తాడేపల్లి: అధికారంలోకి రాగానే ఉద్యోగులకు అన్నీ చేస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు..బడ్జెట్‌లో మొండిచేయి చూపారని వైయస్‌ఆర్‌సీపీ ఉద్యోగులు, పెన్షనర్ల రాష్ట్ర విభాగం అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఉద్యోగులు, పెన్షనర్ల రాష్ట్ర విభాగం అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. చంద్రశేఖర్‌రెడ్డి ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు: – ఉద్యోగులు, పెన్షనర్లకు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులు చూస్తే మొండిచేయి చూపించినట్టే అనిపిస్తుంది. – ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు, జీపీఎఫ్ లాంటివి దాదాపు రూ.25 వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి. వెంటనే అవన్నీ చెల్లించాలి. – రెండు డీఏ బకాయిలు, జీపీఎఫ్, సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, మెడికల్ రీయింబర్స్‌మెంట్, రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ బకాయిల వంటివి ఉద్కోగులు, పెన్షనర్స్‌కు రావాల్సి ఉంది. వాటిని కూటమి ప్రభుత్వం తక్షణం అమలు చేయాలి. – జూన్ 1, 2023 నుంచి రావాల్సిన పీఆర్సీని 30 శాతం తగ్గకుండా అమలు చేయాలి. – దసరా, దీపావళి సందర్భంగా డీఏ లేదా ఐఆర్ వస్తుందని ఉద్యోగులు ఎదురు చూశారు. కానీ నెరవేరలేదు. వైఎస్ జగన్ హయాంలో మధ్యంతర భృతి 27 శాతం అమలు చేశారు. – అందుకే కూటమి నాయకులు కూడా మాట నిలబెట్టుకుంటూ, 27 శాతం తగ్గకుండా ఐఆర్ ఇవ్వాలి. – పెన్షనర్స్ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. దాని గురించి ఇంతవరకు ప్రభుత్వం మాట్లాడటం లేదు. – ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. లేనిపక్షంలో నిరుద్యోగ భృతి నెలకు రూ. 3 వేలు ఇస్తామని చెప్పిన హామీని తక్షణం అమలు చేయాలి. – హామీ ఇచ్చినట్టుగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీదనే ఉంది. లక్ష మంది ఉద్యోగుల జీవితాలు రోడ్డుపాలు కాకుండా కాపాడాలి. డిమాండ్లు: – అర్హులైన ఉద్యోగులకు పదోన్నతలు కల్పించడంతోపాటు చాలా శాఖల్లో ఖాళీలను తక్షణం భర్తీ చేయాలి. – డిసెంబర్ లోపు భర్తీ చేస్తామన్న డీఎస్సీ విషయంలో మాట మార్చారు. షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలి. – ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారు పని చేస్తున్న ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. తక్షణమే ఆ నిర్ణయాన్ని అమలు చేయాలి. – రాష్ట్రంలో 3.80 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ 70 ఏళ్లు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం మంజూరు చేయాలి. – ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో బేసిక్ మీద 40 శాతం కమిటేషన్ చేస్తారు. కమిటేషన్ చేసిన తర్వాత 15 ఏళ్ల నుంచి ఫుల్ పెన్షన్ వస్తోంది. దాన్ని 11 సంవత్సరాల 3 నెలలకు తగ్గించాలి. – సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు. దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులను ఓపీఎస్‌లోకి తీసుకు రావాలని డిమాండ్ చేస్తున్నాం. – ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) కార్డుపై కొన్ని ఆస్పత్రుల్లో కొన్ని జబ్బులకు వైద్యం చేయడం లేదు. అన్ని జబ్బులకు ఈహెచ్‌ఎస్ కార్డు మీద వైద్యం చేయాలని డిమాండ్ చేస్తున్నాను. – వలంటీర్లకు హామీ ఇచ్చినట్టుగా వారికిచ్చే గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచి వారి సేవలను పునరుద్ధరించాలి. – ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న అంగన్‌వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, జీతాలు పెంచాలి. – ఆప్కాస్‌లో లేని ఉద్యోగులకు జీతాలు ఆరు నెలలుగా అందడం లేదు. వారికి తక్షణం జీతాలు చెల్లించాలి. – గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ మొదలైంది. 10,700 మందిని గుర్తించి, వారిలో 4వేల మందిని రెగ్యులరైజ్ చేశారు. ఎన్నికల కోడ్‌తో అది ఆగిపోయింది. మిగిలిన వారందరి సర్వీస్ క్రమబద్ధీకరించాలి. – కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై పెరిగిన పని ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించాలి.