తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ సైనికులుగా శాసన మండలిలో కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. ఆధారాలు చూపిస్తూ..ప్రభుత్వాన్ని నిలదీయాలని..ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ప్రశ్నిస్తామన్న భయంతోనే వైయస్ఆర్‌సీపీకి అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వలేదన్నారు. అయినా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలు ప్రభుత్వ విధానాలపై మండలి నుంచి నిలదీయాలని ఎమ్మెల్సీలకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో క్యాంపు కార్యాలయంలో శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులతో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి విడివిడిగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ ఏమన్నారంటే... అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాం. కానీ కౌంటర్‌కు స్పీకర్ సమాధానం ఇవ్వలేదు. కోర్టు నుంచి వచ్చిన సమన్లు కూడా స్పీకర్ తీసుకోలేదు. అసంబ్లీలో ఉండే ఏకైక ప్రతిపక్షం మనమే. మనం తప్ప మరో ప్రతిపక్షం లేదు. అయినా కూడా వారు మనల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించడంలేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అలా గుర్తిస్తే... ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడ్డానికి అవకాశాలు ఇవ్వాల్సి వస్తుందని, దీనికి ముందుకు రావడం లేదు. సభా నాయకుడికి మాట్లాడ్డానికి ఎంత సమయం ఇస్తారో ఆ తర్వాత అంత హక్కుగా ప్రతిపక్ష నాయకుడికి సమయం ఇవ్వాల్సిన వస్తుందేమోనని, ఇవ్వకతప్పని పరిస్థితులు వస్తాయనే, దాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష నాయకుడిగా అంగీకరించడం లేదు. 40 శాతం ఓట్ షేర్ సాధించిన పార్టీని ప్రతిపక్షపార్టీగా గుర్తించడానికి ఇష్టపడని పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైకోర్టులో మనం వేసిన పిటిషన్‌కు స్పీకర్ కౌంటర్ కూడా వేయడానికి సుముఖంగా లేరు. అందుకే ఎమ్మెల్యేలు తమ గళాన్ని మీడియా వేదికగా ప్రజలకు వినిపిస్తారు. ప్రతిరోజు మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు మీడియా ద్వారా మాట్లాడతారు. ప్రజాసమస్యలపైనా, ప్రభుత్వ వైఫల్యాలపైనా ప్రశ్నిస్తారు. అసెంబ్లీలో ఏ మాదిరిగా అయితే ప్రశ్నలు వేస్తామో, అదే రీతిలో ఇక్కడ నుంచి అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాం. పూర్తి వివరాలు, ఆధారాలు, సాక్ష్యాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ వివరాలన్నింటినీ కూడా శాసనమండలి సభ్యులు ప్రతి ఒక్కరికీ పంపిస్తాం. వాటిని ఆధారాలుగా చూపిస్తూ, ప్రభుత్వాన్ని నిలదీయండి.. ప్రశ్నించండి. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రశ్నిస్తే... బుల్డోజ్ చేస్తూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అప్పుల విషయంలో ఎన్నికలకు ముందు వాళ్లు చేసిన ప్రచారం పచ్చి అబద్దమని వాళ్లే బడ్జెట్ పత్రాల ద్వారా చెప్పారు. అప్పుల సంఖ్యలో అన్నీ అబద్దాలే. వాళ్లే అసెంబ్లీకి బడ్జెట్ పత్రాలు విడుదలచేశారు, అందులో వాస్తవాలతో ఇప్పటివరకూ వారు చెప్పినవి అబద్ధాలేనని తేలిపోయింది. పాలకపక్షానికి చెందినవారు అడ్డంగా దొరికిపోయారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు సమగ్ర వివరాలను ప్రెస్ మీట్ ద్వారా నేనే వివరిస్తాను. చంద్రబాబు చెప్పవన్నీ అబద్దం అని, చేసేవన్నీ మోసం అని ఇప్పటికే తేలిపోయింది. ఈ ఆరునెలల కాలంలో చంద్రబాబు నైజాన్ని ప్రజలు గుర్తించారు. అందరికీ ఒక్కటే చెబుతున్నాను. ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. కష్టాలు అనేవి శాశ్వతం కాదు. వ్యక్తిత్వాన్ని, విలువలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుదాం. కచ్చితంగా తిరిగి మనం అధికారంలోకి వస్తాం. జమిలి ఎన్నికలు లాంటి వార్తలు కూడా వింటున్నాం. వైయస్ఆర్‌సీపీ సైనికులుగా మండలిలో ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. గట్టిగా పోరాటం చేయండి. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలి. గట్టిగా ప్రశ్నిస్తే.. కేసులు పెడతారన్న భయాందోళనలు అనవసరం. నేను మీకు అండగా ఉంటాను. నా వయసు చిన్నదే. మరో 30 ఏళ్లు రాజకీయాలను చూస్తాను. మనం అందరం కలిసి సుదీర్ఘకాలం రాజకీయాలలో ప్రయాణం చేస్తాం. ఎప్పుడూ లేని విధంగా మనం సోషల్ ఇంజనీరింగ్ చేశాం. ఎక్కడాలేని మార్పులు తీసుకువచ్చాం. కాలక్రమేణా మనం చేసిన పనుల ప్రాధాన్యతను ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు.