దేవుడు అంతా చూస్తున్నారు..  ధైర్యంగా ఉండండి

పోసాని భార్య సుమ‌ల‌త‌కు వైయ‌స్ జ‌గ‌న్ ఫోన్‌లో ప‌రామ‌ర్శ‌

పార్టీ అండగా ఉంటుందని భ‌రోసా

తాడేప‌ల్లి: పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) అక్రమ అరెస్ట్‌ వ్యవహారంపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి స్పందించారు. పోసాని భార్య కుసుమలతను ఫోన్‌లో పరామర్శించిన ఆయన.. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. 

‘‘దేవుడు అంతా చూస్తున్నారు. మీరు ధైర్యంగా ఉండండి. మేం అందరం మీకు తోడుగా ఉంటాం. పొన్నవోలు సహా అందరినీ రాజంపేటకు పంపించాం. నాయకులందరినీ కోర్టు వద్దకు పంపించాం. రాష్ట్రంలో నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదు’’ అని వైయ‌స్‌ జగన్‌(YS Jagan) అన్నారు. 

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్‌గా పోసాని పని చేశారు. అయితే ఏపీ  అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు.  ఆపై ప్రెస్‌ మీట్‌ నిర్వహించి మరీ ఇకపై రాజకీయాలు మాట్లాడబోనని, వాటికి దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే.. అనూహ్యంగా హైదరాబాద్‌లో ప్రత్యక్షమైన అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు.. ఆయనపై కేసు నమోదైందని చెబుతూ అప్పటికప్పుడే ఆయన భార్యకు నోటీసులు అందజేసి వెంట తీసుకెళ్లారు. తన ఆరోగ్యం బాగోలేదని, భోజనం చేసి తానే వస్తానని చెప్పినా వినలేదు. ఈ క్రమంలో పోసాని కుటుంబ సభ్యులతోనూ రాయచోటి పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మరోవైపు పోసానిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయం కూడా చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. 

గతంలో.. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని జనసేన(Jana Sena) నేత మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణ మురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పోసానిపై 196, 353(2), 111 రెడ్‌విత్‌ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

Back to Top