నెల్లూరు: ఇటీవల నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే జనామోదం ఎక్కువ లభించిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యేక కథనం ఇలా.. పార్లమెంటు ఎన్నికల ఏడో, చివరి దశ పోలింగ్ ముగిసే సమయంలో ఈ ఎలక్షన్లలో ప్రధానాంశాలు ఏవి? అని ప్రశ్నించుకుంటే–మూడు విషయాలు కనిపిస్తాయి. కేంద్రంలో పాలకపక్షంతో సహా అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని, దాన్ని కాపాడుకుంటామని, రాజ్యాంగ మౌలిక స్వరూపంలో మార్పులు చేయడాన్ని అంగీకరించబోమని చెప్పడం విశేషం. అలాగే, ఒక్క మైనారిటీల కోటాలపై ఈ ఎన్నికల ప్రచారంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన మాట నిజమేగాని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దుచేసే ప్రమాదం పొంచి ఉందని కొన్ని పార్టీలు హెచ్చరించాయి. అయితే, కేంద్రంలోని, ఇంకా అన్ని రాష్ట్రాల్లోని పాలకపక్షాలూ కూడా ఈ మూడు సామాజికవర్గాల కోటాలు కొనసాగాలనే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. దేశంలో–ముఖ్యంగా దక్షిణాదిన అత్యధిక సంక్షేమ–నగదు బదిలీ పథకాలతో ప్రజల మనస్సులు గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ పాలకపక్షం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అజెండాను లేదా ఎన్నికల మేనిఫెస్టోను అనుసరిస్తూ, ఇంకా చెప్పాలంటే కాపీ కొట్టి తామూ ప్రజా సంక్షేమంలో ముందుంటామని కొన్ని పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. గడచిన ఐదేళ్లలో ఎన్ని లక్షల మంది యువతీయువకులకు ఏఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చాయనే చర్చ ఎన్నికల ప్రచారం సందర్భంగా జనంలో జరిగింది. ఈ విషయంలో కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే జనామోదం ఎక్కువ లభించింది. 2019 మే 30న ఏపీలో అధికారం చేపట్టిన వెంటనే వార్డు వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు కోసం లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం. అధికార వికేంద్రీకరణలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల స్థాపనతో కూడా ఇంకా లక్షల మంది యువతకు శాశ్వత ఉపాధి లభించింది. మొత్తం మీద పార్లమెంటు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల రోజూవారీ జీవితానికి సంబంధించిన అంశాలకే ఎన్నికల ప్రచారంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సంపద, శాశ్వత ఉద్యోగావకాశాలు లేని ప్రజలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం మాదిరిగా వినూత్న పద్ధతిలో ఆదుకోవడం ఎన్నికల ప్రచారం కారణంగా దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. మతం, కులం అనే అంశాలు ఏపీ సహా అన్ని రాష్ట్రాల్లో ఓటర్లను ఉద్వేగపూరితంగా కదిలించలేకపోయాయి. వైయస్ జగన్ గారు చెప్పినట్టు పేదల తరఫున నిలబడే పార్టీలకు, పెత్తందార్ల ప్రయోజనాలు కాపాడే పార్టీలకు మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్నికల సమరంలో విజయం పేదలు, దిగువ మధ్యతరగతి వర్గం ప్రజల తరఫున నిలబడే పార్టీలనే వరిస్తుందని మరో 24 గంటల్లో తేలిపోతుందని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.