వైయస్‌ఆర్ జిల్లా: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట సుబ్బయ్య కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి పట్ల ౖవైయస్‌ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. 1960లో జన్మించిన వెంకట సుబ్బయ్య ఆర్థోపెడిక్ సర్జన్‌గా ప్రజలకు సేవలందించారు. 2016లో బద్వేల్ వైయస్‌ఆర్ సీపీ కో–ఆర్డినేటర్‌గా పనిచేశారు. 2019లో తొలిసారిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య గారి భౌతిక కాయానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మేయర్ సురేష్ నివాళులు అర్పించారు. వెంకట సుబ్బయ్య మృతిపట్ల మంత్రులు ఆళ్ల నాని, ఆదిమూలపు సురేష్, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వైద్యుడిగా, ఎమ్మెల్యేగా వెంకట సుబ్బయ్య సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. వెంకట సుబ్బయ్య మృతి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు అని, వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి బాధాకరమని, పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉండేవారని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. వెంకట సుబ్బయ్య ఆత్మకు శాంతి కలగేలా భగవంతున్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.