టీడీపీ దౌర్జన్యాలపై చర్యలు తీసుకోండి

కళ్యాణదుర్గం కొండాపురంలో బలవంతపు ఏకగ్రీవాన్ని రద్దు చేయండి

కామనూరులో సర్పంచ్‌ అభ్యర్థి కరీమూన్‌కు రక్షణ కల్పించండి

నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి

ఎస్‌ఈసీకి వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు

విజయవాడ: పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అరాచ‌కాలు, దౌర్జన్యాలపై వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్‌ఈసీకి ఫిర్యాదు పత్రం అందించారు. ప్రొద్దుటూరులో వైయస్‌ఆర్‌ సీపీ నేతలపై దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిపై చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎస్‌ఈసీని కోరారు. అదే విధంగా అనంతపురం జిల్లా ఉరవకొండ, గుంటూరు జిల్లా పొన్నూరులో, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు డబ్బులు పంచుతూ ఓట‌ర్ల‌ను ప్ర‌లోభాల‌కు గురిచేస్తూ.. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

అదేవిధంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొండాపురంలో సర్పంచ్‌ అభ్యర్థి లక్ష్మిదేవిని టీడీపీ సీనియర్‌ నేతలు బెదిరించారని, లక్ష్మిదేవి నామినేషన్‌పై టీడీపీ నేతలు మల్లికార్జున, ఉన్నం మారుతీచౌదరి, అనిల్‌ చౌదరి, పవన్‌ చౌదరి దౌర్జన్యానికి దిగారని, కొండాపూరం ఘటనలో టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. కొండాపురంలో బలవంతపు ఏకగ్రీవాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 

45 ఏళ్లుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కామనూరు గ్రామంలో దౌర్జన్యాలకు పాల్పడుతూ.. బలవంతపు ఏకగ్రీవాలతో ఎన్నికలు జరగకుండా చేస్తున్నాడని లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. బీసీలకు రిజర్వ్‌ చేసిన స్థానంలో నామినేషన్‌ వేసిన షేక్‌ కరీమూన్‌ను వరదరాజులరెడ్డి బెదిరిస్తున్నారని, కరీమూన్‌కు రక్షణ కల్పించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని ఎస్‌ఈసీని కోరారు. 
 

Back to Top