రాజమహేంద్రవరం: చంద్రబాబు వంద రోజుల పాలనపై టీడీపీ, జనసేన, బీజేపీలు సంయుక్తంగా జబ్బలు చరుచుకుంటున్నాయని, ఇది వంద రోజుల పాలన కాదని.. అది బొందపెట్టిన పాలన అని మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మండిపడ్డారు. చంద్రబాబుది రక్తచరిత్ర పాలన అన్న ఆయన, పరిపాలనలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని స్పష్టం చేశారు. ప్రజలను చంద్రబాబు దారుణంగా వంచించారన్న మాజీ ఎమ్మెల్యే.. ప్రపంచ చరిత్రలో ఇంత దారుణ వంచన లేదని తేల్చి చెప్పారు. సూపర్ సిక్స్ హామీలు, పోలవరం, రాజధానిపై అసత్యాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. అప్పటి నుంచి రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ.. బురద రాజకీయాలు, హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరిందన్న సుధాకర్‌బాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తన మరిది చేసే నేరాలు, ఘోరాలపై కిక్కురుమనడం లేదని గుర్తు చేశారు. రాజమహేంద్రవరంలో మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఇచ్చిన హామీల లబ్ధిదారులు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలేనన్న మాజీ ఎమ్మెల్యే.. అవి అమలు కాకపోవడం వల్ల వారికి మేలు జరగడం లేదని చెప్పారు. చంద్రబాబు నాలుగు నెలల్లోనే రూ.45 వేల కోట్ల అప్పులు చేశారని గుర్తు చేసిన ఆయన, ఆ డబ్బంతా ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా, వరదలు, లేదా కరువు వస్తాయన్నారు. విజయవాడను బుడమేరు వరదతో ముంచేసి 70 మందిని హత్య చేసిన నరహంతకుడు చంద్రబాబు అని సుధాకర్‌బాబు మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమం డోర్ డెలివరీ అయితే.. ఇప్పుడు కూటమి పాలనలో కేసులు, వేధింపులు డోర్ డెలివరీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. చంద్రబాబు ఒక ద్రోహి అని, విఫల సీఎం అని, ఈ 100 రోజుల్లో ఆయన ప్రజల మేలు కోసం చేసింది శూన్యమని, హత్యలు, దోపిడి, వేధింపులు తప్ప ఆయన చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకూ విశ్రమించబోమన్న టీజేఆర్ సుధాకర్‌బాబు, ప్రజల తరపున పోరాడతామని ప్రకటించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేసే బాధ్యత పవన్‌కళ్యాణ్, పురంధేశ్వరి తీసుకోవాలని తేల్చి చెప్పారు.