ఆయనలో చూసిన మంచిత‌నం ఆధారంగా నాలో..నాతో  పుస్తకాన్ని రాశాను

వైయ‌స్ఆర్‌సీపీ గౌర‌వాధ్య‌క్షురాలు వైయ‌స్ విజయమ్మ

ఇడుపుల‌పాయ‌:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్‌‌ రాజశేఖరరెడ్డితో 33 ఏళ్లు కలిసి జీవించిన సమయంలో నేను ఆయనలో చూసిన మంచితనం, ఆయన చెప్పిన మాటల ఆధారంగా నాలో..నాతో పుస్తకం రాశాన‌ని వైయ‌స్ఆర్‌సీపీ గౌర‌వాధ్య‌క్షురాలు వైయ‌స్ విజ‌య‌మ్మ పేర్కొన్నారు. వైయ‌స్ విజ‌య‌మ్మ ర‌చించిన నాలో..నాతో పుస్త‌కాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఇవాళ ఇడుపుల‌పాయ‌లో ఆవిష్క‌రించారు. ఈ సంర‌ద్భంగా విజ‌య‌మ్మ మాట్లాడుతూ..వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గురించి రాయాలని నాకు అనిపించింది. ఆయనలో మూర్తీభవించిన మానవత్వం గురించి, ఆయన మాటకు ఇచ్చే విలువ గురించి రాయాలనిపించింది. ఎంతో మంది జీవితాలకు ఆయన వెలుగునిచ్చారు' అని చెప్పారు. 'ఈ అంశాలన్నీ ఆయనలో చూశాను.. ఆయన ప్రత్యర్థులు కూడా ఆయన జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన ప్రతి మాట, ప్రతి అడుగు గురించి చాలా మంది తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే నా కొడుకు, కోడలు.. కూతురు, అల్లుడు ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితుల్లో వైయ‌స్సార్‌ మాటలను గుర్తు తెచ్చుకుని వాటి స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటుంటారు. ప్రతి ఒక్కరు ఈ పుస్తకం చదివి వారు కూడా వైయ‌స్ఆర్ స్ఫూర్తిని కొనసాగిస్తారని భావిస్తూ నేను ఈ పుస్తకం రాశాను' అని విజయమ్మ తెలిపారు.

Back to Top