తాడేపల్లి: ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చింది ఇది సూపర్ సిక్సా? లేక సూపర్ మోసమా? అని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. పిల్లలని స్కూల్ కి పంపే అమ్మలకు ‘తల్లికి వందనం’ పథకం కింద రూ. 15,000 ఆర్థిక సహాయం అంటూ ఏపీ ప్రభుత్వం జీవో 29 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఎన్నికల ముందు ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలంటే అందరికి తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక మాట మార్చారని మాజీ మంత్రి మండిపడ్డారు. గురువారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు ఏమన్నారంటే.. పేదరికంలో ఉన్న పిల్లలను బడులకు పంపించాలంటే పేదరికం అడ్డుకాకూడని, బడి ఈడు పిల్లలు పనులకు పోకూడదన్న మంచి సంకల్పంతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. రూ.15 వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం ద్వారా.. పిల్లలను పిల్లలను బడికి పంపించాలనే కోరిక పేదరికంలో ఉన్నవాళ్లకు కలగాలనే ఉద్ధేశ్యంతో ప్రపంచంలో ఎక్కడా ఏ ముఖ్యమంత్రి, నాయకుడు చేయని వంటి వినూత్న ఆలోచనను చేసిన వ్యక్తి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేమని ఆయన స్పష్టం చేశారు. ఇదే పథకంపై ఎన్నికల్లో వాగ్ధానం చేయడమే కాకుండా... ఎన్నికల తర్వాత నాలుగు విడతల్లో రూ.26 వేల కోట్లు తల్లుల ఖాతాల్లోకి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జమ చేశారన్నారు. అలాంటి గొప్ప ఆలోచన చేసిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని... నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు సైకో అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అంబటి మండిపడ్డారు. 14 సంవత్సరాలు పాటు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చంద్రబాబుకు రానటువంటి గొప్ప ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. ఐదేళ్లు మా ప్రభుత్వ హయాంలో అమలుచేసిన అమ్మఒడి కార్యక్రమాన్ని తెలుగుదేశం కూటమి కాపీ కొట్టిందని.. మంచి కార్యక్రమాన్ని కాపీ కొట్టడంలో తప్పులేదన్నారు. అయితే ఇంటిలో ఎంతమంది చదువుకున్నా ఒక్కరికే రూ.15వేలు మాత్రమే వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్నాడు... మమ్నల్ని అధికారంలోకి తీసుకొస్తే ఒకరైతే రూ.15వేలు, ఇద్దరుంటే.. రూ.30వేలు, ముగ్గురు ఉంటే.. రూ.45వేలు, నలుగురు పిల్లలుంటే రూ.60వేలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తామని ప్రకటిస్తే ప్రజలు ఆకర్షితులై ఓట్లేసి గెలిపించారన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చంద్రబాబునాయుడికి ఉందా? లేదా ? అని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ప్రతి బహిరంగ సభలో కూడా చంద్రబాబు చెప్పుకుంటూ వచ్చారని.. కేవలం చంద్రబాబే కాదు, లోకేష్, పవన్‌కళ్యాణ్‌తో పాటు కూటమిలో ఉన్న అందరూ ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ... తెలుగుదేశం పార్టీ ప్రచార వీడియోలు ప్రదర్శించారు. సూపర్ సిక్స్‌లో ఎంత మంది పిల్లలు బడికి వెళితే అంతమందికి రూ.15 వేలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎన్నికల ప్రచారంలో చెప్పిన వీడియోలను మీడియా ముందు ప్రదర్శించారు. మరో మంత్రి రామానాయుడు అయితే ఇంటింటికీ వెళ్లి ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే అన్ని రూ.15వేలు ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సూపర్ సిక్స్‌లో పెట్టి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందన్నారు. కానీ గత రాత్రి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 29ని విడుదల చేసిందని... ఈ జీవోను చదివితే.. చాలా అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఈ జీవో ప్రకారం ప్రతి ఏడాది తల్లికి వందనం కింద రూ.15వేలు అందిస్తామన్నట్టుగా రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంత మంది పిల్లలను స్కూల్‌కి పంపినా రూ.15వేలు ఇస్తామన్నారు. ఇది సూపర్ సిక్స్ కాదని.. సూపర్ మోసమని అభివర్ణించారు. ఇది తల్లికి వందనం కాదని.. తల్లికి మోసం కాదా చంద్రబాబు నాయుడు గారు అని కూటమి నాయకులను సూటిగా ప్రశ్నించారు. 2023లో రాష్ట్ర వ్యాప్తంగా 42,61,965 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.6392 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి వేసారని... అంతమంది తల్లులను చంద్రబాబు మోసం చేసినట్టు కాదా అని అన్నారు. ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకుంటే... ఆయన నారాచంద్రబాబు నాయుడు ఎందుకు అవుతారన్నారు. మరోవైపు ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్‌రెడ్డి అయితే... ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని తుంగలో తొక్కిన మోసగాడు చంద్రబాబునాయుడు అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. చంద్రబాబు ఇంత పచ్చి మోసం చేస్తుంటే ఇంకా ఏం చెప్పాలన్నారు. బాబు మోసం చేయడంలో బాగా అలవాటు పడ్డ వ్యక్తి, గతంలో రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఎగ్గొట్టిన వ్యక్తి అని.. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమి పైనే ఉందన్నారు. రేవు దాటిన తర్వాత తెప్ప తగిలేసేది, ఓడ మీదన్నప్పుడు ఓడ మల్లయ్య, ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అనే నైజం ఏంటన్నారు. అలవాడు పడ్డ మోసగాడులా ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారన్నారు. ఇది చాలా దారుణమన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి వద్దని, చంద్రబాబే కావాలని ఓట్లేసిన తల్లులు, కుటుంబాలు తాము ఎంత దారుణమైన మోసాలు చేసే వ్యక్తికి ఓట్లేసామో గుర్తించుకోవాలని అంబటి సూచించారు. ఇదే వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్లయితే జూన్ ఆఖరునాటికి ప్రతి తల్లి ఖాతాలో అమ్మఒడి జమ అయి ఉండేదని.. ఇవాళ జూలై వచ్చినా అమ్మఒడి డబ్బులు రాలేదన్నారు. ఈ డబ్బులు ఎప్పుడు వేస్తారో చెప్పాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నానన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని దూషించడం ద్వారా కాలయాపన చేస్తున్న చంద్రబాబు.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని చరిత్రహీనుడుగా మరొక్కసారి మిగిలిపోయే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రతి పిల్లవాడికి తల్లికి వందనం ఇస్తానని చెప్పి... కేవలం ఒక్కరికే ఇస్తామని జీవో జారీ చేశారని.. అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదని అంబటి ప్రభుత్వంపై మండిపడ్డారు. తల్లుల ఖాతాల్లో ఎప్పుడు డబ్బులు జమ చేస్తారో చెప్పడంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన జీవోను మార్చి ఎంతమంది పిల్లలుంటే అంత మంది పిల్లలకు డబ్బులు ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కాకుండా చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజలు పచ్చాత్తాపడే రోజులు ప్రారంభమయ్యాయన్నారు. ఇదే వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉండి ఉంటే.. రైతు భరోసా, పొదుపుసంఘాలకు డబ్బులు, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన అమౌంట్లను సంక్షేమ క్యాలెండర్ ప్రకారం తేదీల వారీగా ఈ పాటికే ఇచ్చి ఉండేవారన్నారు. మీరు వాగ్ధానాలను నెరవేర్చకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెంటపడుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. 40శాతం ఓట్ షేర్ ఉన్న రాజకీయపార్టీగా ప్రజల పక్షాన ఉండి పోరాడతామని తేల్చి చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కించపరిచే మాటలు మాట్లాడుతున్నారని.. అది తగదని హెచ్చరించారు. వాగ్ధానాల అమలకు సంబంధించి... రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదన్న చంద్రబాబు మాటలపై స్పందించి ఎన్నికలకు ముందు ఈ విషయం చంద్రబాబుకు తెలియదా? అని అంబటి ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఆర్ధిక పరిస్థితి తెలియదు కాబట్టి.. అప్పుడు వాగ్దానాలను ఇచ్చానని, ఇప్పుడు ఏ వాగ్ధానాలను తాను అమలు చేయలేనని చేతులెత్తేయాలని చంద్రబాబుకు అంబటి సూచించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి ఏ రకమైన ఆర్ధిక పరిస్థితి ఉందో, చంద్రబాబు నాయుడు 4వ సారి ముక్యమంత్రి అయ్యేటప్పటికి ఖజానా ఏ విధంగా ఉందో పరిశీలన చేసుకోవాలన్నారు. ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకుంటారా? లేదా ఎగ్గొడతారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మేనిఫెస్టోలో ఉన్న విషయాలను అమలు చేయకపోతే అదో పెద్ద చర్చ అని.. కానీ 1989 నుంచి రాజకీయాలు చూస్తున్న వ్యక్తిగా మేనిఫెస్టోని 98శాతం అమలు చేసిన తొలి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నిలబెట్టుకున్న వ్యక్తి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అయితే... ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని అమలు చేయని వ్యక్తి చంద్రబాబు అని అంబటి రాంబాబు మరోసారి పునరుద్ఘాటించారు.