తాడేపల్లి: ఆర్థిక నేరాలకు పాల్పడినందుకు సిగ్గుతో తల దించుకోవాల్సిందిపోయి ఏ తప్పూ చేయలేదంటూ దబాయించడం చంద్రబాబు నాయుడు, ఆయన గ్యాంగ్‌కే చెల్లిందని వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై సజ్జల హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు 40 ఏళ్ల చరిత్రలో కుంభకోణాలు తప్ప ఏమున్నాయని ప్రశ్నించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సుదీర్ఘ వాదనల తర్వాత కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పింది. ఒక నేరానికి సంబంధించి కేసు నమోదు చేసి విచారణలో భాగంగా తీగలాగితే డొంక కదిలినట్లు చంద్రబాబు వద్దకు వెళ్లింది. ఈ కుంభకోణానికి సంబంధించిన రూపకర్త, నిర్మాత, దర్శకత్వం, విలన్..అన్నీ నారా చంద్రబాబునాయుడేననే బలమైన సాక్షాధారాలతో అరెస్టు చేశారు. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ దీనిపై తమ తప్పేమీ లేదన్నట్లు, వాళ్లకి వ్యతిరేకంగా నేరం జరిగినట్లు ప్రవర్తిస్తున్నారు. చేసిన నేరానికి సిగ్గుతో తలవంచుకోవాల్సింది పోయి..ఎదురు దబాయింపులతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రకంగా, రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు. ఆయన కుమారుడు, దత్తకుమారుడు.. మిగిలిన చెత్త చెదారం వ్యవహరించిన తీరు రాష్ట్రం మొత్తం గమనించింది. రిమాండ్‌కు పంపడం పెద్ద విషయం అని మేము అనుకోవడం లేదు. బలమైన ఆధారాలున్నాయి కాబట్టి నేరం భవిష్యత్తులో తప్పకుండా రుజువు అవుతుందని భావిస్తున్నాం. నిన్నటి నుంచి టీడీపీ నేతలు, కుటుంబ సభ్యలు ప్రపంచంలో జరగరాని ఘోరం జరిగినట్లు వ్యవహరించారు. దేశంలో చాలా కేసులు జరిగాయి కానీ ఇలా ఎవరూ బరితెగించలేదు. ఏదైనా ఒక కాంట్రాక్టుకు సంబంధించి క్విడ్ ప్రోకోనో చేస్తే కరప్షన్ కేసు అవుతుంది. అసలు స్కాం క్రియేట్ చేసి..లేని కంపెనీని తీసుకువచ్చి, ఒక కంపెనీ పేరు దొంగిలించి నేరం చేశారు. స్కిల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ పెట్టి, ఒక బయటి వ్యక్తిని తెచ్చి నాలుగు డిపార్ట్‌మెంట్లకు సెక్రటరీగా పెట్టాడు. దానికో డిపార్ట్‌మెంట్ క్రియేట్ చేసి దాన్ని చంద్రబాబే నేరుగా తనకింద పెట్టుకుని...నాలుగు రోజుల్లోనే జీవో విడుదల చేశారు. 90 శాతం ప్రైవేటు కంపెనీ పెడితే..10 శాతం ప్రభుత్వం పెడుతుందని జీవో తెచ్చారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా లోకల్ అధికారులతో కలిసి రూ.371 కోట్లు ఇచ్చేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంశమే.. జరిగిన ఒప్పందంలో నుంచి తీసేశారు. ప్రజల సొమ్మును నేరుగా బయటకు పంపించి అక్కడి నుంచి షెల్ కంపెనీలకు పంపి, అక్కడి నుంచి చంద్రబాబుకు చేరింది. ఆయనకు తెలియదా అంటే ఆ శాఖ చంద్రబాబు కిందే ఉంది. ఫైనాన్స్ సెక్రటరీ, సీఎస్‌లు నేరుగా ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి చెల్లించాలి అని చెప్పారు. రూ.371 కోట్లు కొట్టేయాలని అనుకుని ఇంత గ్రాండ్ ప్లాన్ చేశారు. దాన్ని నేను చేశానా లేదా అనేది చెప్పకుండా నిన్నటి నుంచీ దబాయిస్తున్నారు. దత్తపుత్రుడే వీరంగం వేశాడు అసలు సొంత పుత్రుడి కంటే దత్తపుత్రుడే వీరంగం వేశాడు. జగ్గయ్యపేట వద్ద రోడ్డుపై తన ఇంట్లో విలాసంగా పడుకుని కాలుమీద కాలు వేసుకుని పడుకున్నాడు. అసలు ఈనాడులో రాతలు చూస్తే తాలిబాన్ల నుంచి చెడ్డీ గ్యాంగ్ అంటాడు. ఈనాడు బాషలో ఉన్న బూతులన్నీ రాశాడు..ఇంకో వ్యక్తి ఆయన శైలిలో ఆయన రాశాడు. అందరి బాధా ఒక్కటే...చంద్రబాబును మీరు టచ్ చేయడం ఏంటి..? చంద్రబాబు నాయుడినే టచ్ చేయాలి..గత 40 ఏళ్లలో ఆయన కుంభకోణాలు తప్ప ఏమన్నా ఉన్నాయా...? అవినీతి తప్ప సక్రమ మార్గంలో పది అడుగులైనా వేశాడా..? రాజకీయంగా నిలబడుతున్నాడంటే కేవలం స్టేల ద్వారా, వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారానే. అలా బతుకుతూ బీరాలు..తొడగొట్టడాలు, చాలెంజ్ చేస్తున్నాడు. 40 ఏళ్ల జీవితంలో నేను మచ్చలేని వాడిని అంటాడు. నన్ను ఎవరేం పీక్కుంటారు అంటాడు. అరెస్ట్ చేస్తే ఒక డ్రామా. అరెస్ట్ చేయకపోతే నేనేం తప్పు చేయలేదు అంటాడు. గౌరవంగా హెలికాఫ్టర్ పెడితే పబ్లిసిటీ డ్రామాలేశాడు నిన్న ఆయన చేసిన డ్రామా చూస్తే పబ్లిసిటీ కావాలని తపన పడ్డాడు. పెద్దాయన, మాజీ ముఖ్యమంత్రి అని గౌరవంగా హెలికాఫ్టర్ పెట్టాం రండంటే డ్రామాలు వేశాడు. డీఐజీతో ఎదురుగా కూర్చుని ఒక కెమెరా పెట్టించుకుని దబాయిస్తున్నాడు. ఆ అధికారి గట్టిగా నిలబడ్డాడు కాబట్టి సరిపోయింది. ఆయన కొడుకు మామూలు బూతులు మాట్లాడలేదు. అక్కడ పోలీసు అధికారిని పట్టుకుని ఇష్టారీతిన మాట్లాడాడు. మంత్రిగా చేశాడు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు అని గౌరవిస్తే.. అసలు ఏమనుకుంటున్నారు.. వాళ్లేమన్నా జీతగాళ్లు, పాలేర్లు అనుకుంటున్నారా? హెలికాఫ్టర్‌లో మర్యాదగా వస్తే ఉదయం 11 గంటలకు దిగేవాడు. పబ్లిసిటీ కావాలని డ్రామా చేశాడు. ఈ రోజు వారి పబ్లిసిటీ స్టంట్ అచ్చెన్నాయుడు మాటల్లో తేలింది. మీకోసం జనం ఎందుకు రావాలి..? మీ నాయకుడు చేసిన అవినీతి వల్ల కోర్టుకు వెళ్తుంటే అల్లర్లు చేయాలా..? అల్లర్లు క్రియేట్ చేస్తారని ముందస్తు చర్యలు తీసుకుంటే ఘోరాలు జరిగినట్లు రాద్దాంతం చేశారు. వాళ్లు చేసిన హడావుడి వల్ల రాత్రి 7గంటలకు వచ్చాడు. అలా వచ్చినా వైయస్ జగన్ మీదనే విమర్శలు చేస్తున్నారు. లాయర్‌ను ఢిల్లీ నుంచి తెచ్చుకున్నారు...నువ్వు తప్పు చేయకుండా స్పెషల్ ఫ్లైట్‌లో పిలిపించుకుని రోజు కోటి, కోటిన్నర చెల్లించడం దేనికీ..? ఈనాడు వాళ్లు సీఎం వైయస్ జగన్ ఫ్లైట్‌ల గురించి రాస్తారు. బాలకృష్ణ ఒక స్పెషల్ ఫ్లైట్, లాయర్ ఒక స్పెషల్ ఫ్లైట్‌లో వస్తారు. నిజాయితీ కోరుకునే ప్రతి ఒక్కరూ నేడు హ్యాపీగా ఫీలవుతారు తప్పులు జరగకూడదు, పారదర్శకత ఉండాలి..అవినీతిని తుదముట్టించాలి అనుకునే ప్రతి ఒక్కరూ నేడు ఆనందంగా ఫీలవుతారు. తప్పు చేసినప్పుడు ముఖానికి గుడ్డ కప్పుకుని వెళ్లాల్సిన చంద్రబాబు.. రొమ్ము విరుచుకుని తిరుగుతున్న తీరు చూసిన తర్వాత ఈ రోజు సంఘటనతో హ్యాపీగా ఫీలవుతారు. దీంట్లో విజయం ఏమీలేదు. అలా మేమేం ఫీలవ్వడం లేదు. జవాబుదారీతనం ఉండాలనేదే వైయస్ జగన్ ది విశ్వసించే ప్రథమ సూత్రం. మనం ధర్మకర్తలమే...మనం ప్రజలకు జవాబుదారీ అనేలా ఉండాలి. వినయంగా కూడా ఉండాలి..ఎక్కడా తప్పులకు అవకాశం లేకుండా పారదర్శకంగా ఉండాలని నమ్మే వ్యక్తి వైయస్ జగన్. దానికి పూర్తిగా వ్యతిరేకమైన వ్యక్తి చంద్రబాబునాయుడు. దీంట్లో విజయం అని మేం అనుకోవడం లేదు. ఈ ప్రక్రియను హుందా స్వీకరించి ఉంటే మేం మాట్లాడేవాళ్లం కూడా కాదు. సీఐడీ విభాగం అరెస్ట్ చేసింది. కోర్టులో చెప్పుకుంటాడు..కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఆయన తప్పు ఉంది...ఆ తప్పు బయటకు రావాలి..భవిష్యత్తులో మరొకరు అలా చేయకూడదు అనేదే వైయస్ జగన్ ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. కన్నీళ్లు పెట్టుకుంటే కుదురుతుందా..? కేసుకు సంబంధించి మాట్లాడాల్సిన చోట..పుంగనూరులో మాట్లాడినట్లు మాడ్లాడటం, కళ్లనీళ్లు పెట్టుకుని మాట్లాడితే కుదరదు. కోర్టులో నీ మీద పెట్టిన అభియోగాలకు సమాధానం చెప్పుకోవాలి. దాంట్లో ఏదన్నా ఉంటే రిలీఫ్ కోరాలి. కక్షసాధింపు అసలు ఎక్కడుంది.? కోర్టు పరిధి, పోలీసుల పరిధి, ప్రభుత్వాల పరిధిని కూడా ఆయనే డిసైడ్ చేస్తాడు. ఆయన అన్నిటికీ అతీతుడు...ఆయనే అన్నీ నిర్ణయిస్తాడనే లెక్కలేని బరితెగింపు తనం. కేసు గురించి మాట్లాడాలి కానీ..ఇవన్నీ చెబితే ఎలా..? నీ మీద వచ్చింది అవినీతి ఆరోపణ...రుజువైతే పదేళ్ల పాటు శిక్ష పడుతుంది. బలమైన ఆధారాలు ఉన్నాయి..ఆయనేం నిజాయితీ పరుడైతే కాదు. ఇన్‌కం ట్యాక్స్ విషయంలోనూ పూర్తి ఆధారాలతో బయటకు వచ్చాయి. ఈ 40 ఏళ్లలో తన మీద తనకు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగి అడ్డగోలు అవినీతికి తెరతీశాడు. దానికి ఉదాహరణే స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం. పుంగనూరు కేసులోనూ అన్నీ సాక్షాధారాలున్నాయి పుంగనూరులో ఏం జరిగిందో అందరూ చూశారు..ఆయన రెచ్చగొట్టి పంపితే పోలీసులపై ఎలా దాడి చేశారో చూశాం. దాంట్లో ఆధారాలు కూడా వచ్చాయి...విజువల్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. నేను ప్రతిపక్ష నేతను కాబట్టి నా మీద ఏది చేసినా కక్షసాధింపు అంటే కుదరదు. ఇక వాళ్లు చేయగలిగింది బూతులు తిట్టడం, అల్లరి చేయడం తప్ప ఏం లేదు. వైఎస్సార్సీపీ శక్తికి తగ్గట్లు రియాక్ట్ అయితే పాతాళానికి తొక్కుతాం. మాకు ఆ శక్తి ఉంది..ప్రజల్లో ఆ బలం ఉంది..కింది స్థాయి వరకూ మాకు ఆ బలం ఉంది.. పక్కన దత్త పుత్రుడి లాంటి ఊతకర్రలు లేకుండా బతకలేని పరిస్థితి వాళ్లది. వాళ్ల కడుపు మంటతో వారి ఆవేశం వస్తుంది. అందుకే మేం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాం. విచారణ సంస్థ చేయాల్సింది చేస్తుంది..ఆ తర్వాత కోర్టులో తేలుతుంది. ఇది నార్మల్‌గా జరగాల్సింది...ఆయనకు ఆయన పెద్దది చేసుకుని ఇలా మాట్లాడించుకుంటున్నాడు. ఇది చిన్నది..మొన్నటి ఇన్‌కం ట్యాక్స్, ఇన్నర్ రింగ్ రోడ్డు, రాజధాని అంశాలు, అసైన్డ్ ల్యాండ్ వంటివి ఎన్నో ఉన్నాయి. ఇవి కాక 2014–19 మధ్యలో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కొట్టేసింది ఉంది..ఇవన్నీ బయటకు వస్తాయి. ఆధారాలున్న వాటినన్నిటినీ కోర్టుల్లో, మిగిలినవి ప్రజాకోర్టులోకి తీసుకెళ్తాం. ఈ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుంది..ఆయన వస్తే మళ్లీ చీకట్లోకి వెళ్తోంది అని ప్రజలకు తెలుపుతాం.