తాడేపల్లి: పరిషత్ ఎన్నికలపై డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును వైయస్‌ఆర్ సీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తోందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. సీఎం వైయస్ జగన్ నేతృత్వంలో ప్రజాస్వామ్య విలువలు, చట్టాల పట్ల, న్యాయస్థానం తీర్పులపై అమితమైన గౌరవంతో ముందుకెళ్తున్నామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మరోసారి వైయస్‌ఆర్ సీపీ జెండా రెపరెపలాడబోతోందన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సంవత్సరం క్రితమే జరగాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను అప్పుడున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ చంద్రబాబు ఆదేశాల మేరకు వాయిదా వేశాడన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైయస్‌ఆర్ సీపీ ఏకగ్రీవాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రజల్లో సంపూర్ణ మద్దతు అధికార పార్టీకి ఉందని చంద్రబాబు రచించిన పథకంలో భాగంగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ హడావుడిగా ఎన్నికలు వాయిదా వేశారని గుర్తుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలనే ప్రభుత్వ అభ్యర్థన మేరకు నూతన ఎస్‌ఈసీ ఎన్నికల నిర్వాహణకు షెడ్యూల్ ప్రకటించారని చెప్పారు. చంద్రబాబుది రెండుకళ్ల సిద్ధాంతం.. ఆయన రాజకీయ పుట్టుకే వెన్నుపోటు. నిరంతరం అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలనుకునే రాజకీయ పార్టీ టీడీపీ అని వైయస్‌ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో పాల్గొన్న చంద్రబాబు.. పరిషత్ ఎన్నికల్లో బహిష్కరిస్తున్నట్లు కొత్త నాటకం ఆడుతున్నాడని మండిపడ్డారు. ఆ నాటకం కోసం పొలిట్‌బ్యూరో సమావేశం.. తీర్మానాలు.. అసలు పరిషత్ ఎన్నికలను ఎందుకు బహిష్కరిస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. చేతగానితనానికి మరో పేరు బహిష్కరణ అంటూ చురకలు అంటించారు.