ వర్మపైన కూడా కేసులు పెట్టారు. పోసాని మురళీకృష్ణ వైయ‌స్ జగన్‌ అభిమాని. ఆయనపై కేసులు పెట్టి భయపెట్టొచ్చేమో కానీ వైయ‌స్‌ జగన్‌పై ఆయనకున్న ప్రేమను మాత్రం తొలగించలేరు. రెడ్‌బుక్‌ లోకేష్ రాశాడు. రెడ్‌బుక్‌ లోకేష్‌కు శాపంగా మారుతోంది. రెడ్‌బుక్‌ రచయితగా లోకేష్ చరిత్రలో నిలిచిపోతాడు’అని అంబటి ఎద్దేవా చేశారు.

పుష్ప- 2 అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు..

‘అల్లు అర్జున్ సినిమాను చూడకుండా ఎవరూ ఆపలేరు.అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్టార్.పుష్ప-2 అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు.గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అడ్డుకోవాలనుకున్నారు ఏమైంది.సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. పుష్ప-2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అరచేతిని అడ్డుపెట్టుకుని సినిమా విజయాన్ని ఆపలేరు.నేను కూడా సినిమా చూడడానికి రెడీగా ఉన్నాను.మొదటి పార్ట్ అద్భుతంగా ఉంది.పుష్ప-2పై కొంతమందికి జెలసీగా ఉంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ను బహిష్కరించాలనుకోవడం అవివేకమ‌ని అంబటి రాంబాబు అన్నారు. 

Back to Top