పోలీసులు ప‌ట్టించుకోవ‌డం లేదు..కేసును సుమోటోగా స్వీక‌రించాలి

సీజేఐకి లేఖ రాసిన వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ పాలేటి రాజ్‌కుమార్‌

గుంటూరు:  త‌న‌పై అరాచ‌కం చేసిన టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని, కేసును సుమోటోగా స్వీక‌రించి విచార‌ణ చేప‌ట్టాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ పాలేటి రాజ్‌కుమార్ కోరారు. ఈ మేర‌కు సుప్రీం కోర్టు సీజేఐకి రాజ్‌కుమార్ లేఖ రాశారు. 

ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ఇటీవ‌ల మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పెదవడ్లపూడిలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త పట్ల టీడీపీ నాయకులు దాడి చేసి అమానవీయంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 
వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త కృష్ణవేణి భర్త పాలేటి రాజ్‌కుమార్‌ను గ్రామానికి టీడీపీ నాయకుడు జవ్వాది కిరణ్‌చంద్‌ ఆదివారం తన అనుచరుల ద్వారా ఊరి మధ్యకు రప్పించాడు. అందరూ చూస్తుండగా దారుణంగా దాడి చేశారు. ఒంటిపై దుస్తులు విప్పి మరీ చితకబాదారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు లోకేశ్‌ ఫొటో ఉన్న ఫ్లెక్సీ చేత్తో పట్టుకోగా, విలపిస్తున్న రాజ్‌కుమార్‌ను దాని ఎదురుగా మోకాళ్లపై కూర్చోబెట్టారు. 

‘నన్ను క్షమించండి.. చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, ఇతరుల గురించి ఏరోజూ ఏం మాట్లాడను’ అని చెప్పించారు. అనంతరం రాజ్‌కుమార్‌.. తనను మన్నించమని టీడీపీ నేత కిరణ్‌చంద్‌ కాళ్లు పట్టుకున్నాడు. అయితే తన కాళ్లు కాదని.. ఫ్లెక్సీలో లోకేశ్‌ కాళ్లు కూడా పట్టుకోమని ఆ టీడీపీ నేత ఆదేశించాడు. బాధితుడు వారు చెప్పినట్లే చేశాడు. తన కుటుంబాన్ని క్షమించాలని పదే పదే విజ్ఞప్తి చేశాడు. 

పెద్దవడ్లపూడి నుంచి ఐదు వాహనాల్లో బొప్పుడి గ్రామానికి వెళ్లి ఆ భార్యాభర్తల పై దాడి చేసింది జవ్వాది కిరణ్ కుమార్, అతని అనుచరులుగా స్పష్టంగా తేలింది. అంతేకాదు.. బలవంతంగా కారులో ఎక్కించుకుని రాత్రంతా రాజకుమార్ పైన దాడి చేస్తూ తెల్లవారుజామున బోయిపాలెం రోడ్ లో వదిలేసి వెళ్లిపోయారు తెలుగుదేశం నాయకులు. తీవ్రంగా గాయపడిన రాజ్‌ కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. 

ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్‌ అయినప్పటికీ పోలీసుల నుంచి ఎలాంటి చర్యలూ లేకపోవడం గమనార్హం. అంతేకాదు రాజ్‌కుమార్‌ గతంలో చేసిన పోస్టులంటూ కొన్నింటిని వైరల్‌ చేస్తూ.. దాడిని  టీడీపీ సానుభూతిపరులు స‌మ‌ర్ధించారు.

మంగళగిరిలో టీడీపీ నేతల అరాచకంపై సీజేఐకి వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది. సీజేఐతో పాటు హెచ్‌ఆర్‌సీ,హైకోర్టు సీజేకు బాధితుడు పాలేటి రాజ్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. రాజ్‌కుమార్‌ను తీవ్రంగా కొట్టి అర్ధనగ్నంగా కాళ్లు పట్టించుకున్న టీడీపీ నేతలు. వీడియో ఆధారాలు ఉన్నా పోలీసులు చర్యలు తీసుకోలేదు. నారా లోకేష్‌ అనుచరులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాజ్‌కుమార్‌ సీజేఐకి ఫిర్యాదు చేశారు. సుమోటోగా కేసును స్వీకరించాలని రాజ్‌కుమార్‌ సీజేఐకి రాసిన లేఖలో కోరారు. 
 

Back to Top