విశాఖ: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌పై వైయస్ఆర్‌సీపీ జెండా ఎగిరింది. 32 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధీనంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మరపడవల సంఘాన్ని వైయస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. సంఘం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా వైయస్ఆర్‌సీపీకి చెందిన వాసుపల్లి జానకీరామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లోని ఆంధ్రప్రదేశ్ మరపడవల సంఘంలో 300 మంది సభ్యులున్నారు. వీరికి 680 బోట్లున్నాయి. ఈ సంఘానికి అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీకి చెందిన పి.సి.అప్పారావు కొన్నేళ్లుగా ఎన్నికవుతున్నారు. ఎప్పుడూ ఓటింగ్ నిర్వహించకుండా చేతులు ఎత్తే పద్ధతినే అనుసరిస్తూ గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న అప్పారావు మరపడవల సంఘం అధ్యక్షుడిగాను కొనసాగుతుండేవారు. ఈ నేపథ్యంలో దివంగత మాజీ కార్పొరేటర్ బి.నీలకంఠం అల్లుడు వాసుపల్లి జానకీరామ్ సంఘంలో చేరడానికి చేసిన ప్రయత్నాలను అప్పారావు అడ్డుకునేవారు. ఏపీ మరపడవల సంఘంలోని అవకతవకలను పలుమార్లు లేవనెత్తిన వాసుపల్లి జానకీరామ్ ఎన్నికలు నిర్వహించాలని కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సంఘం కార్యవర్గానికి కాలపరిమితి ముగియడంతో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. సోమవారం పోలీసు బందోబస్తు మధ్య జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలు వద్దని అప్పారావు వర్గం, నిర్వహించాలని జానకీరామ్ వర్గం ఈ సమావేశంలో పట్టుబట్టాయి. రెండువర్గాల మధ్య వాదోపవాదాలు సాగాయి. పరిస్థితి గమనించిన పి.సి.అప్పారావు పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో జానకీరామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జానకీరామ్ మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యలను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం కోసం సీఎం వైయస్ జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.