న్యూఢిల్లీ: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పనితీరు రాక్షస పాలనను తలపిస్తోందని విమర్శించారు. “టీడీపీ గుండాలు, కార్యకర్తలు వేల సంఖ్యలో అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారు. దాదాపు ఐదు గంటల పాటు వీరంగం సృష్టించి ఇంటిని ధ్వంసం చేశారు” అని తెలిపారు. ఈ ఘటన సమయంలో పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర పోషించారని, కనీసం దాడిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితి అని అన్నారు. వైయస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాము అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రికే ప్రాణరక్షణ కరువైందని కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు హోంశాఖ కార్యదర్శికి కూడా వివరించనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.