సీఎం వైయస్‌ జగన్‌ టార్గెట్‌గా రాజకీయాలు 

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

మళ్లీ సీఎం అవుతానన్న భ్రమలో బాబు ఉన్నారు

చంద్రబాబు అజెండా ప్రకారమే రాష్ట్రంలో బీజేపీ నడుస్తోంది

బీజేపీ దిగజారుడు రాజకీయం చేస్తోంది

తన పార్టీ ఎంపీలు బీజేపీలో చేరితే ఎందుకు టీడీపీ ప్రశ్నించదు

ఆధారాలు లేని ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని టార్గెట్‌ చేస్తూ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.  మళ్లీ సీఎం అవుతానన్న భ్రమలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉన్నారని, అందుకే ఇప్పటి నుంచే పొత్తు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ దిగజారుడు రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. ఆ పార్టీకి సొంత అజెండా లేదని, చంద్రబాబు చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.  బుధవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని చూస్తుంటే జాలితో పాటు బాధ కలుగుతోందన్నారు. టీడీపీ అనుబంధ విభాగం మాదిరి నిన్న విజయవాడలో బీజేపీ సభ జరిగందన్నారు. చంద్రబాబు అజెండా ప్రకారమే రాష్ట్రంలో బీజేపీ నడుస్తోందన్నారు. ఎక్కడైనా జాతీయ పార్టీతో కలిసి ప్రాంతీయ పార్టీలు పనిచేస్తాయన్నారు.

నిన్న బీజేపీ సభ విజయవాడలో జరిగింది. దానికి ప్రజాగ్రహ సభ అని పేరు పెట్టుకున్నారు. ఇక్కడ ప్రజల్లో లేరు. వాళ్ల భావోద్వేకాలు ఎలా ఉన్నాయో కూడా వీరికి తెలియదు. అంతకుముందు ప్రెస్‌మీట్లలో మాట్లాడేవారు. అలాంటి వారు ఓ బహిరంగ సభ పెట్టుకోవాలనుకోవడం, వాళ్ల శక్తి ఏంటో తెలుసుకోవాలనుకున్నారు. చంద్రబాబు అజెండాలో భాగంగానే నిన్న సభ పెట్టారు. చంద్రబాబుకు మరో గొంతు కావాలి కాబట్టి ఈ సభ పెట్టారు. చంద్రబాబు సివిల్‌ సొసైటీ పేరుతో 10 రకాల వ్యక్తులను తయారు చేసుకొని టీవీ డిబెట్స్‌లో కూర్చొబెడుతుంటారు. న్యూట్రల్‌ అభిప్రాయం, సెకెండ్‌ ఒపినియన్‌ పేరుతో డిబెట్లకు వాళ్లను వాడుకుంటున్నారు. జాతీయ స్థాయిలో వాజ్‌పేయి, అద్వానీ, ఇప్పుడు నరేంద్ర మోదీని ఇచ్చిన జాతీయ పార్టీ అయిన బీజేపీ ..ఈ రాష్ట్రంలోకి వచ్చేసరికి ఒక చంద్రబాబు అనే దుష్టశక్తి, మాయక ఫకీర్‌ లాంటి వ్యక్తి అజెండాలో బీజేపీ సభ పెట్టడం ఒకరకంగా జాలి కలుగుతుంది. ఆ వేదికపై నిలబడి బీజేపీ నేతలు భీకరంగా ప్రగల్భాలు పలకడం ఇంకోరకంగా హాస్యాస్పదంగా ఉంది.

అందుకోసమే టీడీపీ అనుబంధ విభాగంగా ఈ సభ ఉందని అనాల్సి వచ్చింది. ఒక జాతీయ పార్టీతో కలిసి ప్రాంతీయ పార్టీలు పని చేస్తాయి. లేదా ఒక కూటమిలో జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీలు కలిసి పని చేస్తాయి. దేశ చరిత్రలో తొలిసారిగా ఓ జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీకి అనుబంధంగా పనిచేయడం. అడ్రస్‌ లేని కాంగ్రెస్‌ కూడా వీళ్లకు తోడుగా ఉంది. లోకల్‌ ఎన్నికల్లో చూసినా కూడా 2 శాతం ఓట్లు వచ్చిన పార్టీలు కూడా టీడీపీకి తోడుగా నిలిచాయి. వీరు ఏం మాట్లాడుతున్నారన్నది చూడాలి. ఎవరి నోట్లో నుంచి ఈ మాటలు వస్తున్నాయో గమనించాలి. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు వచ్చి మాట్లాడి వెళ్లినట్లుగా బీజేపీ నేతల తీరు ఉంది. నిన్న సభలో ముందు సునీల్‌ దేవరా ఉంటే వెనుక సుజనా చౌదరి ఉంటారు. మాటలు సోము వీ్రరాజువి వస్తుంటాయి. స్క్రిప్ట్‌ మాత్రం టీడీపీ ఆఫీస్‌ నుంచి వస్తుంది. నిన్న చేసిన బీజేపీ నేతల వ్యాఖ్యలకు ఆ పార్టీ నేతలే సమాధానం ఇవ్వాలి. టీడీపీ అజెండాను బీజేపీ మోస్తోంది. చంద్రబాబు చీకటి సామ్రాజ్యానికి సుజనా చౌదరి, సీఎం రమేష్‌ దళపతి లాంటి వ్యక్తులు. వీళ్లు చంద్రబాబు మనుషుల కింద బీజేపీలో ఉంటూ ఆ పార్టీని నడుపుతున్నారు. బీజేపీ నేతలు ఎంతో తెలివైన వారు. అయినా ఎందుకు వీరిని ప్రోత్సహిస్తున్నారో అర్థం కావడం లేదు. చంద్రబాబుతో దారుణంగా దెబ్బలు తిన్న బీజేపీ నేతలకు అనుభవం అయ్యింది కాబట్టే సుజనా చౌదరి, సీఎం రమేష్‌లను ఆ పార్టీలో చేర్చుకున్నారు.

చంద్రబాబు వీరితో ముందు మీరు వెళ్లండి..వెనక మనవాళ్లను ఇక్కడ ఆపేస్తాను. లేదంటే వాళ్లు కూడా దూకుతారని, అందర్ని కట్టకట్టుకువస్తానని ఓపికతో ఉండమని చెప్పేందుకు వీళ్లను పంపించారు. ఎప్పుడైనా బీజేపీతో ఒక చెయ్యి వేసి, మరో చేతిక్రరగా జనసేన, సీపీఐలను ఇన్‌డైరెక్ట్‌గా తీసుకువస్తానని చెప్పి ఉండవచ్చు. ఆ రకంగా నెక్స్‌›్ట ఎన్నికల్లో ఓ కూటమిగా మారి వచ్చే ఎన్నికల్లో తానే సీఎం అవుతాననే భ్రమతో చంద్రబాబు ఏదోలాగునా టీడీపీని లాగుతున్నారు. అందుకే సుజనా, సీఎం రమేష్‌లను బీజేపీలో కూర్చోబెట్టారు. మునిగే పడవలో మనమేందుకని వీళ్లు బీజేపీలో ఉన్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇదే జరుగుతుంది కూడా.

బీజేపీ నాయకులకు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో తెలియదా?. బీజేపీ నేతలకు ఇక్కడి పరిస్థితులు పూర్తిగా అర్థమయ్యాయి. అందుకే ఇక్కడి బీజేపీ నేతలు రూ.50లకే ఛీప్‌ లిక్కర్‌ ఇస్తామని ఒకరు. మూడేళ్లలో రాజధాని ఇక్కడే కట్టేస్తామని మరొక్కరు ప్రగల్భాలు పలికారు. వీళ్లే అమరావతిని స్కామ్‌ల రాజధాని అన్నారు. విచిత్రం ఏంటంటే మొన్న తిరుపతి సభలో కర్నూలులో హైకోర్టు ఓకే అన్నారు. అమరావతిలో రాజధాని ఉండాలని బీజేపీ నేతలే అన్నారు. మరి వైజాగ్‌ పరిస్థితి ఏంటి. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు ఉమ్మడి రాజధాని ఐదేళ్లు వద్దు..పదేళ్లు కావాలని పట్టుబట్టారు. తిరుపతి సభలో మోదీ, చంద్రబాబు, పవన్‌ కూడా ముచ్చటపడి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత హోదా వద్దు..ప్యాకేజీ ముద్దు అన్నారు. మధ్యలో పవన్‌ కళ్యాణ్‌ పోరాటం చేయాల్సింది మీరే అంటారు.

మొన్న బద్వేల్‌ ఉప ఎన్నికలో కూడా కలిసి పని చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేసేది బీజేపీ నేతలే. వాళ్లే వద్దంటారు. ఇవ్వాల్సింది ఎవరూ? నచ్చజెప్పాల్సింది ఎవరు?. మీరు బీజేపీ నాయకులా, లేదా మీరందరూ కూడా టీడీపీ తరఫున పని చేస్తున్నారా? రా«జధాని చంద్రబాబు కడుతుంటే ఎవరైనా అడ్డువచ్చారా? ఏం జరుగుతుందో..ఇంతటి ప్రహాసన, హాస్యాస్పదమైన అంశం, దిగజారుడు అంశం రాజకీయాలను అవమానించినట్లు అవుతుంది. ఇంత దిగజారుడు వ్యభిచారం లాంటి వ్యవహారం ఎక్కడ ఉండదు. ఎవరికి వాళ్లు నేరుగా సొంత అజెండా పెట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ లోపం ఉందని ఎందుకు అధారాలతో ఎత్తి చూపలేకపోతున్నారు. రాజ్యాంగాన్ని అవమానించేలా ఇద్దరు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరితే..టీడీపీ పొరపాటున కూడా వారిపై అనర్హత వేటు వేయాలని అడగదు. సంప్రదాయంగా నైనా చంద్రబాబు ఎందుకు అనర్హత వేటు వేయాలని అడగడం లేదు. రాజ్యసభ చైర్మన్‌ గతంలో ఒక రోజులోనే ఎంపీపై అనర్హత వేటు వేశారు. టీడీపీ ఎంపీలపై ఎందుకు వేటు వేయడం లేదు.  అందరికీ ఇదే అనుమానం. 

ఎరుపు నుంచి కషాయం పార్టీ వరకు అందరిది ఒకటే తాళం. టీడీపీ ఇజీకోల్ట్‌ బీజేపీ, టీడీపీ ఇజీకోల్ట్‌ కాంగ్రెస్, ఇజీకోల్ట్‌ జనసేన, ఇజీకోల్ట్‌ సీపీఐగా ఉన్నాయి. న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర స్టేజీపై అందరూ ఒక్కటే స్టాప్‌గా స్లోగన్లు చేశారు. సునీల్‌ దేవర ట్వీట్లన్నీ అబద్ధాలే.  రాష్ట్రమంతా మత మార్పిడిలు అని సాయంత్రం అంటే..రెండో రోజు జనసేన అందుకుంటుంది. ఆ తరువాత సీపీఐ నాయకులు అందుకుంటారు. గతంలో చలసాని శ్రీనివాస్, గరుడ శివాజీ ఉండేవారు. వాళ్లు కనుమరుగయ్యారు. ఇప్పుడు ఈ పార్టీలు అందుకుంటున్నాయి. మూడు రోజుల పాటు ఏబీఎన్, టీవీ5 వంటి చానల్స్‌ బ్యానర్లతో వార్తలు వేస్తాయి. మొన్న ఓటీఎస్‌పై వీళ్ల దుష్ప్రచారాన్ని చూస్తే నాకు ఒక్కటే అర్థమైంది. వీళ్లు ఏమైనా చేస్తారని అర్థమైంది. ఓటీఎస్‌ అన్నది స్వచ్ఛందం. దాన్ని కూడా దోపిడీగా చూపిస్తున్నారు.

పది తలల రావణాసురుడిగా చంద్రబాబు ఉంటే..వీళ్లంతా కూడా చంద్రబాబు తలలాగా మారారు. ఇంగ్లీష్‌ మీడియం, రాజధాని అంశం, ఉద్యోగ సంఘాలతో ఢీల్‌ చేసే అంశాలు ఇలా ప్రతిదీ దుష్ప్రచారమే. అప్పులు రూ.135 లక్షల కోట్లు అప్పు చేసిన కేంద్రాన్ని వదిలి.ఒక్కొక్కరికి ఒక లక్ష అప్పు వస్తుంది. ఒళ్లంతా చిళ్లులు ఉన్న వీరే ఇక్కడ వచ్చి మరేదో వెతకాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా మాట్లాడే సమయంలో సిగ్గు ఎగ్గు ఉండాలి కదా?. ఒకరేమో నిన్నటి వరకు అధికారంలో ఉండి రూ.90 వేల కోట్లను రూ.3.50 లక్షల కోట్లకు అప్పులు చేశాడు. మరొకరేమో రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చి అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. పైగా ఊ ..అంటే ఇవన్నీ మా డబ్బులే..దోచుకుని తింటున్నారని అంటున్నారు.  ఆ పథకం పేరు పెడుతునే ఉన్నాం. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా కూడా ఆ పథకం పేర్లు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. రాష్ట్రాలు కట్టే ట్యాక్స్‌లు కేంద్రానికి వెళ్తున్నాయి. ఇక్కడి నుంచి వచ్చే వాటితోనే కేంద్రం బతుకుతుంది. దాంట్లో నుంచే కేంద్రం మళ్లీ రాష్ట్రాలకు ఇస్తుంది. ఈ రోజు కొత్తగా వచ్చి వీళ్లు ప్రవేశపెడుతున్నట్లు, వీళ్ల వళ్లే రాష్ట్రం బతుకుతున్నట్లు మాట్లాడుతున్నారు.మేం కేంద్రాన్ని గుర్తించడం లేదా?.

గతంలో చంద్రబాబు చేయలేదేమో? సీఎం వైయస్‌ జగన్‌ మాత్రం ఇళ్లు కట్టినా కూడా పైన నరేంద్ర మోదీ పేరు పెడుతున్నారు. ఈ కాలంలో 40, 50 ఏళ్లకే మోకాళ్ల నొప్పులు వస్తాయి. అలాంటిది జీ–3  ఇళ్లు కట్టించి పేదలను ఎలా మోసం చేయాలనుకున్నారో చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎట్టా ఎక్కి దిగుతారు. పైగా 300 ఎస్‌ఎఫ్‌టీకి రూ.3 లక్షల  అప్పు వేసి 20 ఏళ్లు కట్టుకోమంటే ఎలా సాధ్యమవుతుంది. ఆంధ్ర జ్యోతిలో రాస్తారు..ఆ రూ.3 లక్షలు మాఫీ చేసిన వైయస్‌ జగన్‌..వీళ్లతో రూ.10 వేలు ఎందుకు వసూలు చేస్తున్నారని కథనాలు రాస్తారు.  వీళ్ల రాతలకు అర్థం ఉందా?. చంద్రబాబు ఏది పెట్టలేదు. ఇవాళ ఆయన మాట్లాడుతున్నారు. తమిళనాడులో స్టాలీన్‌ ఉద్యోగులకు 14 శాతం డీఏ ప్రకటించారని రాస్తారు. ఇక్కడి ప్రభుత్వమేమో డీఏలతో సరిపెట్టుకుంటున్న వైయస్‌ జగన్‌ అని రాస్తారు. ఈ ఛండాలమైన డ్రామా నడుస్తోంది. ప్రజలు ఈ డ్రామాలను గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎరుపు ఎరుపు కలిసి కషాయం అవుతోంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాలను ప్రశ్నించాలి. పింఛన్లు ఇవాళ 61 లక్షలు ఇస్తున్నాం. అనర్హులకు తీసేస్తూ అర్హులకు పింఛన్లు ఇస్తున్నాం కాబట్టే ఇవాళ 61 లక్షలకు చేరాయి. బీజేపీ టీడీపీకి తోకపార్టీలా మారిందని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
 

Back to Top