సున్నా వడ్డీకే రుణాలు తీసుకొస్తా

బాబును నమ్మి రైతులు మోసపోయారు

హెరిటేజ్‌ కోసం రైతులను దోచి దళారీలను బాగు చేస్తున్నారు

వ్యవసాయ రంగంలో దేశంలో చిట్టచివరి స్థానంలో ఉన్నాం

ఏపీలో 75 శాతం రైతులు అప్పులపాలయ్యారని నివేదికలు చెబుతున్నాయి

అక్కచెల్లెమ్మల రుణాలు వడ్డీలతో రూ.26 వేల కోట్లకు పైగా పెరిగిపోయాయి

బాబు..ఎల్లోమీడియా కుట్రలు మీరంతా చూస్తున్నారు

ప్రతి ఒక్కరికి రూ.3 వేల చొప్పున ఇచ్చేందుకు రెడీ అవుతారు

నన్ను గెలిపించండి..వైయస్‌ఆర్‌ చేయూతతో ప్రతి అక్క చేతికి రూ.75 వేలు ఇస్తా

కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే..రైతులు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు తీసుకొస్తానని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరికి మేలు జరుగలేదన్నారు. రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారని మండిపడ్డారు. తనను గెలిపిస్తే ప్రతి మహిళకు రూ.75 వేలు ఉచితంగా ఇస్తానని మాట ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..

 ఐదేళ్లుగా చంద్రబాబును ఏం చేశావని అడిగితే ఎల్లో మీడియా, చంద్రబాబు ఏం చెబుతారో తెలుసా... ఎల్లో మీడియా అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇంకా అమ్ముడుపోయిన అనేక టీవీ చానళ్లు కనిపిస్తాయి. బాబు పాలన బంగారం అంటూ ఎల్లో మీడియా టీవీలో ప్రచారం చేస్తూ, పేపర్లలో రాస్తున్నారు. ఎన్నికల్లో రైతులకు, అక్కచెల్లెమ్మలకు ఏం వాగ్దానాలు ఇచ్చారో తెలుసు. సమాజంలో 60 శాతం జనాభా ఆధారపడింది వ్యవసాయంపైనే.. అలాంటి రైతులకు చంద్రబాబు ఏం చెప్పి.. ఎలా మోసం చేశాడో ఆలోచన చేయాలి. అక్కచెల్లెమ్మలకు చంద్రబాబు ఏం చెప్పాడు. ఎలా వంచించాడో ఆలోచన చేయాలి. అన్ని రకాలుగా రైతులను, అక్కచెల్లెమ్మలను దారుణంగా మోసం చేసిన పరిస్థితులు ఉంటే ఈయనకు, ఎల్లోమీడియాకు, ఈయన పాట్నర్‌ ఒక యాక్టర్‌ ఉన్నాడు.. వీళ్లకు మాత్రమే చంద్రబాబు పాలన ఇంపుగా కనిపిస్తుంది. 

రైతుల రుణాలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రూ. 87,612 కోట్లు, మొత్తం రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో చెప్పాడు. ఆ తరువాత రుణాలను కత్తిరించి చివరకు రూ. 24,500 కోట్లు అని చెప్పాడు. అవి అయినా ఇచ్చాడా అని చూస్తే ఐదు విడతల్లో ఇస్తానని, మూడు విడతలు ఇచ్చానని చెబుతున్నాడు. మిగిలిన రెండు విడతలు ఇప్పటికైనా ఇచ్చాడా..? కానీ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు మీ బ్యాంకుల్లో వేస్తానని చెబుతున్నాడు.. ఇది మోసం కాదా.. ఇదే సొమ్ము రెండేళ్ల కిందట ఇచ్చి ఉంటే వడ్డీలకైనా వచ్చేది.. ఎన్నికలకు మూడు రోజుల వరకు ఇవ్వనని అంటిపెట్టుకొని కూర్చొని రైతులకు వడ్డీల మీద వడ్డీలు భారం మోపిన వ్యక్తి చంద్రబాబు.. ఈయన మనిషేనా..? ఎక్కడా రుణమాఫీ జరిగితే రుణాలు తగ్గాలి.. కానీ చంద్రబాబు పాలనలో పెరిగాయి. ఎక్కడా రుణాలు తగ్గలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రూ. 87,612 కోట్లు ఉన్న రుణాలు అక్షరాల లక్షా 50 వేల కోట్లకు చేరిందంటే రుణాలు మాఫీ చేశాడా.. లేక రైతులను రుణాల్లోకి నెట్టాడా అని ప్రశ్నిస్తున్నాను చంద్రబాబును. 

చంద్రబాబును నమ్ముకొని మోసపోయిన రైతులు ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారంటే.. కరువు వచ్చినా పట్టించుకునే నాధుడు లేడు. కరువు వస్తే ప్రభుత్వం ఆదుకుంటుందనే రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రైతులకు చేసిన అతి ఘోరమైన అన్యాయం ఏమిటంటే.. గతంలో రైతులకు ఇచ్చే సున్నావడ్డీని పూర్తిగా ఎగరగొట్టాడు. చివరకు రైతులకు బీమా సొమ్ము కూడా ఇవ్వకుండా ఎగరగొట్టిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు. ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు హయాంలో కనీసం రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చాయా.. తన సొంత కంపెనీ హెరిటేజ్‌ కోసం రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు తానే కొనుగోలు చేసి దళారీలకు తానే కెప్టెన్‌ అయి రైతుల జీవితాలు తాకట్టుపెడుతున్నాడు. 

రైతులను ఉద్దేశించి నాబార్డు నివేదిక ఇచ్చింది. వ్యవసాయ దారులకు నెలవారికి సగటున వస్తున్న ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌ 29 రాష్ట్రల్లో 28వ రాష్ట్రమంట. చిట్ట చివర రెండో రాష్ట్రంగా ఉందని ఏపీ. అదే నాబార్డు నివేదిక రైతుల ఆదాయ వ్యయాల్లో రైతులకు మిగులుతున్న డబ్బుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ది దేశంలోనే 29వ స్థానమంట. అంటే చిట్టచివర ఉన్నాం. రైతుల నెత్తిన ఉన్న అప్పు చూస్తే దేశంలోనే మనం రెండో స్థానంలో ఉన్నాం. రైతులు ఏ స్థాయిలో అప్పుల ఊబిలో ఉన్నారని నాబార్డు నివేదిక చెబుతుంది. దేశం మొత్తం మీద అప్పులపాలైన జనాభా 45 శాతం ఉంటే.. మన రాష్ట్రంలో 75 శాతం మంది ఉన్నారని నాబార్డు నివేదక చెబుతుంది. మైక్రో ఫైనాన్స్‌ ఊబిలో 60 శాతం జనాభా కూరుకుపోయారని నాబార్డు నివేదిక ఇస్తుంది. రైతులు ఏ స్థితిలో ఉన్నారో ఇంతకంటే వేరే నిదర్శనాలు అవసరమా అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా.. 

పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు అక్షరాల రూ. 14,205 కోట్లు, చంద్రబాబు ముఖ్యమంత్రి స్థానం నుంచి దిగిపోయే నాటికి వడ్డీలతో కలిసి తడిసిమోపెడై అక్షరాల రూ. 26 వేల కోట్లు దాటింది. రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన మాటకు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు గతంలో సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత సున్నావడ్డీ ఎగరగొట్టాడు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల గురించి అసెంబ్లీలో ప్రశ్న వేశాం.. మీకు డ్వాక్రా రుణమాఫీ చేసే ఉద్దేశం ఉందా అని ప్రశ్న వేస్తే.. టీడీపీ ప్రభుత్వం సమాధానం ఇస్తూ.. ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేలేదు అని, చేసే ఉద్దేశం కూడా లేదని ఏకంగా రాతపూర్వకంగా అసెంబ్లీలో సమాధానం చెప్పింది. 

మొదటి సంతకంతో బెల్టుషాపులు రద్దు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఫోన్‌ చేసిన ఐదు నిమిషాల్లో మహిళలకు రక్షణ అన్నాడు. ఆడ పిల్లలు పుడితే రూ. 25 వేలు బ్యాంకుల్లో వేస్తానన్నాడు. వీటిల్లో కనీసం ఒక్కటైనా చంద్రబాబు అమలు చేశాడా.. ఇంతటి దారుణమైన పాలన జరుగుతుంది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మోసం తప్ప మరొకటి కనిపించదు. ఎన్నికలు రాబోతున్నాయి. మరో 13 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే మీరంతా గమనించే ఉంటారు. చంద్రబాబు ఎన్నికలు వస్తున్నాయని రోజుకో సినిమా చూపిస్తున్నాడు, రోజుకో డ్రామా చూపిస్తున్నాడు, ఎల్లో మీడియా కుట్రలు ఎలా పన్నుతున్నారో చూస్తున్నారు. జరగబోయే ఎన్నికల్లో కుట్రలు ఇంకా ఎక్కువవుతాయి. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపిస్తారు. చెప్పని అబద్ధం, చేయని మోసం కూడా ఉండదని మర్చిపోవద్దు. కుట్రల్లో భాగంగా ఎన్నికలు వచ్చే సరికి గ్రామాలకు మూటల మూటల డబ్బులు పంపించి ప్రతి చేతిలోను రూ. 3 వేలు పెట్టే కార్యక్రమం చేస్తాడు. మీరంతా గ్రామాల్లో ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను, ప్రతి అన్నను, ప్రతి అవ్వాతాతను కలిసి చెప్పండి. 

చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలు తీసుకొని మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్ను ముఖ్యమంత్రి చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు అన్న ప్రతి అక్క చేతిలో రూ. 15 వేలు పెడతాడని చెప్పండి. మన పిల్లలను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చదివించగలుగుతున్నామా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్‌ వంటి చదువులు చదివించే పరిస్థితి లేదు అక్కా.. పిల్లల చదువుల కోసం ఆస్తులు అమ్ముకుంటున్నాం.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను పెద్ద చదువులు ఎన్ని లక్షలు ఖర్చు అయినా అన్న ఉచితంగా చదివిస్తాడని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. 

పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి చెప్పండి చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అని చెప్పండి. ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడు. ఒక్క రూపాయి మాఫీ చేసిన పరిస్థితి లేదు. గతంలో మనకు సున్నావడ్డీకే రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత సున్నావడ్డీ ఎగరగొట్టాడు. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఉన్న రుణాలన్నీ మొత్తం నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తాడని ప్రతి అక్కకు, ప్రతిచెల్లెమ్మకు చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకి రుణాలు వచ్చేది జగనన్నతోనే సాధ్యమని చెప్పండి.

పేదరికంలో అవస్థలు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్నముఖ్యమంత్రి అయిన తరువాత వైయస్‌ఆర్‌ చేయూత అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి అక్క చేతిలో రూ. 75 వేలు నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. 

గ్రామాల్లోని ప్రతి రైతు దగ్గరకు వెళ్లి చెప్పండి. చంద్రబాబును నమ్మి ఓట్లు వేశాం. రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని ప్రతి రైతన్నకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలతో మోసపోవద్దు అన్నా.. 20 రోజులు ఓపికపట్టు అన్న.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రతి రైతన్నకు మే మాసం వచ్చే సరికి పంట పెట్టుబడికి రూ. 12,500లు అందిస్తాడని, అక్షరాల పెట్టుబడుల కోసం రూ. 50 వేలు ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం అందిస్తాడని ప్రతి రైతుకు చెప్పండి. అన్నముఖ్యమంత్రి అయిన తరువాత గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు..  గిట్టుబాటు ధరలకు కూడా గ్యారెంటీ ఇస్తాడని చెప్పండి. 

అవ్వాతాతల దగ్గరకు వెళ్లండి. రెండు నెలల కిందట పెన్షన్‌ ఎంత వచ్చేదని అడగండి.. పెన్షన్‌ వచ్చేది కాదని, లేకపోతే రూ. వెయ్యి మాత్రమే వచ్చేదని వేలెత్తి చూపిస్తుంది. ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న రూ. 2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే ఈ చంద్రబాబు రూ. 2 వేలు ఇచ్చేవాడా అని ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి అవ్వా చంద్రబాబు మోసాలను బలికావొద్దు.. 20 రోజులు ఓపిక పట్టు అవ్వా.. తరువాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు.. ప్రతి అవ్వాతాతలకు పెన్షన్‌ రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి. 

ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఇల్లు లేదు. కట్టిస్తానన్న మాట పోయింది. 20 రోజులు ఓపిక పట్టు అన్నా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అక్షరాల 25 లక్షల ఇళ్లులు కట్టిస్తాడని చెప్పండి. రాజన్న రాజ్యంలో ఇళ్లులు కట్టడం చూశాం. మళ్లీ జగనన్నతోనే అది సాధ్యమని ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి.

నవరత్నాల్లోని ప్రతి అంశం ప్రతి కుటుంబంలోకి తీసుకొనిపోండి. నవరత్నాలతో మన బతుకులు మారుతాయి. మన ముఖాల్లో చిరునవ్వు వస్తుంది. నవరత్నాలతో ప్రతి రైతన్న ముఖంలో ఆనందం చూడవచ్చని గట్టిగానమ్ముతున్నా.. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పురావాలి. రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని పలానా చేస్తానని చెబితే.. మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిన తరువాత ఇచ్చిన హామీ అమలు చేయకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుంది. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేశవరెడ్డి అన్నను నిలబెడుతున్నాను.. సౌమ్యుడిగా పేరుంది. మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ అన్నను నిలబెడుతున్నాను.. వెనుకబడిన కులస్తుడు, డాక్టర్‌గా మంచిపేరు సంపాదించాడు.. మంచి చేస్తాడని నమ్ముతున్నాను. వీరిద్దరి ఆశీర్వదించాలని పేరు పేరునా విజ్ఞప్తి చేస్తున్నాను. చివరకు మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ అని ఎవరూ మర్చిపోవద్దు. 

 

Back to Top