దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో సామాజిక న్యాయం

సామాజిక సాధికారతను సీఎం వైయస్‌ జగన్‌ చేతల్లో చూపుతున్నారు

రాజకీయ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట

18 ఎమ్మెల్సీ స్థానాల్లో 14 బీసీ, ఎస్సీ, ఎస్టీలకు.. అందులోనూ 11 బీసీలకు

ఇది చరిత్రాత్మక అంశంగా రాష్ట్రం గమనించింది.. దేశమంతా గమనిస్తోంది 

మరో ఐదేళ్లలో నిజమైన సాధికారత దిశగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు

గతంలో అధికారం వెలగబెట్టిన టీడీపీ ఇవన్నీ ఎందుకు చేయలేకపోయింది..?

బీసీలు మా హక్కు అని మాట్లాడే చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలి

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్‌

అమరావతి: సామాజిక సాధికారతను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతల్లో చూపుతున్నారని, దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక న్యాయం అమలవుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 2019 ఎన్నికలతో మొదలైన సామాజిక విప్లవ ఫలాలను రాష్ట్ర ప్రజలతో సహా దేశమంతా చూస్తోందని, మరో ఐదేళ్లలో సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో నిజమైన సాధికారత దిశగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలే కాదు మహిళలు కూడా ముందుకెళ్తారన్నారు. ఎమ్మెల్యే కోటాలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్సీలుగా పోటీచేస్తున్న ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. నామినేషన్లు వేసిన వారందరికీ పార్టీ తరఫున అభినందనలు తెలిపారు. 

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడారంటే..
శాసనసభ్యుల కోటాలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్‌ జగన్‌ ఎంపిక చేసిన ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు వేశారు. ఉదయమే సీఎంను కలిసి అభ్యర్థులంతా బీఫామ్స్‌ అందుకొని నామినేషన్ల ప్రక్రియ పూర్తిచేశారు. మొత్తం 18 స్థానాలకు గానూ స్థానిక సంస్థల నుంచి 9 స్థానాలకు నామినేషన్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే కోటాలో 7 స్థానాలకు నామినేషన్లు నేడు పూర్తిచేశాం. త్వరలో గవర్నర్‌ కోటా నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ కానున్నాయి. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనసా, వాచా, కర్మణ సీఎం వైయస్‌ జగన్‌ సామాజిక న్యాయం పాటిస్తున్నారు. 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 14 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వగా, అందులోనూ 11 స్థానాలు బీసీలకు కేటాయించడం చరిత్రాత్మక అంశంగా గతంలో ప్రకటించాం. సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న సామాజిక న్యాయాన్ని రాష్ట్రం గమనించింది.. దేశమంతా గమనిస్తోంది. 

ఇప్పటికే శాసనమండలిలో 4 నలుగురు మైనార్టీ ఎమ్మెల్సీలున్నారు. ఇది కూడా రికార్డే. ఈ ఎన్నికలన్నీ పూర్తయిన తరువాత మండలిలో 58 స్థానాల్లో 10 సీట్లు పట్టభద్రులు, టీచర్ల ఎన్నిక పక్కనబెడితే.. మిగిలిన 48లో తెలుగుదేశం పార్టీ 4కు పడిపోగా.. వైయస్‌ఆర్‌ సీపీ బలం 44కు చేరనుంది. వాటిలోనూ 30 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సభ్యులు ఉండబోతున్నారు. ఇది కూడా దేశమంతా గమనించాల్సిన చరిత్రాత్మక పరిణామం. సీఎం వైయస్‌ జగన్‌ తీసుకువచ్చిన విప్లవాత్మక నిర్ణయం ప్రజల మన్ననలు పొందుతోంది. వైయస్‌ జగన్‌ మాటల్లో కాదు చేతల్లో చూపుతారనేది ప్రపంచానికి తెలిసింది. 

సీఎం వైయస్‌ జగన్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేశారు. కేబినెట్‌లో 70 శాతం పదవులు, నగరపాలక సంస్థల మేయర్లు 90 శాతానికి పైగా, జెడ్పీలు 70 శాతం, ఎంపీపీ పదవులు 67 శాతం, మున్సిపల్‌ చైర్మన్లు 72 శాతం ఏదైనా సరే 50 శాతం పరిధిని కూడా మించి ఇచ్చారు. ఎవ్వరూ చెప్పలేదు, నిర్దేషించలేదు. సీఎం వైయస్‌ జగన్‌ తనకు, పార్టీకి నియమం పెట్టుకున్నారు. పార్టీ మొత్తం ఆయన మాట ప్రకారమే అడుగులేస్తోంది. అందులో భాగంగా ఇంతింత శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇస్తూ వస్తున్నారు. మండలి చైర్మన్‌గా ఎస్సీ నాయకుడు, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ మహిళ, శాసనసభ స్పీకర్‌గా బీసీ నాయకుడు ఉన్నారని సవినయంగా, సగర్వంగా చెబుతున్నాం. 

మొన్నటి వరకు అధికారం వెలగబెట్టిన తెలుగుదేశం పార్టీ ఇవన్నీ ఎందుకు చేయలేకపోయింది..? టీడీపీకి ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు..? బీసీలు మా హక్కు అని మాట్లాడే చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలి. 

నిజమైన సాధికారత రాజకీయాధికారంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు భాగస్వామ్యం ఇవ్వడం ద్వారానే జరుగుతుందని సీఎం వైయస్‌ జగన్‌ నమ్మారు.. అందుకు బదులుగా రాష్ట్ర ప్రజలంతా సీఎంకు ఆశీస్సులు ఇస్తున్నారు. 2019 ఎన్నికల్లో మొదలైన సామాజిక విప్లవం ఫలాలను ప్రజలందరూ చూస్తున్నారు. ఇవన్నీ భవిష్యత్తులో మరింతగా ముందుకెళ్తాయి. మరో ఐదేళ్లలో సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో నిజమైన సాధికారత దిశగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే కాదు మహిళలూ ముందుకెళ్తారు. పార్టీకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పూర్తిస్థాయిలో నిజమైన రాజకీయ సాధికారతను, సామాజిక న్యాయాన్ని అందజేసే కృతనిశ్చయంతో సీఎం వైయస్‌ జగన్‌ ఉన్నారు. 
 

Back to Top