తూర్పుగోదావరి: పోలీసులు టీడీపీ తొత్తులుగా వ్యవహరించొద్దని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. ఉప్పాడకు చెందిన వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు ఓసిపల్లి కృపారావు, తిక్కాడ యోహానుల అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ నిరసన తెలిపిన పార్టీ శ్రేణులపై పోలీసులు లాఠిచార్జ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మహిళలని కూడా చూడకుండా లాఠీలు ఝళిపించారు. పోలీసుల దెబ్బలకు ఓసిపల్లి కోదండ, వంకా కొర్లమ్మ అనే మహిళలు తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయారు. నలుగురు యువకులకు పోలీసులు దుస్తులు ఊడదీసి పోలీస్‌స్టేషన్‌లోకి ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనపై వైవీ సుబ్బారెడ్డి ఎస్పీతో మాట్లాడారు. వైయస్ఆర్ సీపీ నేతలు తన కారుపై రాళ్లతో దాడి చేశారంటూ రెండు రోజుల అనంతరం ఎమ్మెల్యే వర్మ కొత్తపల్లి పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇదే సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వైయస్ఆర్‌సీపీకి చెందిన పోలింగ్ బూత్ ఏజెంట్లతోపాటు కొందరు ఓటర్లు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ ఆదేశాలతో ఎట్టకేలకు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఎమ్మెల్యేతోపాటు మరి కొందరిపై కేసు నమోదు చేశారు. అనంతరం టీడీపీ నేతలు వైయస్ఆర్‌సీపీ నేతలపై మరో ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో అక్రమ అరెస్టులు చేయబోమని పోలీసులు హామీ ఇచ్చారు. అయితే ఈ హామీని విస్మరిస్తూ మంగళవారం డీఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రంగంలోకి దిగిన పోలీస్ బలగాలు ఓసిపల్లి కృపారావు, తిక్కాడ యోహానులను అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడుతూ ఆందోళనకు దిగారు. అధికార పార్టీ నేతలకు వంత పాడిన పోలీసులు విచక్షణారహితంగా లాఠీలతో విరుచుకుపడ్డారు. అందరినీ లాగిపడేశారు. మహిళలను సైతం తోసివేశారు. కారుతో సహా పోలింగ్ బూత్‌లోకి చొరబడ్డ ఎమ్మెల్యే వర్మను వదిలేసిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండు చేశారు.