భావోద్వేగానికి గురైన వైయ‌స్ విజయమ్మ

విజయవాడ : ఢిల్లీకి రాజు అయినా అమ్మకు మాత్రం కొడుకే. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయినా.. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తల్లి దగ్గర మాత్రం బిడ్డే. కుమారుడి ప్రమాణ స్వీకారం సందర్భంగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయ‌స్‌ విజయమ్మ భావోద్వేగానికి లోనయ్యారు. వైయ‌స్ జగన్‌ మోహన్‌రెడ్డి అనే నేను అని కొడుకు ప్రమాణం చెయ్యగానే ఆ తల్లి కళ్లు ఆనందంతో తడిసి ముద్దయ్యాయి. ఆ తల్లి పదేళ్ల కల కళ్లముందు నిలబడి ప్రమాణస్వీకారం చేసిన రోజు ఇది. తన భర్త ప్రతిరూపంగా తన బిడ్డ చేసిన ప్రమాణస్వీకారం చూసిన ఆనందంలో ఆమె కళ్లు చమర్చాయి. కొడుకును హత్తుకొని మురిసిపోయారు. ఇద్దరు ముఖ్యమంత్రులపై తన ముద్రను వేసిన స్త్రీమూర్తి ఆమె. వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి సతీమణిగా రెండు సార్లు ఆయన ప్రమాణస్వీకారాలు చేసినప్పుడు విజయమ్మ చిరునవ్వులు చిందిస్తూ వేదికపై కనిపించారు. ఇప్పుడు.. ముఖ్యమంత్రి  వైయ‌స్‌ జగన్‌ తల్లిగా ఆయన పక్కనే కూర్చున్న ఆ తల్లి ముఖాన్ని చిరునవ్వు కంటే భావోద్వేగమే ఎక్కువగా కమ్మేసింది.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, తొలి ప్రసంగం చేసిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి ఆమె సంతోషంతో ఆనందభాష్పాలు రాల్చారు. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం వైయ‌స్ జగన్‌ను దగ్గరకు తీసుకుని తన హృదయానికి హత్తుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తల్లిని అక్కున చేర్చుకుని, కన్నీళ్లు తుడిచి ఓదార్చారు. ఈ దృశ్యం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన అందరినీ కదలించివేసింది. 

Back to Top