తాడేపల్లి: ఎన్టీ రామారావు ప్రారంభించిన తెలుగు దేశం పార్టీ వేరు, ఇప్పుడున్న టీడీపీ వేరని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్ ప్రజాభిమానంతో అధికారంలోకి వచ్చారన్నారు. చంద్రబాబు కుట్రలతో అధికారంలోకి వచ్చారన్నారు. టీడీపీది 40 ఏళ్ల సంబరం కాదని, 27 ఏళ్ల సంబరం అని తెలిపారు. 1995 నుంచి 2022 వరకు ఈ మధ్యలో ఏం జరిగిందో కూడా పరిశీలించాలన్నారు. ప్రస్తుత టీడీపీ అవసాన దశలో ఉందని చెప్పారు. కుట్రలతో అధికారంలోకి ఎలా రావాలన్నది టీడీపీ పాలసీ అన్నారు. టీడీపీ చరిత్రలో ఈనాడు పాత్ర ఒక కేస్‌స్టడీలా పనికొస్తుందని చెప్పారు. టీడీపీకి బాకా ఊదడమే ఎల్లోమీడియా పని అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జనం నుంచి వచ్చిన నాయకుడని చెప్పారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్టీ రామారావు రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ప్రజాభిమానంతో ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు చేసిన కుట్ర..తదనంతర పరిణామాలు, ఆ పార్టీ ప్రయాణం..ఇది ఎవరైనా పరిశోధించాలి. ఎన్టీఆర్ టీడీపీ గురించి మాట్లాడాల్సి వస్తే..రెండో వైపు కూడా చూడాలి. 19952022 మధ్య చరిత్రను చూడాలి. మీడియా వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి టీడీపీ 40 ఏళ్ల చరిత్ర అని చెప్పుకుంటున్నారు. నేను 1979లో ఈనాడులో జర్నలిజం మొదలుపెట్టాను. కాబట్టి టీడీపీ పుట్టుక, దాని ఇంపార్టెంట్ గురించి తెలుసు. చాలా తక్కువ సమయంలో ఎన్టీ రామారావు టీడీపీ స్థాపించి విజయం సాధించగలిగారు. ఆ రోజు టీడీపీ ఏర్పాటు చారిత్రక అవసరమా? ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతులో ఎలా అధికారంలోకి రావ చ్చో చేసి చూపించారు ఎన్టీ రామారావు. అదే విధంగా మ్యాలుపులేషన్, కుట్రలతో అధికారంలోకి ఎలా రావొచ్చు అన్నది చంద్రబాబు నిరూపించారు. ఆ మొత్తం కథ, స్క్రీన్‌ప్లే, కుట్రలు నడపడమే కాకుండా వ్యవస్థలను మేనేజ్ చేయడం, కుట్రలను ఫర్‌ఫెక్షన్ చేసి జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లిన చంద్రబాబుకు డాక్టరేట్ సర్టిఫికెట్ కూడా ఇవ్వవచ్చు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ , రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఒక మీడియా మేనేజ్‌మెంట్‌తో అధికారంలోకి విజయవంతంగా వచ్చారు. ఆ తరువాత ఎవరితో పొత్తులు పెట్టుకోవచ్చు, ఎవరి చంక ఎక్కి అధికారంలోకి రావచ్చు అన్నది చంద్రబాబును చూస్తే తెలుస్తుంది. ఈ రోజే కాదు..ఈ రోజుకు కూడా చంద్రబాబు అదే పాలసీని కొనసాగిస్తున్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబు పప్పులు ఊడకలేదు. ఈ రోజు ప్రజల మధ్య నుంచి వైయస్ జగన్ రావడంతో చంద్రబాబు ఆటలు సాగడం లేదు. చంద్రబాబు ఎత్తుగడల ముందు కాంగ్రెస్ దిగదుడుపే అని కచ్చితంగా చెప్పవచ్చు. చంద్రబాబు పార్టీ గురించి అంచనా అందరి దృష్టిలో ఉంది. ఈ రోజు లోతుగా పరిశీలించినా, పైపైనా తడిమినా చంద్రబాబు ప్రస్తానం, టీడీపీ చరిత్ర అందరికీ తెలుసు. ప్రతి పార్టీకి ఒక చరిత్ర ఉన్నట్లుగా టీడీపీ కూడా ఉంది. ప్రస్తుతం టీడీపీ అవసాన దశలో ఉంది. ఆ పార్టీ అంతిమ దశకు వచ్చింది. వెంటిలేటర్ మీద ఉన్నట్లుగా ఉంది. మొదట్లో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఉన్న పాత టీడీపీని గుర్తుకు తెచ్చుకుని పూనకం వచ్చినట్లుగా పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి ప్రజల నుంచి సానుభూతి పొందాలని ప్రయత్నం గత రెండు రోజులుగా జరుగుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినవన్నీ ఒకసారి పరిశీలిస్తే పెద్ద పురాణం అవుతుంది. ఈనాడు చరిత్రను పరిశీలిస్తే ఆ రోజు ఎన్టీ రామారావు ఆవేశం, తపనకు ఒక ఆకారం ఇచ్చింది ఈనాడు పత్రికే..1995లో అదే పత్రిక ఆ పార్టీని, ఎన్టీ రామారావును ఎలా పక్కన పెట్టిందో, ఆ రోజు చంద్రబాబును ఏ రకంగా ప్రోజెక్ట్ చేస్తూ వచ్చిందో ఇది కూడా ఒక చరిత్రనే. ప్రజాస్వామ్యంలో ఒక మీడియా రోల్ సాధ్యమా అన్నది కూడా గమనించవచ్చు. టీడీపీ జర్నీని ఆ రెండు పత్రికలు ఇవాళ రాసి ఉంటే బాగుండేది. 1995లో ఈనాడు ఎన్టీఆర్‌ను దించింది. ఎన్టీఆర్‌కు పాడె కట్టింది. చంద్రబాబుకు కిరీటం పెట్టింది కూడా రాసి ఉంటే బాగుండేది. ఇదంతా పొలిటికల్ మ్యానేజ్‌మెంట్ అని రాసి ఉండాల్సింది.ఆ రోజు ఈనాడు పత్రికలో ఎలాంటి కర్టూన్స్ వేసి ఎన్టీఆర్‌ను ఎలా కించపరిచిందో గమనించాలి. ఎన్టీఆర్‌ను సాగనంపుతూ కర్టూన్స్ వేశారు. అప్పట్లో భూతాలు ఉన్నాయని ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి ఫొటోలతో కర్టూన్స్ వేశారు. ఎగతాళి చేస్తూ ఎన్టీఆర్‌పై కథనాలు రాశారు. సాక్షి పేపర్, మీడియా ఈ రోజు ఉంది. ఈ మీడియాను వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబం పెట్టింది. వైయస్ జగన్, ఆ తరువాత వైయస్ భారతి గార్లు చైర్మన్లుగా పని చేశారు. వైయస్ రాజశేఖరరెడ్డి బొమ్మనే పత్రిక పై భాగంలో పెట్టారు. అయినప్పటికీ న్యూస్‌కు సంబంధించి బాలెన్స్ మెయింటెన్స్ చేయడంలో సాక్షి మీడియా విలువలు పాటిస్తోంది. కానీ వీళ్లు పేరుకు మీడియా అని చెప్పుకుని చేసే తతంగమంతా వేరేలా ఉంది. ఒక పార్టీని, వ్యక్తులను భుజాన మోస్తోంది. గత నెల రోజులుగా జరుగుతున్న కుట్రలు ఇదే సాంప్రదాయం. ఏదో ఒక చోట జరిగిన ఘటనలను హైలెట్ చేయడం, దానికి కొనసాగింపుగా ఆ పార్టీ వాళ్లు ధర్నాలు చేయడం పరిపాటిగా మారింది. మొన్న అసెంబ్లీలో కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ ప్రశ్నలకు టీడీపీ సమాధానాలు ఇవ్వాలి చంద్రబాబు అసలు అసెంబ్లీకి ఎందుకు రాలేదు.? చంద్రబాబు సభకు రానప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడుతామని టీడీపీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. మంచిది. వచ్చిన వాళ్లు ఎందుకు సభలో సమస్యలపై మాట్లాడలేదు. 13 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు అల్లరి చేస్తూ సభా సమయాన్ని వృథా చేశారు. అంతా అయిపోయిన తరువాత మాకు అవకాశం రాలేదని ఎందుకు మాట్లాడుతున్నారు.? ఈ ప్రశ్నలకు టీడీపీ సమాధానం చెప్పాలి. ఈ రోజు అసెంబ్లీలో 151 సీట్ల మెజారిటీతో గెలిచిన వైయస్‌ఆర్‌సీపీ ఉంది. 23 స్థానాల్లో గెలిచిన టీడీపీ ఉంది. ఆ పార్టీ నుంచి కొంత మంది పక్కన∙కూర్చుంటున్నారు. సభలో మాట్లాడేందుకు పూర్తిగా అవకాశం ఉన్నా టీడీపీ ఎందుకు ఉపయోగించుకోలేదు. సంబంధం లేని ఇష్యూను తెరపైకి తెచ్చారు. నాటు సారాను సభకు తీసుకువచ్చారు. అసెంబ్లీలో ప్రతి రోజు ఇదే అంశంపై గొడవ చేయడం ఏంటి? కల్తీ సారా మరణాలు ఉంటే వెంటనే బయటపడేవి. ఇది వాస్తవం కాదని ప్రభుత్వం ఎంత చెప్పినా టీడీపీ పట్టించుకోకుండా గొడవ చేసింది. వైయస్ జగన్ పాదయాత్రలో తాను కళ్లారా చూసిన తరువాత ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీల్లో 95 శాతంపైగా ఇప్పటికే అమలు చేశారు. తూచ తప్పకుండా హామీలు అమలు చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేదు. సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందించిన చరిత్ర వైయస్‌ఆర్‌కాంగ్రెస్ ప్రభుత్వానిదే. సంక్షేమ క్యాలెండర్‌ను విడుదల చేయడమే కాదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం గొప్ప విషయం. కోవిడ్ ఉన్నా కూడా గతేడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. పేదలకు ఏదైనా భరోసా అంటే వాళ్లకు అందాల్సిన ఫలాలు ప్రభుత్వం చెప్పిన గడువులోగా వెళ్లిందా? అన్నదే. వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొంత మేర సకాలంలో సంక్షేమ పథకాలు అందాయి. చంద్రబాబు రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు. గత ప్రభుత్వ బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించింది. రాష్ట్రంలో ఎన్ని కష్టాలు ఉన్నా సకాలంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.