ఏ విషయంపై క్లారిటీ లేని వ్యక్తి చంద్రబాబు

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తెలంగాణకు వెళ్లి తన పాత రెండు కళ్ల సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నాడు

తెలంగాణలో మాదిరి బీజేపీలో చేరిన ఏపీ నేతలను ఎందుకు పిలుపివ్వడం లేదు

గత ఎన్నికల్లో చక్రం తిప్పుతానని చతికిలబడ్డాడు..

మార్కెటింగ్‌ సంస్థల టీడీపీ బ్రాండ్‌ వాల్యూ పెంచుకోవ‌డం కోసం బాబు తాపత్రయం

డీఎల్‌ రవీంద్ర మా పార్టీలో లేరు.. ఉంటే ఎప్పుడో యాక్షన్‌ తీసుకునే వాళ్లం

పిల్లలకు ఇచ్చిన ట్యాబ్‌లపై కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి విషప్రచారం

ట్యాబ్‌ల ధరలు చెప్పేవారు.. టెండర్‌లో ఎందుకు పాల్గొనలేదు

తాడేపల్లి: గత ఎన్నికల్లో రాహుల్‌గాంధీని ప్రధానని చేస్తానని, కేంద్రంలో చక్రం తిప్పుతానని బీరాలు పలికి చతికిలబడిన చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం మార్కెటింగ్‌ సంస్థ మాదిరిగా తన పార్టీకి డిమాండ్‌ క్రియేట్‌ చేసుకునే పనిలో పడ్డాడని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నాడు.. ఎక్కడ ఉండాలనుకుంటున్నాడనే స్పష్టత ఉందా..? అని ప్రశ్నించారు. బాబు తెలంగాణకు వెళ్లి రాజకీయాలు చేసుకుంటానంటే స్వాగతిస్తామని, రెండు రాష్ట్రాల రాజకీయాల్లో చొరబడినా తమకు అభ్యంతరం లేదన్నారు. రాజకీయాలంటే ప్రజలతో ఆడుకోవడం, రాజకీయం అంటే ఆటగా అలవాటుపడిన చంద్రబాబు మళ్లీ అదే పాత రెండు నాల్కల ధోరణిని అమలు చేయాలనుకోవడం కరెక్ట్‌ కాదు.. ప్రజలకు సేవ చేయాలనుకునే నాయకుడి లక్షణం కాదన్నారు. 

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయం ఆవరణలోని మీడియా పాయింట్‌ వద్ద పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడారు.  

‘‘సీఎం వైయస్‌ జగన్‌కు స్పష్టత ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారు. విభజన తరువాత ఏపీకి సేవ చేస్తున్నారు.. ఇంకా రాష్ట్రానికి ఏం చేయాలనేది క్లారిటీ పెట్టుకున్నారు. చంద్రబాబుకు అసలు ఏ అంశంపై క్లారిటీ ఉందో చెప్పాలి. క్రితం ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఎక్స్‌పర్మెంట్‌ చేశాడు.. ఈసారి బీజేపీతో పొత్తుకోసం డిమాండ్‌ క్రియేట్‌ చేయాలని నానా అగచాట్లు పడుతున్నాడు. అందుకే ఖమ్మంలో మీటింగ్‌ పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్నప్పుడే చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంభించాడు. పగలు ఒక మాట.. రాత్రి ఒక మాట.. పార్టీల దగ్గర మాటలు మార్చే చంద్రబాబు లాంటి వ్యక్తి వాల్యూ ఉంటుందని అనుకోవడం లేదు. తెలంగాణకు వెళ్లి మా పాత తెలుగుదేశం పార్టీ నేతలంతా రండీ అని అరుస్తున్నాడు. మరి ఏపీలో అలాంటి అరుపులు ఏమయ్యాయి..? తన పార్టీ నుంచి బీజేపీలోకి పంపించి స్లీపర్‌సెల్‌ మెయింటైన్‌ చేస్తున్నవారికి మాత్రం ఎందుకు పిలుపు ఇవ్వడం లేదు. తెలంగాణ కాంగ్రెస్‌లో పెట్టిన స్లీపర్‌సెల్‌ వారిని రమ్మని బాబు కోరుతున్నాడా..? తెలంగాణలో నాకు కరెన్సీ ఉంది.. అప్పుడైనా బీజేపీ గుర్తిస్తుందేమోనని అనుకుంటున్నాడు. 

ఆయన పార్టీలో ఉన్నట్టుగా మేము భావించడం లేదు..

డీఎల్‌ రవీంద్ర వైయస్‌ఆర్‌ సీపీలో ఉన్నాడని ఇప్పుడెందుకు అనుకుంటున్నాడో అర్థం కావడం లేదు. 2019 ఎన్నికల సమయంలో వచ్చారు. ఆరోజు స్థానికంగా ఏం జరిగిందో అక్కడి ఎమ్మెల్యే వివరణ ఇస్తారు. డీఎల్‌ రవీంద్ర మాట్లాడే మాటలకు వాల్యూ క్రియేట్‌ అయ్యేందుకు వైయస్‌ఆర్‌ సీపీలో ఉన్నానని చెప్పుకుంటున్నాడు. ఆయన పార్టీలో ఉంటే ఎప్పుడో యాక్షన్‌ తీసుకునేవాళ్లం. ఆయన పార్టీలో ఉన్నట్టుగా మేము భావించడం లేదు. చంద్రబాబు సేవీయర్‌ అన్నాడంటే.. ఆయన ఎవరు మాట్లాడిస్తే మాట్లాడుతున్నాడో అర్థం అవుతుంది. సీఎం వైయస్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక రాయి ప్రభుత్వం మీద చేయాలని డీఎల్‌ రవీంద్రతో మాట్లాడించారు. 

ట్యాబ్‌లపై కూడా విష ప్రచారం చేస్తున్నారు. పూర్తి పారదర్శకంగా టెండర్‌ ప్రక్రియ జరిపాం. రివర్స్‌ టెండరింగ్‌ కూడా చేసి ఎల్‌1 కింద వచ్చిన వారితో కూడా మాట్లాడి ఇంకొంచెం ధర తక్కువ చేపించాం. దాంట్లో విలువైన బైజూస్‌ కంటెంట్‌ నింపి ఇచ్చాం. దానిపై కూడా విమర్శలు చేస్తున్నారు. రూ.12 వేలకే ట్యాబ్‌ వస్తుందని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు.. అలాంటి విమర్శలు చేసేవారే టెండర్లలో పాల్గొనవచ్చు కదా..? ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాస్తున్నారు. బాలల హక్కుల కమిషన్‌ పిలిచిందని లేని అంశాన్ని తెచ్చి ఆంధ్రజ్యోతి రాసింది. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న బైజూస్‌ కంటెంట్‌.. ఫ్రీగా వచ్చినప్పుడు ఆ ఫెసిలిటీ మన పిల్లలకు ఇస్తుంటే అభినందించాల్సింది పోయి.. నిందలు వేస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి బ్యానర్‌ స్టోరీలు రాశాయి. కనీసం ప్రజలు ప్రశ్నిస్తారనే ఇంగితం కూడా ఆ పత్రికలకు లేదు. 4.60 లక్షల మంది పిల్లలకు ట్యాబ్‌ల పంపిణీ యజ్ఞంలా మొదలైంది. డిజిటలైజేషన్‌ విధానంలో మొదటి అడుగుపడింది. దాన్ని వక్రీకరిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలు రాస్తున్నాయి. పొలిటికల్‌ అజెండాతో లేనిది రాస్తున్నారు. వారి రాతలను ప్రజలు ఎవరూ నమ్మరు.’’ 

Back to Top