మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్ర‌భుత్వం

ఉద్యోగుల భద్రతలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రెండడుగుల ముందే ఉంటారు

త్వ‌ర‌లోనే ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయి

ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

తాడేపల్లి: ఉద్యోగుల భద్రతలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రెండడుగుల ముందే ఉంటారని,  ఉద్యోగులకు ఎప్పుడు ఏ సమస్య వ‌చ్చినా కచ్చితంగా వాటిని పరిష్కరిస్తామని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. సుదీర్ఘకాలంగా ఉన్న ఆర్టీసీ డిమాండ్లను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నెర‌వేర్చార‌ని గుర్తుచేశారు. ఉద్యోగులను రాజకీయాల కోసం వాడుకోవడాన్నిముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ సహించరని స్పష్టంచేశారు. తాడేపల్లిలో సీఎం కార్యాల‌య అధికారులతో ఉద్యోగ సంఘాల నాయకులు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. భేటీ అనంత‌రం ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల‌తో నేత‌ల‌తో క‌లిసి మీడియాతో మాట్లాడారు.   

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 27శాతం ఐఆర్ హామీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ నెరవేర్చారని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. రెండేళ్లుగా కోవిడ్ వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారిందని, దీంతో కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామని, పీఆర్సీ వంటి సమస్యలపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. పీఆర్సీ ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని, మిగిలిన విషయాలను కూడా క్రమపద్ధతిలో చేస్తామని భరోసానిచ్చారు. వైయ‌స్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చాక ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుతోపాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలను అమ‌లు చేశామ‌న్నారు. ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వం లేదని, అపోహలు వీడాల‌ని,  ఎవరేం చెప్పినా నమ్మొద్దని సూచించారు. జీతాల విషయంలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకుంటామ‌ని, ఉద్యోగులను మరింత ఆప్యాయంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చూసుకుంటార‌న్నారు. మిగిలిన సమస్యలు నవంబర్‌లోగా తీరుస్తామ‌ని, ఏ ఉద్యోగ సంఘాలు వచ్చినా, ఉద్యోగులు వచ్చినా వారి స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించి ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తామ‌న్నారు. ఇది ఎంప్లాయ్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని స‌జ్జ‌ల చెప్పారు. 

Back to Top