ఓటీఎస్‌ పూర్తి స్వచ్ఛందం.. ఎవరూ బలవంతపెట్టరు

నామమాత్రపు రుసుము చెల్లిస్తే ఇల్లు మీ సొంతం

లబ్ధిదారులు తీసుకున్న రుణ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది

ఇంటిపై పూర్తి హక్కును లబ్ధిదారులకు కల్పించాలన్నదే సీఎం ఆలోచన

పేదలకు మంచి జరిగే పథకంపై చంద్రబాబు దుష్ప్రచారం

ఓటీఎస్‌పై సహాయ నిరాకరణ చేయాలనడం విడ్డూరం

2014–19 మధ్య ఓటీఎస్‌ వడ్డీమాఫీ కూడా చంద్రబాబు చేయలేదు

అధికారులు పంపిన ప్రపోజల్స్‌ను ఐదుసార్లు రిజక్ట్‌ చేశాడు

ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే చర్యలు ఎవరైనా చేస్తే చర్యలు తీసుకుంటాం

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: పేదలకు మంచి జరిగే ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సర్వహక్కులతో ఇంటిని లబ్ధిదారుల సొంత ఆస్తిగా మార్చాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారని, ఓటీఎస్‌ మీద సహాయ నిరాకరణ చేయాలని చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. టార్గెట్లు పెట్టి చేయిస్తున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. అలా మాట్లాడటం తప్పు, దుర్మార్గమని, ఓటీఎస్‌ పూర్తిగా స్వచ్ఛందం.. ఎవరూ బలవంతపెట్టరని చెప్పారు. 

తాడేపల్లిలోని తన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. గృహ నిర్మాణ సంస్థ వద్ద స్థలాలను తనఖా పెట్టి, ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాన్ని మాఫీ చేసి.. ఆ ఇంటిపై పూర్తిహక్కు కల్పించాలని జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చారన్నారు. గ్రామాల్లో అయితే రూ. 10 వేలు, మున్సిపాలిటీల్లో అయితే రూ. 15 వేలు, కార్పొరేషన్‌లో అయితే రూ. 20 వేల నామమాత్రపు రుసుము చెల్లిస్తే చాలు ఇంటిపై తీసుకున్న రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేసి.. గ్రామ సచివాలయాల్లోనే ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇంటి పత్రాలు లబ్ధిదారులకు అందిస్తుందని స్పష్టంగా చెప్పామన్నారు. 

రుణం తీసుకోనివారు రూ.10 చెల్లిస్తే చాలు సర్వహక్కులతో రిజిస్ట్రేషన్‌ చేస్తామని, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా లబ్ధిదారులకు మేలు జరుగుతుందని చెబుతున్నామన్నారు. మసిబూసి మారేడుకాయ చేసి ఏదోరకంగా ప్రభుత్వంపై బురదజల్లాలని చంద్రబాబు చూస్తున్నాడని, ఓటీఎస్‌లో పేదలకు నష్టం కలిగిస్తుందనే అంశం ఒక్కటైనా ఉందా..? అని ప్రశ్నించారు. 

ఓటీఎస్‌ 2000 సంవత్సరంలో మొదలైతే.. 2014 వరకు 2 లక్షల మంది మాత్రమే ఉపయోగించుకోగలిగారని, 2014–2019 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓటీఎస్‌ వడ్డీ మాఫీ కూడా చేయలేదని, ఐదుసార్లు అధికారులు ప్రతిపాదనలు పెడితే.. రిజక్ట్‌ చేశాడన్నారు. 2014–19 మధ్య వడ్డీ కూడా మాఫీ చేయని చంద్రబాబు.. అధికారంలోకి వస్తే ఫ్రీగా ఇస్తానని మాట్లాడటం విడ్డూరమని, ఐదేళ్లలో వడ్డీ ఎందుకు మాఫీ చేయలేదు.. ఫ్రీగా ఎందుకు చేయలేకపోయాడని ప్రశ్నించారు. అసలు అది నోరా.. హద్దు అదుపు లేదా..? అని నిలదీశారు. 

‘‘అసలు కడితే వడ్డీ మాఫీ చేస్తామని గత ప్రభుత్వాలు చెప్పినప్పుడు ఇళ్లు లబ్ధిదారుల సొంతం కాలేదు. అసైన్డ్‌గానే ఉంటుంది. పట్టా మాత్రమే చేతికి వస్తుంది. బ్యాంకు లోన్‌లకు, అవసరమైతే అమ్మడానికి, వారసత్వంగా పిల్లలకు ఇచ్చే అవకాశాలు లేకుండా ఉన్న ఇంటిని.. ఈ రోజు పూర్తి హక్కును కల్పిస్తున్న పథకం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం.

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ 30 లక్షల మందికి సొంతింటిని నిర్మించి ఇస్తున్నారు. గతంలో తీసుకున్న వారికి ఇంటికి హక్కు లేకుండా పోయింది. ఆ వెసులుబాటు కల్పించేందుకు చట్టంలో సవరణ చేశారు. 10 సంవత్సరాలు అసైన్డ్‌ భూముల్లో నివాసం ఉంటే వారికి ఆ ఇంటిపై హక్కు కల్పించేలా చట్టంలో మార్పులు చేశాం. పీఓటీ చట్టాన్ని మన ప్రభుత్వం తీసుకువచ్చింది. 

గృహ నిర్మాణ సంస్థ వద్ద స్థలాలను తాకట్టుపెట్టి, ఇళ్ల నిర్మాణం కోసం తీసుకున్న రుణం అసలు, వడ్డీతో కలిపి రూ. 14,400 కోట్ల అయితే ఈ‡రెండింటినీ తీసేయడం ద్వారా లబ్ధిదారులంతా ముందుకు వస్తే ప్రభుత్వానికి వచ్చేది రూ. 3 నుంచి 4 వేల కోట్లు మాత్రమే. సీఎం వైయస్‌ జగన్‌ అమ్మఒడి పథకానికే సంవత్సరానికి రూ. 6,500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేసే ఏ పథకం తీసుకున్నా 4, 5 వేల కోట్లు. టీడీపీ హయాంలో 40 లక్షలు కూడా లేని పెన్షన్లు 60 లక్షలకుపైగా ఇస్తున్నాం. ప్రతీది పారదర్శంగా ఇస్తున్నాం. చంద్రబాబులా వెయ్యి, 2 వేల కోట్లకు కక్కుర్తిపడే ప్రభుత్వం కాదిది. ప్రజలకు మేలు చేయాలనుకునే ప్రభుత్వం. సంతబొమ్మాళిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారిపై చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే చర్యలు ఎవరైనా చేస్తే చర్యలు తీసుకుంటాం. చంద్రబాబు తాను అనుకున్న ప్రకారమే పాలన నడవాలని అనుకుంటున్నాడు. ఇంకా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నట్టు భ్రమపడుతున్నాడు. 

ఉద్యోగులు ప్రజల్లో, ప్రభుత్వంలో భాగం. మా ఆలోచనలు కింది స్థాయికి తీసుకెళ్లాల్సిన వారిపై ప్రేమే ఉంటుంది. చంద్రబాబు డీఎలు ఎగ్గొడితే మేము రాగానే 27 శాతం ఐఆర్‌ ఇచ్చాం. కోవిడ్‌ వల్ల కాస్త ఇబ్బంది వచ్చిన మాట వాస్తవమే. కొంతమంది నాయకులు మాట్లాడిన మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లు నలుగురే ఉద్యోగులు కాదు కదా. ఒక వేళ వాళ్లు నిర్ణాయక శక్తి అనుకుంటే రాజకీయాల్లోకి వెళ్లొచ్చు ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. 

కేంద్రమంత్రి అన్నమయ్య ప్రాజెక్టుపై కనీసం కేంద్ర బృందం పరిశీలన తెలుసుకుని మాట్లాడి ఉంటే బాగుండేది. బహుశా ఆయన పక్కన టీడీపీ నుంచి వచ్చిన నేతలు ఏమైనా మాట్లాడించారేమో. కొన్ని తరాలుగా అక్కడ ఇంత స్థాయి వరద రాలేదు. ఏమి జరిగిందో అక్కడి ప్రజలకు తెలుసు. అందుకే ముఖ్యమంత్రి వెళ్లినప్పుడు ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. దాన్ని కూడా చంద్రబాబు, కొన్ని పత్రికలు, ఛానళ్లు  జీర్ణించుకోలేక పోతున్నాయి’ అని విమర్శించారు. 

 

తాజా వీడియోలు

Back to Top