ఢిల్లీ టూర్‌ పేరుతో చంద్రబాబు డ్రామా నడిపారు

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీడీపీ కుట్రలు

అబద్ధాలు, వంచన, డ్రామా బాబుకు తెలిసిన ఏకైక విద్య

పచ్చ మీడియా ద్వారా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు

డ్రగ్స్‌ పేరుతో రాష్ట్రపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు

తనకు ఓటు వేయని ప్రజలపై చంద్రబాబు పగ తీర్చుకుంటున్నారు

అమిత్‌షా ఫోన్‌ చేసినట్లు చంద్రబాబు కలరింగ్‌ ఇచ్చారు

ఎయిడెడ్‌ స్కూళ్లపై తప్పుడు ప్రచారం జరుగుతోంది

ఎయిడెడ్‌ స్కూల్‌ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ నిర్ణయంl

నిర్ణయం తీసుకునే అవకాశం ఆయా విద్యా సంస్థలకే ఇచ్చాం

బద్వేలులో వైయస్‌ఆర్‌సీపీ గెలుపు ఖాయం

తాడేపల్లి: ఢిల్లీ టూరు పేరుతో చంద్రబాబు డ్రామా నడిపారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. డ్రగ్స్‌ పేరుతో రాష్ట్రంపై తప్పుడు ప్రచారం చేయిస్తూ రాష్ట్రానికి తీవ్రనష్టం కలిగించేలా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో బాబును ఎవరూ పట్టించుకోలేదని, మరుసటి రోజు అమిత్‌షా ఫోన్‌ చేసినట్లు చంద్రబాబు కలరింగ్‌ ఇచ్చారన్నారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు. తనకు ఓటు వేయని ప్రజలపై చంద్రబాబు పగ తీర్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పరిపాలన నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రతిపక్షం కుట్రలు చేస్తోంది. పాలనలో ఎక్కడైన తప్పులు ఉంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎత్తి చూపుతూ.. తమ బలం పెంచుకోవాల్సిన వారు ..ఆ ప్రయత్నాలను విస్మరించింది. చంద్రబాబుకు తెలిసిన విద్య..అబద్ధాలు, వంచన, అసత్యాలు, లేనివి ఉన్నట్లు భ్రమలు కల్పించడం, ప్రజలు అమాయకులు అన్నట్లుగా ఏ రోజుకు ఆ రోజు మరచిపోతారని, రాత్రికి రాత్రే తన విధాలను అలవోకగా మార్చుకోగలిగిన విద్యలు చంద్రబాబుకు బాగా తెలుసు. ఇవన్నీ కూడా చంద్రబాబు విద్యలు, తాను బోర్లపడినా తాను ఫిట్‌గా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేయడం మనకు తెలుసు. ఒకవేళ ఆయన ప్రయత్నం చేయకపోయినా..ఆయన చేసినట్లు ఒక భ్రమ సృష్టించగలిగిన తన సొంత మీడియా..ఎల్లోమీడియాగా పిలుపుచుకునే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు ఉన్నాయి. వీటికి ప్రజల గురించి అవసరం లేదు. గత వారంలో ఏం జరిగిందో స్పష్టమైన ఉదాహరణగా మనకు కనిపిస్తుంది. 

వారం రోజుల క్రితం చంద్రబాబు స్క్రిప్ట్‌ తయారు చేయించి రాష్ట్రం, దేశం మీద వదిలిన ఒక బూతు పంచాంగం ..ఆయన ఆశించిన ఫలితాలు ఇస్తుందన్న భ్రమతో ఏకంగా ఢిల్లీకి వెళ్లారు. జాతీయ స్థాయిలో మరోసారి తన పలుకుబడి చూపించి వైయస్‌ జగన్‌పై, ప్రభుత్వంపై బురద జల్లేందుకు మొదలుపెట్టిన డ్రామా. ఆయన నియమించుకున్న పట్టాభి ద్వారా ఏం జరిగిందో అందరం చూశాం. చంద్రబాబు ఎంత సమర్ధులో..తిమ్మిని బొమ్మిని  చేయగలిగే వ్యక్తి చంద్రబాబు. శూన్యంలో కూడా సమస్తం సృష్టించగలిగే వ్యక్తి. ఆ రోజు సీఎం వైయస్‌ జగన్‌పై టీడీపీ ప్రతినిధి బూతు మాటలు తిడితే..దాని కారణంగా వచ్చిన రియాక్షన్‌ను ఒక పెద్ద వింతగా ..బూతద్ధంలో చూపించే ప్రయత్నం చేశారు. బంద్‌కు పిలుపునిచ్చారు. తాను 36 గంటలు దీక్ష గాని దీక్షలో కూర్చున్నారు. అన్ని గంటలు నిరాహారదీక్ష చేసిన డయాబిటిక్‌ పేషేంట్‌ బూతులతో గంటా పథంగా మాట్లాడారు. ఆతరువాత ఢిల్లీ పయాణం అయ్యారు. ఎల్లోమీడియా చొక్కాలు చించుకొని చూపించారు. రాష్ట్రపతి పాలన పెట్టండి అని డిమాండు చేసినట్లు బ్యానర్‌ హెడ్డింగ్‌లు పెట్టారు. హెరాయిన్, గంజాయి, తదితర ఆరోపణలు, ఆయన క్రియేట్‌ చేసిన సినిమాతో ముక్తాయించారు. రాష్ట్రపతి ఏమన్నారో ఎవరికి తెలియదు. ఎల్లోమీడియా చెప్పాల్సింది చెప్పింది. ఈ రోజు ఉదయం చూస్తే ఏముంటుందో అని ఆసక్తిగా చూశాం. తీరా అమిత్‌షా చంద్రబాబుకు ఫోన్‌ చేసినట్లు ప్రచారం చేశారు. పొద్దున పేపర్లో చంద్రబాబు మొదటి పేజీలో లేరు. రాధాకృష్ణకు కోపం వచ్చినట్లుంది..ఆంధ్రజ్యోతి లోపలి పేజీలో సింగిల్‌పేజీ వేశారు. ఈనాడు చిన్నప్పటి నుంచి చేసిన కార్యక్రమాలన్నీ ఒక్కసారి నెమరువేసుకున్నారు. అమిత్‌షాకు ఏమైంది..ఆయనకు జబ్బు చేసి పిలువ లేదా?..ఇలాంటి వాటిపై ప్రస్తావనే లేదు. అదే వైయస్‌ జగన్‌ వెళ్తే కేంద్రం పెద్దల కాళ్లు పట్టుకుంటారని, లేదంటే అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని బ్యానర్‌ వార్తలు రాసే ఎల్లోమీడియా..చంద్రబాబు గురించి మాత్రం ఏమీ రాయలేదు. 

చక్రం తిప్పే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఏం చక్రం తిప్పారో తెలియదు. దిపావళి వస్తుంది కదా..భూచక్రం తిప్పి ఉంటాడు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలుగజేస్తోంది. రాష్ట్ర ప్రజలపై ఆయన ఏమాత్రం అభిమానం లేదు..40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే వ్యక్తి..14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడిన మాటలకు కొంత విలువ ఉంటుంది. అలాంటి వ్యక్తి ఏపీ అన్నది డ్రగ్స్‌ రాజ«ధానిగా ఉందని పోరాటం చేస్తే ఆ ఒక్క దానికే అతనిపై ఎంత కఠినమైన సెక్షన్‌లో కేసు నమోదు చేసినా తక్కువే. రాష్ట్రాన్ని ఏం చేయాలనుకున్నారు. బూతులు నేర్పాలనుకుంటున్నారా?. యువతకు ఏం చెప్పాలనుకుంటున్నారు.

రాష్ట్రం పరువు గంగలో కలపాలనుకుంటున్నావా? బాధ్యతారాహిత్యంగా ప్రతిపక్ష నేత వ్యవహరిస్తున్నారు. ఈ రాష్ట్రం గంజాయి సాగు నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటి నుంచో ఉందని అందరికీ తెలుసు. దాన్ని తుద ముట్టించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానిపై విమర్శించు..తప్పు లేదు. కానీ మీకు అధికారం ఊడిపోయింది కదా? ప్రజలపై చంద్రబాబు అక్కస్సు వెళ్లగక్కడం బాధాకరం. ఈ ఉగ్రవాదాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. కేవలం నాలుగు మీడియా సంస్థలను అడ్డం పెట్టుకుని మాట్లాడిందే మాట్లాడుతూ..వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడం దీనికి మించిన ఉగ్రవాదం ఉండదు. బయటి వాళ్లకు ఏమీ తెలియదు. ఢిల్లీలో అదే మాటలు మాట్లాడారు. లక్కీగా నేషనల్‌ మీడియా ఆయన ప్రెస్‌మీట్‌కు రాలేదు. బూతు మాటలకు అపాలజీ చెప్పలేదు. పొరపాటు జరిగిందని ఆయన నోట రాలేదు. æఢిల్లీలో డ్రామాలు చేసిన చంద్రబాబు హైదరాబాద్‌కు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ఈ రోజు పొద్దున అమిత్‌షా చంద్రబాబుకు ఫోన్‌ చేశారట. ఎవరు చేశారో తనకు తెలియదు. చంద్రబాబు చెప్పిందంతా విని అన్ని విషయాలు ఆలోచిస్తామని అమిత్‌షా అన్నట్లుగా టీవీల్లో వచ్చింది. ఏ అమిత్‌షా అన్నారో తెలియదు. ఆయన అమిత్‌షాతో మాట్లాడగలరు. నరేంద్రమోదీతో మాట్లాడగలరు. ఆయన అనుకున్నది ఆయన క్రియేట్‌ చేసుకునేది. ఆయన అనకపోయినా స్క్రిప్ట్‌ తయారు చేసుకునే మీడియా సంస్థలు చంద్రబాబుకు ఉన్నాయి. రాష్ట్రపతి పాలన కూడా మరో ఆరు నెలల్లో పెడతారని కూడా వీరు చెప్పవచ్చు. డ్రామా క్రియేట్‌ చేస్తే ఎండ్‌ వరకు లాగే శక్తి చంద్రబాబుకు ఉంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాకలాపాలకు ఇబ్బంది కలుగజేయడం, సీఎం వైయస్‌ జగన్‌పై బురద జల్లే చంద్రబాబు..చివరకు రాష్ట్ర ప్రజలను కూడా ఇబ్బందులకు గురి చేయగలడు. దానికి తాజా ఉదాహరణగా ఈ వారం రోజుల డ్రామా నిలుస్తుంది. 

బూతులు తిట్టించిన వ్యక్తి ఇప్పుడు హైదరాబాద్‌లో కూర్చున్నారు. తిట్టిన వ్యక్తి మాల్దీవ్స్‌కు వెళ్లాడు. చంద్రబాబు, ఆయన కుమారుడు హైదరాబాద్‌కు ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదు. నిజంగా రాష్ట్రానికి ఏదైనా చేయాలనుకుంటే ఏపీకి రావాలని కానీ, ఏదో నాలుగు రోజులు డ్రామాలు ఆడి..ఆ తరువాత హైదరాబాద్‌కు వెళ్లడం తప్పుకదా? మీరు ఏం చేస్తారో ఇక్కడికి వచ్చి చేయండి. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, సంస్కరణలు, మేలు రకం సంక్షేమ పాలన గురించి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నానికి మీరు చేసే డ్రామాలతో కొంత జాప్యం జరుగుతోంది. మిమ్మల్ని ఢిల్లీలో ఎవరూ పట్టించుకోవడం లేదని మరోసారి స్పష్టమైంది. మీరు దివాళ తీశారని జాతీయ స్థాయిలో గమనించారని తేలిపోయింది. 

2017లో అప్పటి మంత్రులు గంటా శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు గంజాయి కేంద్రంగా విశాఖ నుంచి వెళ్తుందని వారే మాట్లాడారు. అప్పట్లో మీడియాలో వచ్చిన వార్తలు అందరికీ తెలిసిందే. ఈ ఒక్కదానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. లేదా ఆయనను సపోర్టు చేసే పవన్‌ కళ్యాణ్‌ చెప్పాలి. మీ నేతలు గంజాయిపై చేసిన వ్యాఖ్యలు నిజం కాదా?. ఈ రోజు గంజాయిని ఎక్కడిక్కడే ధ్వంసం చేస్తున్నాం. ప్రత్యేక టాస్క్‌పోర్స్‌ ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నాం. 
కేసీఆర్‌ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇవేవి మాట్లాడకుండా ఏపీ డ్రగ్స్‌ రాజధాని అని ఆరోపణలు చేయడం సరికాదు. ఇలాంటి వారికి పవన్‌ కల్యాణ్‌ మద్దతుగా మాట్లాడటం కూడా సరైంది కాదు.

ఎయిడెడ్‌ స్కూళ్లకు సంబంధించి జరుగుతున్న ఆందోళన వెనుక రాజకీయ కోణం ఉంది. ప్రతిపక్ష నేతలు ఎయిడెడ్‌ వాళ్లను రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నారు. ఏ ప్రభుత్వం కూడా ఎయిడెడ్‌ పోస్టులు భర్తీ చేయడం లేదు. ఎయిడెడ్‌ స్కూళ్లు ప్రైవేట్‌గా మారుతున్నాయి. ఎయిడెడ్‌ స్కూళ్లు సక్సెస్‌ ఫుల్‌గా నడవాలంటే అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులను నియమించుకోవాలి. అప్పట్లో మిషనరీలు, చారిటబుల్‌ ట్రస్ట్‌లు ఎయిడెడ్‌ స్కూళ్లను నిర్వర్తించాయి. విద్యార్థుల సంఖ్య తగ్గడంతో కొన్ని చోట్ల మూతపడుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో మీ స్కూళ్లలో పోస్టులు భర్తీ చేసుకోవాలని, స్టాండెడ్స్‌ పాటించాలని ప్రభుత్వం చెబుతోంది. లేదా ప్రభుత్వంలోవిలీనం చేయమని చెబుతోంది. ఎయిడెడ్‌గా కొనసాగుతామని 300 స్కూళ్ల యాజమాన్యాలు ప్రభుత్వానికి అంగీకార పత్రాలు అందించాయి. ఎయిడెడ్‌ స్కూళ్లపై ప్రభుత్వం బలవంతం చేయడం లేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విద్యారంగంలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టింది గతంలో ఏ ప్రభుత్వం లేదు. తొలి దశలోనే నాడు–నేడుపై రూ.16 వేల కోట్లు ఖర్చు చేసింది. విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేయాలని వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అనుకోదు. అపోహాలు కల్పించే చంద్రబాబుకు మాత్రమే ఆలాంటి ఆలోచనలు వస్తాయి. ఎయిడెడ్‌ స్కూళ్లకే ఆప్షన్లు ఇచ్చాం. వాళ్ల ఇష్టం. 20 ఏళ్ల నుంచి కొత్త పోస్టులు లేవన్నది వాస్తవం. 

బీజేపీ వాళ్లను బద్వేల్లో బెదిరించాల్సిన అవసరం ఎవరికి లేదు. బద్వేల్‌లో టీడీపీ ఉన్నా మాకు పోటీనే కాదు. ప్రజలు ఏకపక్షంగా, పూర్తిగా వైయస్‌ జగన్‌ పాలనను సమర్ధిస్తున్నారు. ఉప ఎన్నిక ప్రజాస్వామ్యపద్ధతి ప్రకారం మేం ప్రచారం చేశాం. తిరుపతి ఉప ఎన్నికలో కూడా మేం ప్రచారం చేశాం. ఫలితాలు చూశారు. అబద్ధాల ప్రచారాన్ని ఎదుర్కోవడం మాకు చేతకాదు. ప్రజల్లోకి వెళ్లి వారి మద్దతు కూడగట్టుకోవడమే మాకు తెలుసు. ఇలాంటి అబద్ధాలతో మేం పోటీ పడలేం. ఉప ఎన్నికలు ఎన్నిసార్లు వచ్చినా వైయస్‌ఆర్‌సీపీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ముఖ్యమంత్రి కూడా వినమ్రంగా ఓటర్లను అభ్యర్థిస్తూ లేటర్‌ కూడా రాశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా..మా నాయకుడు పాలనలో బిజీగా ఉన్నారని, మేమే మా పార్టీని గెలిపించుకుంటామని మా శ్రేణులు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఏం నిర్ణయించాలో అదే నిర్ణయిస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
 

Back to Top