వైయ‌స్ఆర్ జాబ్ మేళాతో వేల కుటుంబాల్లో వెలుగులు 

జాబ్ మేళా ప్రారంభ సభలో ఎంపీ విజయసాయిరెడ్డి 
 

గుంటూరు :  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన‌  మెగా జాబ్ మేళాతో  నిరుద్యోగులు, వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యసాయిరెడ్డి తెలిపారు.    జాబ్ మేళా  నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని  పేర్కొన్నారు. శనివారం గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆడిటోరియం హాలులో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్ మెగా జాబ్ మేళా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఉద్యోగార్ధులు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌ మదిలో మెదలిన అలోచనే ఈ జాబ్ మేళా అని అన్నారు. నిరుద్యోగులు అనడం కంటే ఉద్యోగార్ధులు అనడమే బాగుంటుందని అన్నారు.  వైఎస్ ఆర్ జాబ్ మేళాకు ఊహించిన దానికన్నా ఉద్యోగార్ధులు, తల్లిదండ్రుల నుండి ఎక్కువ స్పందన లభించిందని అన్నారు. మొదట్లో మొత్తం 15 వేలు ఉద్యోగాలు ఇవ్వగలమని అనుకున్నామని, కానీ ఊహించిన దానికంటే ఇటు ఉద్యోగార్దులు, అటు కంపెనీల నుండి భారీ స్పందన రావడంతో మెదటి రెండు జాబ్ మేళాలలోనే 30 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించడం జరిగిందని అన్నారు. గతంలో నిర్వహించిన ఇంటర్వ్యూలు తాను పరిశీలించడం జరిగిందని. ఉద్యోగార్దులు ఆత్మవిశ్వాసంతో కంపెనీ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలని సూచించారు. తెలిసింది తెలుసని, తెలియంది తెలియదని స్పష్టంగా చెప్పగలగాలని చెప్పారు. ఏపి విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం దేశవ్యాప్తంగా ఉందని, అభ్యర్దులు నాలుగైదు కంపెనీల ఇంటర్వ్యూ లకు హాజరు కావాలని సూచించారు. వచ్చిన ఉద్యోగాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోకూడదని, వచ్చిన ఉద్యోగంలోనే తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని సూచించారు. గతంలో జరిగిన జాబ్ మేళాలలో కనీసం 15 వేల జీతం నుండి లక్ష రూపాయల జీతం వరకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందని అన్నారు. వచ్చిన ఎటువంటి ఉద్యోగం అయినా వదులుకోకుండా జాయిన్ అవ్వాలని తమ అర్హతకు తగినది కాదని విడిచి పెట్టుకోవడం కంటే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. కంపెనీకి ఉత్తమ సేవలందిస్తామన్న భరోసా అభ్యర్దులు ఇవ్వగలగాలి. కంపెనీల వద్ద నుండి అభ్యర్దులు అశించిన విధంగానే కంపెనీలు కూడా వారి నుంచి అశిస్తాయని అన్నారు. బ్యాంకింగ్, ఐటీ. రిటైల్, మార్కెటింగ్, సేల్స్, నిర్మాణం, తదితర రంగాలకు చెందిన 210 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని ఆయన అన్నారు. జాబ్ మేళా ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని. ఉద్యోగాలు పొందలేని వారికి స్కిల్ డెవలప్ మెంట్ లో ట్రైనింగ్ ఇచ్చి తరుపరీ జాబ్ మేళాకు సిద్దం చేస్తామని అన్నారు. ప్రస్తుత జాబ్ మేళాలో 97 వేల మంది రిజిస్టర్ చేసుకోగా 26 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ కానున్నాయని అన్నారు. ఇంటర్య్యూలకి హాజరైన ప్రతి నలుగురిలో ఒకరికి ఉద్యోగం లభిస్తుందని తెలిపారు. గత రెండు విడతల్లో 347 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. ఉద్యోగార్థులకు సహకరించేందుకు, సమాచారం అందించేందుకు 800 మందికి పైగా వాలంటీర్లు పనిచేస్తున్నారని, హెల్ప్ లైన్ సెంటర్లు, ఇన్ఫర్మేషన్ సెంటర్లు, ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఉద్యోగార్థులకు, వారికి సహకారంగా వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు, మజ్జిగ, భోజనం సదుపాయం కల్పించినట్లు చెప్పారు. రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి  ఆదేశాల మేరకు ఈ జాబ్ మేళాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. చదువుకున్న యువత ఉద్యోగం సంపాదించడం ద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుతుందని, రాష్ట్రనికే కాకుండా దేశాభివృద్ది తోడ్పడుతుందని అన్నారు. ఉద్యోగార్దుల్లో, వారి కుటుంబాల్లో సంతోషం వెల్లువిరియాలన్నదే ముఖ్యమంత్రి  వైయ‌స్ జ‌గ‌న్ ఆశని, అది సాకారం చేసేందుకు జాబ్ మేళా నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇది కేవలం అరంభం మాత్రమేనని అన్నారు, ప్రభుత్వం ఉద్యోగంలో మాత్రమే ఉద్యోగ భద్రత ఉంటుందని అనుకోవడం కేవలం అపోహ మాత్రమేనని, ప్రైవేటు రంగంలో టాలెంట్ నిరూపించుకునేందుకు, ఉన్నతంగా ఎదగడానికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు తానైతే ప్రైవేటు రంగాన్నే ఎంచుకొని తన సామర్థ్యం నిరూపించుకోవడానికి ఇష్టపడతానని అన్నారు. ఇంటర్వ్యూలు ఎదుర్కొనే ఉద్యోగార్దులందరికీ అభినందనలు తెలియజేశారు. అంతకు ముందు మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ    
రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా వినూత్న రీతిలో నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళాలు నిర్వహించే బాధ్యత వైఎస్సార్సీపీ చేపట్టిందని అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ  జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాను రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయసాయి రెడ్డి తన భుజస్కందాలపై వేసుకొని రథసారధిలా నడిపిస్తున్నారని అన్నారు. మెదట వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో, అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, ఇప్పుడు నాగార్జున యూనివర్శిటీలో వైఎస్సార్ మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారని అన్నారు. యువత ఎదుగుదలకు ఇదే నాంది అని. రాబోయే రోజుల్లో ఈ జీబ్ మేళాలు నిరుద్యోగులకు ఆశాశ్యోతిగా నిలుస్తాయని అన్నారు. 210 కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని. 26 వేల మందికి పైగా ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థ ప్రవేశ పెట్టి లక్షల్లో ఉద్యోగాలు కల్పించి, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు జ్యోతి ప్రజ్వలన చేసి, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి  వైయ‌స్సార్సీపీ ప్రముఖులు నివాళులు అర్పించారు. అనంతరం యూనివర్సిటీ పరిధిలోని దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఇతర ప్రముఖులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బ్లాక్ 1 లో నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలు పరిశీలించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు కిలారి వెంకట రోశయ్య, మద్దాలి గిరిధర్, ఎమ్మెల్సీలు  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జంగా కృష్ట మూర్తి, కల్పలతా రెడ్డి, మురుగుడు హనుమంతరావు లేళ్ల అప్పిరెడ్డి, వైస్ ఛాన్సలర్ రాజశేఖర్, జెడ్ పి చైర్ పర్సన్ క్రిస్టినా, ఎపిఎస్ఎస్ డిసి చైర్మన్ చల్లామధుసూధన్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ ,ఈ-ప్రగతి సిఈఓ హర్షవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా ఇంచార్జీ దేవెందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Back to Top