మన్యం : వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పార్టీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి పరామర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా సీనియర్ నేత అయిన పాలవలస రాజశేఖరం(81) ఇటీవల అనారోగ్యంతో కన్నమూశారు. రాజశేఖరం మృతిపై సంతాపం వ్యక్తం చేసిన వైయస్ జగన్.. ఫోన్ ద్వారా ఆ కుటుంబంతో మాట్లాడి సంఘీభావం తెలిపారు. ఇవాళ రాజశేఖరం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుమారుడు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, కుమార్తె మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, తదితరులను పరామర్శించారు. పాలకొండ పర్యటనలో భాగంగా వైయస్ జగన్ తొలుత విశాఖపట్నం చేరుకున్నారు. ఆ సమయంలో వైయస్ఆర్‌సీపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. పార్టీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో కాసేపు వైయస్ జగన్ చర్చించారు. వైయస్ జగన్ రాక నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ శ్రేణులు, అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. వారందరికీ అభివాదం చేస్తూ వైయస్ జగన్ ముందుకు సాగారు.