వైయస్‌ఆర్ జిల్లా: మున్సిపల్ ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఓటమిని జీర్ణించుకోలేక చంద్రబాబు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మున్సిపాలిటీల పరిధిలోని అంశాలతో చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలు ఛీత్కరించినా ప్రతిపక్ష పార్టీ నేతల్లో మార్పు కనిపించడం లేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కడప నగరంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్‌కు విజయాన్ని కానుకగా అందిస్తాం పార్టీ గుర్తు లేకపోయినా పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం పైగా వైయస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు గెలిచారు. పార్టీ గుర్తుపై ఇప్పుడు జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో, త్వరలో జరిగే పరిషత్ ఎన్నికల్లో ఇంతకు మించిన విజయాన్ని సంపాదించుకుంటాం. ప్రతి పేద ఇంట్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి విజయాన్ని కానుకగా సమర్పించాలని పార్టీ నాయకుల నుంచి కిందిస్థాయి శ్రేణుల వరకు సమన్వయంగా పని చేయాలని రివ్వూ్య చేసుకున్నాం. పంచాయతీ ఎన్నికలపై సమీక్షించాం. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ మేనిఫెస్టోపై ఫిర్యాదు మున్సిపాలిటీల పరిధిలోని అంశాలతో టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడం సరైంది కాదని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ కుప్పకూలిపోయింది. కుప్పం కోట కూడా బద్దలు కావడంతో చంద్రబాబు మతిస్థిమితం తప్పిన వ్యక్తిలాగా మాట్లాడుతున్నారు. గత కొద్దిరోజులుగా చంద్రబాబు మాటలను, అసంబద్ధ, సంధి ప్రేలాపనలు అందరూ గమనిస్తున్నారు. తన పరిధిలో లేని పంచాయతీ ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ రోజు మళ్లీ అదే ధోరణీతో మున్సిపల్ ఎన్నిలకు సంబంధించి మేనిఫెస్టోను చంద్రబాబు విడుదల చేశారు. దీనిపై మేం ఫిర్యాదు చేయబోతున్నాం. అప్పుడు అధికారంలోకి ఉండి ఏం చేశారు.. 2014 ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు ఒక మేనిఫెస్టో విడుదల చేశారని, అందులోని హామీలను ఎందుకు అమలు చేయలేదని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏమీ చేయలేదు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఆ తరువాత కూడా టీడీపీకి సత్తా లేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాయి. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ బరితెగింపు చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. ప్రజలు తిరస్కరించి చెత్తబుట్టలో వేసిన తరువాత కూడా టీడీపీ నేతలు ప్రజలను అమాయకులను చేస్తున్నారు. పేదల కుటుంబాల్లో వెలుగులు నింపిన వైయస్ జగన్.. వైయస్ జగన్ ఏ పథకాలు అయితే తీసుకువచ్చారో..ఒక కుటుంబ పెద్దగా ఏం చేయాలో అవన్నీ కూడా చేశారు. పేద కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఈ పథకాలు ప్రజలకు మరింత దగ్గరకు చేశాయి. అందుకే వైయస్‌ఆర్‌సీపీకి సహజమైన విజయం దక్కింది. టీడీపీది అసహజమైన దురాశగా కనిపిస్తోంది. మూడేళ్ల వరకు ఏ ఎన్నికలు లేవు. చంద్రబాబుకు వయసు పైబడింది. ఇక పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. రాష్ట్రంలో ప్రతిపక్షం అన్నది ఉండాలి. ఆ హోదా నిలబెట్టుకోవాలంటే జనంలో పని చేయాలి. వయసులో చిన్న వ్యక్తి అయిన వైయస్ జగన్‌ను చూసి నేర్చుకోగలిగితే..నారా లోకేష్ అయినా ప్రతిపక్ష నేతగా జనం అదరించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా బూతులు తిడుతూ..ఎల్లోమీడియాలో ప్రచారం చేసుకుంటే..అది వాళ్ల ఖర్మ తప్ప,, చేసేది ఏమీ లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.