175 సీట్లకు 175 గెలుచుకోవడమే మా లక్ష్యం

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

ముందస్తు ఎన్నికల ఆలోచన మా అధినేతకు, మా పార్టీకి లేదు

తాడేపల్లి: రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 175కు 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకొని వైయస్‌ఆర్‌ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వంపై వర్క్‌షాప్‌ ముగిసిన అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. వైయస్‌ఆర్‌ సీపీ శాసనసభ్యులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించి, ప్రజల ఆశీస్సులు పొందాలని, అర్హత ఉండి ఇంకా ఎవరికైనా సంక్షేమ సాయం అందనివారికి ప్రభుత్వ పథకాలు అందించేలా గడప గడపకు మన ప్రభుత్వం అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని సీఎం వైయస్‌ జగన్‌ చేపట్టారని చెప్పారు. 

ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి, వారితో మమేకం కావాలని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు సీఎం సూచించారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టడం వల్ల ఎమ్మెల్యేలకు ప్రజల్లో ఆదరణ ఉంటుంది.. ప్రభుత్వం చేస్తున్న మంచి ప్రజలకు వివరించినట్టు ఉంటుందని, ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలవుతున్న నేపథ్యంలో ప్రతీ గడపకూ వెళ్లి ఆరా తీసి మూడున్నరేళ్ల వైయస్‌ఆర్‌ సీపీ పాలనలో జరిగిన మార్పును పరిశీలించడానికి గొప్ప అవకాశంగా కూడా ఉంటుందన్నారు. అందరూ కచ్చితంగా వారి వారి నియోజకవర్గాల పరిధిలో గ్రామ, వార్డు సచివాలయాల్లోని ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజలతో మమేకం కావాలని సీఎం సూచించారన్నారు. ప్రస్తుతం వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నవారంతా మళ్లీ అత్యధిక మెజార్టీతో గెలవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కోరుకుంటున్నారన్నారు. 

పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడం కోసం చంద్రబాబు ముందస్తు ఎన్నికలు అనే మాట మాట్లాడుతున్నాడని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ముంద‌స్తు అని చెబితే టీడీపీలో ప్రస్తుతం ఉన్న నాయకులు నాలుగు డబ్బులు ఖర్చు చేసి పార్టీ కార్యక్రమాలు చేపడతారనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా అర్థమైతుందన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన ఆలోచన సీఎం వైయస్‌ జగన్‌కు, వైయస్‌ఆర్‌ సీపీకి లేదని చెప్పారు. ప్రజలిచ్చిన 5 సంవత్సరాల అవకాశం పూర్తయిన తరువాతే మళ్లీ ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. 

Back to Top