ఆ రెండు గాడిదల నుంచి రాష్ట్రాన్ని కాపాడుతున్నాం

స్టాన్‌ఫర్డ్‌ నేర్పిన సంస్కారం ఇదేనా..? 

లోకేష్‌ డిగ్రీపై అనుమానాలు కలుగుతున్నాయి

పంచాయతీ ఓటమిని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడు 

విశాఖ ఉక్కులో పెట్టుబడులకు కేంద్రం వెనక్కుతగ్గింది బాబు హయాంలోనే..

2017లో పోస్కో సంస్థ ప్రతినిధులను చంద్రబాబు కలిసింది వాస్తవం కాదా..?

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ధ్వజం

తాడేపల్లి: పంచాయతీ ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేక చంద్రబాబు మతిభ్రమించినట్లుగా మాట్లాడుతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. పల్లె ప్రజలు ఇచ్చిన తీర్పును చంద్రబాబు గౌరవించలేకపోతున్నాడన్నారు. గతంలో ఈవీఎంల వల్ల మోసం జరిగిందని మాట్లాడిన చంద్రబాబుకు బ్యాలెట్‌ పేపర్లతోనూ ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. ఓటమిని అంగీకరించలేక చంద్రబాబు మాట్లాడే మాటలు విని ప్రజాస్వామ్యవాదులు సిగ్గుతో తలదించుకుంటున్నారన్నారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పుత్రరత్నం లోకేష్‌ విశాఖకు వెళ్లి మాట్లాడిన మాటలు వింటే నవ్వొస్తుందని, ఇలాంటి వ్యక్తీ ఆంధ్రరాష్ట్రంలో ఉన్నాడనే కొంత బాధ కూడా కలుగుతుందన్నారు. ప్రపంచంలోనే పేరుగాంచిన స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుకున్నానని చెప్పుకునే లోకేష్‌.. అక్కడ చదివి నేర్చుకున్న సంస్కారం ఇదేనా..? అని ప్రశ్నించారు. లోకేష్‌ మాటలు వింటుంటే.. ఆయన చదువుపై, డిగ్రీపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. దుష్ప్రచారం, అవాస్తవాలు, అబద్ధాలు, కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు, లోకేష్‌ లాంటి రెండు గాడిదల నుంచి ప్రజలను రక్షించేందుకు మా ప్రభుత్వం కాపలాకాస్తుందన్నారు. 

‘లోకేష్, చంద్రబాబు ప్రవర్తనను తట్టుకోలేక టీడీపీలోంచి ఎమ్మెల్యేలంతా బయటకు వస్తున్నారు. గ్రామస్థాయి ఎన్నికలు జరిగితే పోటీకి అభ్యర్థులను కూడా పెట్టలేని దుస్థితిలో టీడీపీ ఉంది. రాజకీయాల్లో గెలుపుఓటముల గురించి లోకేష్‌ మాట్లాడటం విడ్డూరం..! చంద్రబాబు అద్భుతంగా తీర్చిదిద్దిన అమరావతి పక్కన ఉన్న మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్‌కు.. ప్రజా ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. 

ఉక్కు ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రజలందరి హక్కు.. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు వైయస్‌ఆర్‌ సీపీ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. స్టీల్‌ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణకు ఎప్పుడు బీజం పడిందో ప్రజలంతా తెలుసుకోవాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పెట్టుబడులు ఉపసంహరిస్తూ 2017లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. 2017లో చంద్రబాబు భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరించుకుంటే కనీసం ఒక్క ఉత్తరం అయినా కేంద్రానికి ఎందుకు రాయలేదు బాబూ..? 

పోస్కోకు సంబంధించిన ప్రతినిధులు సీఎం వైయస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిస్తే.. దాన్ని వక్రీకరిస్తున్నారు. 2017లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిసెంబర్‌ 4, 5, 6 తేదీల్లో దక్షిణ కొరియాకు వెళ్లారు. దక్షిణ కొరియాకు సుదీర్ఘ సముద్రతీరం ఉంది. ఏపీకి సుదీర్ఘ సముద్రతీరం ఉందని.. ఏపీ, దక్షిణ కొరియా ఒక్కటే అన్నట్లుగా మాట్లాడారు. ఆనాడు పోస్కో సంస్థ ప్రతినిధులతో మాట్లాడి ఫొటోలు దిగింది వాస్తవం కాదా..? 2017లో పోస్కో సంస్థతో చంద్రబాబు చేసుకున్న రహస్య ఒప్పందం ఏంటో ప్రజలకు సమాధానం చెప్పాలి. బాబు అధికారంలో ఉండగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేశాడు. రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉండి ఉంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఎప్పుడో ప్రైవేట్‌పరం చేసేవాడు అని లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు.

Back to Top